
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర విభజన వివాదాల పరిష్కారం దిశగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉన్నతాధికారులు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయం బీఆర్‌కేఆర్ భవన్‌లో సమావేశమై మరో దఫా చర్చలు జరిపారు. ఏపీ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి (ఎక్స్‌అఫీషియో) ఎల్.ప్రేమ్‌చంద్రారెడ్డి, తెలంగాణ ఆర్థిక శాఖ సీనియర్ కన్సల్టెంట్, రిటైర్డ్ ఐఏఎస్ ఎన్.శివశంకర్‌ల నేతృత్వంలో ఇరు రాష్ట్రాల అధికారులు సమావేశమై చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన చట్టంలోని షెడ్యూల్-9లో 89 ప్రభుత్వ రంగ సంస్థలుండగా, ఇప్పటికే 53 సంస్థల విభజన విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. మిగిలిన వాటిలో నాలుగు సంస్థల విభజనపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోయినా, చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని అధికారవర్గాలు వెల్లడించాయి. వచ్చే సోమవారం మళ్లీ సమావేశమై చర్చలను ముందుకు కొనసాగించాలని నిర్ణయించారు. ఇచ్చిపుచ్చుకునే విధానంలో చర్చల ద్వారా విభజన వివాదాలు పరిష్కరించుకోవాలని ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కె.చంద్రశేఖర్‌రావులు నిర్ణయించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment