'ర్యాగింగ్ చేయాలంటే భయపడేలా చర్యలు'
గుంటూరు: అమ్మాయిలను ర్యాగింగ్ చేయాలంటే భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని విచారణ కమిటీకి రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి విజ్ఞప్తి చేశారు. విచారణ కమిటీలో విద్యార్థి సంఘాల నేతలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థలు ప్రతినిధులు ఉంటే బాగుందనేది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ ఏవిధంగా ఉంటుందో చూడాలన్నారు.
విద్యార్థులు లేకుండా విచారణ ఏంటో తమకు అర్థం కావడం లేదని వాపోయారు. యూనివర్సిటీని తెరిపించి విద్యార్థులు వచ్చిన తర్వాత మళ్లీ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ తో మాట్లాడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. యూనివర్సిటీ వ్యవస్థ అత్యంత అధ్వాన్నంగా ఉందని కమిటీకి చెప్పామని తెలిపారు.