
నాగార్జున వర్సిటీ ఖాళీ!
నాగార్జున యూనివర్సిటీ (గుంటూరు) : ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వచ్చే నెల 4 వ తేదీ వరకు సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఎట్టకేలకు తమ హాస్టల్ గదులను ఖాళీ చేసి వెళ్లిపోయారు. వర్సిటీలో సుమారు ఐదు వేల మంది విద్యార్థులు ఉండగా, అందులో సుమారు రెండు వేల మంది విద్యార్థులు వర్సిటీలోని హాస్టల్ గదుల్లో ఉంటూ చదువుకుంటున్నారు. శనివారం మధ్యాహ్నం లోగా హాస్టల్ గదులు ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు హుకూం జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు శనివారం కూడా నిరసనను కొనసాగించారు.
అయితే చివరికి శనివారం సాయంత్రానికి వర్సిటీని విడిచిపెట్టి స్వస్థలాలకు బయల్దేరి వెళ్లారు. దీంతో రాత్రి వేళ సిబ్బంది వర్సిటీలోని హాస్టల్ గదుల వద్ద ఉన్న విద్యార్థి సంఘాల ప్యానెళ్ల బోర్డులను తొలగించారు. అలాగే భద్రత దృష్ట్యా వర్సిటీలోని పలు చోట్ల సీసీ కెమెరాలను కూడా అమర్చారు. కాగా వర్సిటీకి సెలవులు ప్రకటించినప్పటికీ పాలన యథావిధిగా కొనసాగుతుంది. టీచింగ్, నాట్ టీచింగ్ సిబ్బంది విధులకు హాజరవుతారు. విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యతో తలెత్తిన ఆందోళలు సద్దుమణిగేందుకు వర్సిటీకి సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.