ప్లీనరీలో సింహపురి సందడి
► జిల్లా నుంచి భారీగా తరలి వెళ్లిన పార్టీ నేతలు
►స్థానిక సంస్థల అంశంపై తీర్మానం ప్రవేశపెట్టిన గోవర్ధన్‌రెడ్డి
►వెన్నుపోటే చంద్రబాబు వైఖరి అని ఎమ్మెల్యే అనిల్ విమర్శ
►అతి విశ్వాసం వద్దన్న ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి
నెల్లూరు : గుంటూరులోని నాగార్జున యూని వర్సిటీ ఎదుట వైఎస్సార్ ప్రాంగణంలో రెండు రోజులపాటు నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో నెల్లూరు జిల్లా నేతలు సందడి చేశారు. జిల్లాలోని 10 నియోజకవర్గాల నుంచి వేల సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలి వెళ్లాయి. అక్కడ మన జిల్లా నేతలకు అధిక ప్రాధాన్యత లభించింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలు సభలో కీలకంగా వ్యవహరించారు. ప్రజా సమస్యలు, రాజకీయ అంశాలపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రసంగించారు.
లోక్‌సభలో వైఎస్సార్ సీపీ పక్ష నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్ పలు అంశాలపై ప్రసంగించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి జిల్లాలోని ప్రాధాన్యత అంశాలపై శనివారం తీర్మానాలు ప్రవేశపెట్టగా, ఆదివారం స్థానిక సంస్థల అంశంపై తీర్మానాన్ని ప్లీనరీ ముందు ఉంచారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్‌కుమార్ యాదవ్ రాజకీయ అంశాలపై మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తీరుపై ధ్వజమెత్తగా, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రాష్ట్రంలో కుంటుపడిన విద్య, వైద్య విధానాలపై ప్రసంగించారు.
రాజ్యాంగేతర శక్తులుగా జన్మభూమి కమిటీలు
జన్మభూమి కమిటీలు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తూ స్థానిక సంస్థలు ఉనికి కోల్పోయేలా పనిచేస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సర్పంచ్‌లు, ఎంపీటీలు, జెడ్పీటీసీల వ్యవస్థను నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీల ద్వారానే పెన్షన్లు, ఇళ్లు, ఇతర పథకాల్ని కేటాయించడం అత్యంత దారుణమన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రతినిధులు ఉన్న ప్రతిచోట ఇలాగే వ్యవహరిస్తున్నారని, ఇది చెడు సంప్రదాయమని అన్నారు. దీనివల్ల స్థానిక సంస్థల ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తనతోపాటు అనేక మంది జెడ్పీ చైర్మన్లుగా పనిచేసి స్థానిక సంస్థల బలోపేతానికి కృషి చేశారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి గుర్తు చేశారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలను గౌరవించడంతోపాటు, బలోపేతం చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని, అలాగే రాజ్యాంగ వికేంద్రీకరణ జరగాలని కోరుతూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.
వెన్నుపోటే చంద్రబాబు నైజం
వెన్నుపోటే చంద్రబాబు నైజమని, మోసమే శ్వాసగా బతుకుతున్న వ్యక్తి ఆయన అని నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ ధ్వజమెత్తారు. వైఎస్ హయాంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేదని, ఇప్పుడు కరువు కోరల్లో అలమటిస్తోందని మండిపడ్డారు. రాజకీయాలన్నా, రాజకీ య నేతలన్నా చులకన భావన ఏర్పడిన రోజుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి తన మొదటి సంతకంతోనే విశ్వసనీయతను పెంచారని గుర్తు చేశారు. ఇచ్చిన వాగ్దానాలకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖరరెడ్డి కాగా.. వెన్నుపోటు, మోసమో ఊపిరిగా 600 హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయని నీచ రాజకీయ నేత చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. నోబుల్ ప్రైజ్ ఇస్తానని, మద్యం తాగమని రకరకాలుగా మాట్లాడుతున్న చంద్రబాబుకు పిచ్చిపట్టిందని, ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు.
అతి విశ్వాసం వద్దు
పార్టీ శ్రేణులు ఎవరూ అతివిశ్వాసానికి పోకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సూచించారు. పార్టీ శ్రేణులు, రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయడానికి సిద్ధంగా ఉన్నారని, దానిని నాయకులు చక్కగా వినియోగించుకోవాలని, అతి విశ్వాసానికి పోకుండా కష్టపడి పనిచేసి అధికారంలోకి రావాలని సూచించా రు. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వాలని కోరారు. గెలుపు సామర్థ్యం లేని నేతలకు టిక్కె ట్లు ఇవ్వడం వల్ల అభ్యర్థితోపాటు పార్టీ కూడా ఇబ్బం ది పడుతుందన్నారు.
పర్యవసానంగా ఆ నియోజకవర్గంలోని ప్రజలు కూడా చాలా కష్టాలు పడతారని చెప్పారు. రాజన్న పాలన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని, అందరూ ఇప్పటినుంచే కలిసి కట్టుగా శ్రమించి పనిచేయాలని పిలుపునిచ్చారు. నంద్యాల ఉప ఎన్నికలో చంద్రబాబుకు చెంప పెట్టులా తీర్పు రావాలన్నారు. పోరాటానికి, పౌరుషానికి, త్యాగానికి, స్నేహానికి మారుపేరుగా ఉన్న రాయలసీమ గుండెచప్పుడుగా నంద్యాలకు పేరుందని గుర్తు చేశారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. నంద్యాల ఉప ఎన్నికలలో టీడీపీని చిత్తు చిత్తుగా ఓడించాలని కోటంరెడ్డి కోరారు.