
తెలంగాణ బ్లాకుల్లో ఇంకా ఏపీ ప్రభుత్వ శాఖలా?
రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న విభజన తీరుపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ మంగళవారం సచివాలయంలో వివిధ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా విభజన ప్రక్రియ వేగవంతంగా జరగడం లేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అలాగే తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన బ్లాకులలో ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖలు కొనసాగడంపై ఆయన కొంత అసహనం వ్యక్తం చేశారు. త్వరితగతిన తెలంగాణ సచివాలయంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని రాజీవ్ శర్మ ముఖ్య కార్యదర్శులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా అన్ని శాఖలు ఎస్టాబ్లిష్మెంట్ ఫైళ్లు పూర్తి చేయాలని రాజీవ్ శర్మ ఉన్నతాధికారులకు సూచించారు.