బడుగుల బాంధవుడు | YS Vijayamma at YSRCP Plenary Meeting | Sakshi
Sakshi News home page

బడుగుల బాంధవుడు

Published Mon, Jul 10 2017 12:56 AM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

బడుగుల బాంధవుడు - Sakshi

బడుగుల బాంధవుడు

రాజశేఖర రెడ్డి పాలనలో పేదల ప్రభుత్వం: వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ  
టీడీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది
రాబోయే యుద్ధానికి కార్యకర్తలంతా సన్నద్ధం కావాలి
మీ అందరికీ అండగా నిలిచే జగన్‌ను ఆశీర్వదించండి
పార్టీ ప్లీనరీలో విజయమ్మ విజ్ఞప్తి


వైఎస్సార్‌ ప్రాంగణం నుంచి
‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి :
దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలించిన 2004–2009 మధ్య కాలంలో పేద ప్రజల ప్రభుత్వం ఉండేదని, ఆయన ప్రజాసంక్షేమానికి కాపలాదారుగా పనిచేశారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చెప్పారు. వైఎస్‌ పాలన స్వర్ణయుగమేనని అన్నారు. నా బిడ్డను కొందరు ఇబ్బంది పెడుతుంటే ఒక్కోసారి ఈ రాజకీయం ఎందుకు అని బాధ కలిగేది.. కానీ వైఎస్‌ ప్రేమించిన మీరందరూ నా బిడ్డకు తోడుగా ఉన్నారు కదా అని ధైర్యం వచ్చేది అంటూ ఆమె గద్గద స్వరంతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ మూడో జాతీయ ప్లీనరీలో రెండో రోజు ఆదివారం విజయమ్మ ప్రసంగించారు. వైఎస్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తొలగించే పరిస్థితి లేదన్నారు.

 ప్లీనరీలో విజయమ్మ  ప్రసంగం ఆమె మాటల్లోనే...
‘‘మహా నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మృతి చెంది 8 ఏళ్లు అవుతున్నా ఆయన ప్రజల జ్ఞాపకాల్లోంచి చెదిరిపోలేదు. ఆయన మంచితనం, ఆత్మీయత, ప్రేమ, మంచి మనస్సు ఎప్పటికీ మరిచిపోలేనివి. కాంగ్రెస్‌ పార్టీకి 35 ఏళ్లు వైఎస్‌ సేవ చేస్తే, వాళ్లు(కాంగ్రెస్‌ నాయకత్వం) చూపిన నిర్లక్ష్యం గుర్తుకొస్తే బాధనిపిస్తోంది. వైఎస్‌ కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చారు. 2004, 2009లో రాజశేఖరరెడ్డి కృషితో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కొత్త శకానికి ఆయన నాంది పలికారు. వైఎస్‌ అకాల మరణాన్ని తట్టుకోలేక ఎంతోమంది ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారి కుటుంబాలను ఓదార్చేందుకు యాత్ర చేస్తానని పావురాల గుట్టలో జగన్‌బాబు మాట ఇచ్చారు. కానీ, కాంగ్రెస్‌ హైకమాండ్‌ ఓదార్పు యాత్ర వద్దని చెప్పింది. జగన్‌కు సహకరించవద్దంటూ ఎమ్మెల్యేలను కట్టడి చేసింది. జగన్‌ ఏనాడూ సీఎం కావాలని కోరుకోలేదు. ఓదార్పు యాత్రకు అనుమతి ఇవ్వండి, 2014 ఎన్నికల్లో 41 మంది ఎంపీలను గెలిపించి ఇస్తామని సోనియాగాంధీకి చెప్పాం. ఆ రోజు 150 మంది ఎమ్మెల్యేలు జగన్‌ సీఎం కావాలని కోరుకున్నారు.  

వైఎస్‌ ఆశయాల కోసం పుట్టిన పార్టీ
రాజశేఖరరెడ్డి ఆశయాలు, సిద్ధాంతాల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టింది. కాంగ్రెస్‌ పార్టీకి రాజశేఖరరెడ్డి చాలా మంచివారు. జగన్‌ కాంగ్రెస్‌లో ఉన్నన్నాళ్లూ మంచివాడే. కానీ, ఏ రోజైతే పార్టీ మారాడో ఆ రోజు నుంచే వేధింపులు మొదలుపెట్టారు. పార్టీ పెట్టిన వారం రోజులకే నోటీసులు ఇచ్చారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు కలిసి అబద్ధపు కేసులు పెట్టారు. అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి. అవి మీతో గాక ఇంకెవరితో పంచుకోగలను? సాధారణంగా 90 రోజుల్లో బెయిల్‌ ఇవ్వాలి. కానీ, విచారణ పేరుతో జగన్‌బాబును 16 నెలలు జైల్లో పెట్టారు.

నా బిడ్డను మీ చేతుల్లో పెట్టాను
వైఎస్సార్‌సీపీ జరుపుకున్న మొదటి ప్లీనరీలోనే జగన్‌బాబును మీ చేతుల్లో పెడుతున్నా అని మీకు అప్పగించాను. మీ చేతికి అప్పగించిన నా బిడ్డ ఈ రోజుకు కూడా మీ ప్రతి సమస్యలోనూ, ప్రతి పోరాటంలోనూ మీకు తోడుగా ఉన్నాడు. మీ పోరాటంలో పాలుపంచుకుంటూనే ఉన్నాడు. అసెంబ్లీ లోపలా, బయటా మీ అందరి మద్దతుతో పోరాడుతూనే ఉన్నాడు.

ఆ స్వర్ణయుగం మళ్లీ రావాలి
రాబోయే యుద్ధంలో తెలుగుదేశం ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది. అందరూ కష్టపడాలని కోరుతున్నా. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులుగా ఎవరిని నిర్ణయించినా సమిష్టిగా కృషి చేసి గెలిపించాలి. ఏ ఒక్కరూ బాధపడాల్సిన పనిలేదు, జగన్‌బాబు ఎవరినీ పోగొట్టుకోరు. అధికారంలోకి వస్తే అందరికీ సముచిత స్థానం లభిస్తుంది. ఇచ్చిన మాట తప్పే కుటుంబం కాదు మాది. జగన్‌బాబు మీ అందరికీ అండగా ఉంటాడు. మీరంతా జగన్‌ను ఆశీర్వదించండి. ఈ రోజే ఎన్నికలు ఉన్నాయన్నట్టుగా మీరందరూ కష్టపడి పని చేయాలి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాం నాటి స్వర్ణయుగం మళ్లీ రావాలి. ఆ యుగంలో మనమంతా బాగుండాలి’’ అని వైఎస్‌ విజయమ్మ ఉద్ఘాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement