హైదరాబాద్ : గవర్నర్ నరసింహన్ సలహాదారు ఏఎన్ రాయ్ బుధవారం సచివాలయానికి విచ్చేశారు. డి బ్లాక్లోని తన ఛాంబర్ను ఆయన పరిశీలించారు. అనంతరం సాధారణ పరిపాలన శాఖ అధికారులతో సమావేశం అయ్యారు. కాగా మరో సలహాదారు సలావుద్దీన్ ఈరోజు మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టనున్నారు.
కాగా గవర్నర్ నరసింహన్‌కు సలహాదారులుగా ఇద్దరు ఉన్నతాధికారులను కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియమించిన విషయం తెలిసిందే. ఈ మేరకు మహారాష్ట్ర డీజీపీగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐపీఎస్ అధికారి ఎ.ఎన్.రాయ్, అలాగే రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఐఏఎస్ అధికారి సలావుద్దీన్ అహ్మద్‌లు నియమితులయ్యారు.
రాష్ట్రపతి పాలనతోపాటు రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉండనుండడం, ఇక్కడి పాలన పగ్గాలు గవర్నర్ చేతిలోకి వెళ్లనున్నందున.. ఆయన సలహాదారులుగా వీరిద్దరినీ కేంద్ర హోంమంత్రిత్వశాఖ నియమించింది. ఉమ్మడి రాజధాని పాలన అంశాల్లో వీరు గవర్నర్‌కు సహకరిస్తారు. ఇదిలా ఉండగా వీరిద్దరికీ నగరంలోని దిల్‌కుశ్ అతిథిగృహంలో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దిల్‌కుశ్ అతిథిగృహం రాజ్‌భవన్‌కు పక్కనే ఉన్నందున.. గవర్నర్‌కు అందుబాటులో సలహాదారులుంటారనే అభిప్రాయంతో వారికి ఇక్కడే కార్యాలయాలను కేటాయించనున్నారు.
సచివాలయంలో గవర్నర్ సలహాదారు
Published Wed, Apr 2 2014 12:16 PM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM
Advertisement
Advertisement