న్యాయం జరగకపోతే ఆత్మహత్యే | Rishiteswari's parents wants to justice | Sakshi
Sakshi News home page

న్యాయం జరగకపోతే ఆత్మహత్యే

Published Fri, Jul 31 2015 3:37 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

న్యాయం జరగకపోతే ఆత్మహత్యే - Sakshi

న్యాయం జరగకపోతే ఆత్మహత్యే

* మా బిడ్డ మృతికి కారకులైన వారిని కఠినంగా శిక్షించాలి
* రిషితేశ్వరి తల్లిదండ్రుల డిమాండ్

సాక్షి, గుంటూరు: తమ బిడ్డ మరణంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి తల్లి దుర్గాబాయి డిమాండ్ చేశారు. మరే ఆడపిల్లకు ఇలాంటి పరిస్థితి రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. రిషితేశ్వరి మృతిపై ప్రభుత్వం నియమించిన కమిటీ ముందు గురువారం వాదనలు వినిపించిన అనంతరం ఆమె తన భర్త మురళీకృష్ణతో కలసి మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంకి తమ గోడు చెప్పుకుంటామని, న్యాయం జరగకపోతే నాగార్జున వర్సిటీ ముందు ఆత్మహత్య చేసుకుంటామని తేల్చిచెప్పారు.

రిషితేశ్వరి మృతికి కారకులైన వారిని బతకనివ్వకూడదని, అమ్మాయిల జోలికి వెళ్లాలంటే భయపడేలా కఠినమైన శిక్ష వేయాలని పేర్కొన్నారు. వర్సిటీలో విద్యార్థి సంఘాలు, విద్యార్థులు, మీడియా సహకారంతో పోరాటం కొనసాగిస్తున్నామన్నారు.
ర్యాగింగ్‌పైనే మా పోరాటం: ‘‘మా అమ్మాయిలా మరే ఆడపిల్లపై అఘాయిత్యాలు జరగకూడదనే ఉద్దేశంతో వర్సిటీలో ర్యాగింగ్‌ను లేకుండా చేసేందుకు పోరాడుతున్నాం’’ అని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ చెప్పారు. సీని యర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారంటూ తమ బిడ్డ జూన్ 18న ప్రిన్సిపల్ బాబూరావుకు ఫిర్యాదు చేిసినా పట్టించుకోకపోవడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందన్నారు.

వర్సిటీ విద్యార్థులకు సెలవులు ప్రకటించి విచారణ చేపడితే సరైన ఆధారాలు లభించవని పేర్కొన్నారు. కళాశాలలు తెరిచిన తరువాత ఐదు రోజులపాటు విచారణ నిర్వహిస్తే కమిటీకి సరైన ఆధారాలు దొరుకుతాయన్నారు. కమిటీ ముందు 10 శాతం మంది విద్యార్థులు కూడా వాదన వినిపించలేదని, వర్సిటీలో బహిరంగ విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రిన్సిపాల్‌పై ఫిర్యాదు చేసిన అధ్యాపకులను సస్పెండ్ చేస్తున్నారని, వారిపై సస్పెన్షన్ ఎత్తివేయాలని కమిటీని కోరామన్నారు. ర్యాగింగ్ భూతాన్ని తరిమేసి విశ్వవిద్యాలయాన్ని ప్రక్షాళన చేయాలన్నారు.  
 
నేడు కళాశాలల బంద్
రిషితేశ్వరి ఆత్మహత్య కేసు విచారణను విద్యార్థుల సమక్షంలోనే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కళాశాలల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య తెలిపారు. పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ రబ్బానీ మాట్లాడుతూ.. ప్రిన్సిపాల్ బాబూరావు పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడంతో పాటు ఘటనకు బాధ్యులైన వారిని కళాశాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
 
ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకోవాలి
సాక్షి, గుంటూరు: రిషితేశ్వరి మృతిపై ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీ రెండోరోజు గురువారం ఏపీలోని ఆచార్య నాగార్జున వర్సిటీలో పలువురిని విచారించింది. వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్యతోపాటు మరి కొంద రు విద్యార్థులు కమిటీ సభ్యులను కలిశారు. రిషితేశ్వరి మరణంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.  రిషితేశ్వరి తల్లిదండ్రులు మురళీకృష్ణ, దుర్గాబాయి కమిటీ ముందు హాజరై వాదనలు వినిపించారు. తమ బిడ్డకు జరిగిన అన్యాయం, ఆమె మృతిపై తమకున్న అనుమానాలు, వర్సిటీలోని ర్యాగింగ్ భూతం గురించి వివరించారు. కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావుపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.  శుక్రవారం ఎవరైనా కలిస్తే వారి వాదనలు వినడంతోపాటు, మరోసారి పోలీసు, వర్సిటీ అధికారులతో భేటీ అవ్వాలని కమిటీ నిర్ణయించినట్లు తెలిసింది.
 
కీలక సమాచారం సేకరించాం
‘‘రెండు రోజులపాటు నిర్వహించిన విచారణలో అధికారులతోపాటు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి కీలకమైన సమాచారం సేకరించాం. వర్సిటీలో దురదృష్టకరమైన సంఘటన జరిగింది. విద్యార్థిని మృతికి గల కారణాలు, వర్సిటీలో పరిస్థితులపై సమగ్ర విచారణ జరిపాం. విచారణకు హాజరు కాని వారు
balasubramanyamsarasa@yahoo.com,
vsu.vc1@gmail.com, vvvbnaidu55@gmail.com,
vbknaidu1956@gmail.com,
registrarmahila@yahoo.com
అనే ఈ-మెయిల్ అడ్రస్‌లకు తమ అభిప్రాయాలు పంపితే పరిగణనలోకి తీసుకుంటాం’’      
- కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement