ఏఎన్‌యూలో విద్యార్థి సంఘాల మండిపాటు
ర్యాగింగ్‌పై కఠిన చర్యలకు పూనుకోవడం లేదని ఆవేదన
వ్యవస్థలో లోపాలు సరిదిద్దకుండా ర్యాగింగ్‌ను నిరోధించలేమని స్పష్టీకరణ
ఇవే విషయాలపై మంత్రి గంటా శ్రీనివాసరావును ప్రశ్నించిన సంఘాల నేతలు
గుంటూరు : ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం(ఏఎన్‌యూ)లో ర్యాగింగ్ నిరోధానికి కఠిన చర్యలు తీసుకోని ప్రభుత్వం కేవలం కమిటీల పేరుతో కాలయాపన చేస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు మండి పడుతున్నారు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి బలవన్మరణంపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ స్పష్టమైన నివేదిక ఇచ్చినప్పటికీ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని, తాజాగా అదే కళాశాలలో జరిగిన ర్యాగింగ్ ఘటనపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు ద్విసభ్య కమిటీని వేస్తున్నట్టు ప్రకటించడాన్ని విద్యార్థి సంఘాలు ఆక్షేపించాయి.
ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ కళాశాలలో తాజాగా సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈ ఘటనపై మంత్రి గంటా స్పందించి మంగళవారం వర్సిటీకి విచ్చేసి అధికారులతో సమావేశమ య్యారు. దీనిపై శ్రీకాకుళం అంబేడ్కర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణమోహన్, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉదయలక్ష్మిలతో ద్విసభ్య కమిటీ వేస్తున్నట్టు చెప్పి, నివేదిక ఇవ్వాలంటూ మంత్రి ఆదేశించారు.అయితే , కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఎలా పనిచేస్తున్నాయి, పదే పదే ర్యాగింగ్‌కు కారణాలు ఏమిటి? అనే విషయాలను పరిశీలించకుండా కేవలం కమిటీలు వేయడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం చెందుతున్నాయి. వీటివల్ల బాధితులకు న్యాయం జరగడం లేదని, బాధ్యులపై కేసులు నమోదు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై సుబ్రహ్మణ్యం కమిటీ నివేదిక మేరకు వర్సిటీలో కోట్ల రూపాయలు ఖర్చు చేసి సీసీ కెమెరాలు, విద్యార్థులకు ఐడీ కార్డులు, ర్యాగింగ్ నిరోధక బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప, వ్యవస్థలో ఉన్న లోపాలపై దృష్టి సారించలేదంటున్నారు. ఈ కారణంగానే ర్యాగింగ్ పునరావృతమవుతోందని చెపుతున్నారు.
యూనివర్సిటీలో కనిపించని ఇన్‌చార్జి వీసీ
విద్యార్థిని రిషితేశ్వరి ఘటన అనంతరం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయానికి సీనియర్ ఐఏఎస్ అధికారి బి.ఉదయలక్ష్మిని ఇన్‌చార్జి వీసీగా నియమించారు. మొదట్లో రెండు, మూడు రోజులపాటు హడావుడి చేసిన ఆమె ఆ తరువాత వర్సిటీలో కనిపించ లేదు. వారంలో మూడు రోజులు ఏఎన్‌యూలో ఉండి ర్యాగింగ్ వంటి కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పిన ఆమె ఈ వంద రోజుల్లో పట్టుమని పది రోజులు కూడా వర్సిటీకి రాలేదు. ఇన్‌చార్జి వీసీ సక్రమంగా రావడం లేదని, కొత్త వీసీని నియమించాలని కొందరు విద్యార్థులు ఈ సందర్భంగా మంత్రి గంటా దృష్టికి తెచ్చారు.
ర్యాగింగ్‌పై నోరు మెదపని మంత్రి ...
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో అధికారులు, విద్యార్థులతో సమావేశమైన మంత్రి గంటా శ్రీనివాసరావు ఇక్కడ జరుగుతున్న ర్యాగింగ్‌పై మాత్రం నోరు మెదపలేదు. పైగా విద్యార్థుల్లో ఆలోచనా శక్తి పెరిగిందని, ర్యాగింగ్ వల్ల ఆత్మహత్యలకు పాల్పడకుండా ధైర్యంగా ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాల నేతలు కొందరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ర్యాగింగ్ ఆగదని, వ్యవస్థలో లోపాలను సరిదిద్దకుండా ర్యాగింగ్‌ను ఎలా నిరోధిస్తారంటూ మంత్రిని ప్రశ్నించారు. ర్యాగింగ్ జరిగినప్పుడల్లా కమిటీల పేరిట కాలయాపనచేయడం మినహా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కమిటీలతో కాలక్షేపం!
Published Wed, Nov 25 2015 1:11 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM
Advertisement
Advertisement