ముమ్మరంగా ప్లీనరీ ఏర్పాట్లు
► పూర్తయిన హాల్ పనులు
► ఏర్పాట్లను పరిశీలించిన పలువురు నాయకులు
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ప్రాంగణంలో ఈ నెల 8, 9 తేదీల్లో జరగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీకి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్లీనరీ సమావేశాల కోసం రెండు హాల్స్‌ను ప్రత్యేకంగా సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఒక హాల్ పనులు పూర్తయ్యాయి. హాల్స్‌లో పార్టీ నాయకులు, వివిధ జిల్లాల ప్రతినిధులు కూర్చొనేందుకు ఏర్పాటు చేస్తున్నారు.
భోజనాలకు ప్రత్యేక ప్రాంతాన్ని కేటాయించారు. ప్లీనరీ ప్రాంగణంలో కేటగిరీల వారీగా బారిగేడ్లు ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్ కోసం విడిగా స్థలాన్ని గుర్తించారు. ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. వర్షాల వల్ల ప్లీనరీకి ఇబ్బంది తలెత్తకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటున్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన పార్టీ నాయకులు
ప్లీనరీ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆదివా రం పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త దుట్టా రామచంద్రారావు, విజయవాడ నగర అధ్యక్షుడు వెలంపల్లి శ్రీనివాస్, కృష్ణా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు కాలే పుల్లారావు, విజయనగరం జిల్లా నాయకుడు చిన్న శ్రీను, ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు బూదాల శ్రీను, మదిర ప్రభాకర్, తోకల శ్యామ్‌కుమార్, కృష్ణా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ లాతర్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తంగిరాల రామిరెడ్డి, తనుబుద్ధి చంద్రశేఖర రెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పెనుమాక రవి ఏర్పాట్లను పరిశీలించిన వారిలో ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ ముఖ్య నేతలు బొత్స సత్యనారాయణ సోమవారం ప్రాంగణాన్ని సందర్శిస్తారని రఘురాం తెలిపారు.