ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. వర్సిటీ అక్రమాలు, అవినీతికి నిలయంగా మారుతోంది.
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రతిష్ట మసకబారుతోంది. వర్సిటీ అక్రమాలు, అవినీతికి నిలయంగా మారుతోంది. సొంత ప్రయోజనాల కోసం కొందరు చేస్తున్న వర్గ రాజకీయాలతో విద్యార్థుల మధ్య వైషమ్యాలు చోటుచేసుకుంటున్నాయి. ఉన్నతాధికారులు ఉదాశీనత కారణంగా ఇలాంటి ఘటనలు వర్సిటీలో సర్వసాధారణమయ్యాయి. గతంలో దొంగతనాలు, అవినీతి , పరీక్షా భవన్, దూరవిద్యాకేంద్రాల్లో వెలుగుచూసిన కుంభకోణాల కేసులు ముగింపునకు నోచుకోక నేటికీ పెండింగ్‌లో ఉన్నాయి.
దీంతో ఏం చేసినా తమకేమీ కాదనే ధైర్యంతో అవినీతిపరులు, కీచకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీలో ఏ సంఘటన జరిగినావర్గ, కుల రంగు పూసి విషయాన్ని పక్కదారి పట్టించటం సాధారణంగా మారింది. ఏదైనా అవినీతి అంశం వెలుగులోకి వచ్చినపుడు బాధ్యులకు కొందరు నాయకులు కొమ్ము కాస్తున్నారు. ఉన్నతాధికారులతో లాబీయింగ్ చేసి, ఏదోవిధంగా దానిని కనుమరుగు చేయటం ఇక్కడ మామూలైపోయింది.
అధికారుల తీరుపై విమర్శలు
అవినీతి, అక్రమాలను నియంత్రించటంతో విశ్వవిద్యాలయం అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏదైనా ఘటన జరిగినపుడు దానిపై విచారణ కమిటీ వేయటం, తరువాత ఏమీ తేల్చకుండానే వదిలేస్తున్నారు. వెలుగులోకి వచ్చిన అవినీతి, అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఉద్దేశపూర్వకంగానే ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంఘటనలు జరిగినపుడు రెండుమూడు రోజులు హడావుడి చేయటం ఆ తరువాత మిన్నకుండిపోవడం యూనివర్సిటీలో మామూలైపోయింది.
చాలా ఘటనలు విచారణ కమిటీల పేరుతో మగ్గుతుండగా, మరికొన్ని విచారణ ముగిసినా, పాలకమండలి ఆమోదం పేరుతో ఆ ఫైళ్లను పక్కన పడేస్తున్నారు. తాజాగా మంగళవారం ఇంజినీరింగ్ విద్యార్థినిపై అదే విభాగానికి చెందిన అసిస్టెంట్ ఫ్రొఫెసర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని కేసు నమోదైంది. దీనిపై కూడా వర్సిటీ అధికారులు ఓ కమిటీని నియమించి చేతులు దులుపుకున్నారని పలువురు విద్యార్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇకనైనా అధికారులు మేల్కొని అవినీతి, అక్రమాలు, వేధింపుల ఘటనలను రూపుమాపేందుకు చర్యలు తీసుకోకపోతే ఆచార్య నాగార్జున ప్రతిష్ట మరింత దిగజారుతుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.