ఉందిలే..మంచి కాలం | People of AP are looking forward for replacement of TDP Govt | Sakshi
Sakshi News home page

ఉందిలే..మంచి కాలం

Published Mon, Jul 10 2017 4:54 AM | Last Updated on Wed, Jul 25 2018 4:45 PM

ఉందిలే..మంచి కాలం - Sakshi

ఉందిలే..మంచి కాలం

కిక్కిరిసిన ప్లీనరీ ప్రాంగణం
స్వచ్ఛందంగా తరలివచ్చిన కార్యకర్తలు
వైఎస్సార్‌ సీపీ శ్రేణుల్లో భరోసా నింపిన వైఎస్‌ జగన్‌  
ఆకట్టుకున్న షర్మిల, విజయమ్మ ప్రసంగాలు
ఆనందంతో ఉప్పొంగిన గుంటూరు జిల్లా


సాక్షి, అమరావతి బ్యూరో : జనం జనం.. ఎటు చూసినా జనమే.. జై జగన్‌ నినాదాల హోరు.. పార్టీ జెండాలతో రెపరెపలు.. ఉరకలెత్తే ఉత్సాహంతో.. ప్లీనరీ రెండు రోజులూ ప్రాంగణంలో పండుగ వాతావరణం నెలకొంది. తమ పార్టీ పండుగకు రాష్ట్ర నలుమూలల నుంచి స్వచ్ఛందంగా వేలాది మంది కార్యకర్తలు తరలివచ్చారు. మేము సైతమంటూ మహిళలు ముందుకు కదిలారు. గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా గల ప్రాంగణంలో రెండు రోజుల ప్లీనరీ సమావేశాలు రాబోవు ఎన్నికలకు నాంది పలికాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగాలు భవిష్యత్తు మనదే అనే సంకేతాలను ప్లీనరీ వేదికగా ప్రజల్లోకి తీసుకెళ్లాయి. ఆదివారం రెండో రోజు సైతం ఊహించని దానికంటే రెట్టింపు స్థాయిలో ప్రజలు వచ్చారు. దీంతో ప్లీనరీ ప్రాంగణంలో, వెలుపలా పెద్ద ఎత్తున జనసందోహం కనిపించింది. తొమ్మిది కార్యక్రమాల పేరుతో చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరిలో ఆత్మస్థైర్యాన్ని నింపింది. జగన్‌ ప్రసంగిస్తున్నంతసేపు జై జగన్‌ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. అన్ని వర్గాలను స్పృశిస్తూ చేసిన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది.  

ప్రత్యేక ఆకర్షణగా విజయమ్మ, షర్మిల
రెండో రోజు ప్లీనరీ సమావేశంలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై.ఎస్‌.విజయమ్మ, జగన్‌ సోదరి షర్మిల ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వై.ఎస్‌.విజయమ్మ సభాస్థలికి చేరుకోగానే పార్టీ నేతలు, కార్యకర్తలు నిలబడి స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అమ్మ వచ్చిందంటూ కార్యకర్తలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. వై.ఎస్‌.విజయమ్మ చేసిన ప్రసంగం కార్యకర్తల్లో నూతన ఉత్తేజాన్ని నింపింది. ప్రత్యేకంగా షర్మిల చేసిన ప్రసంగం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. ప్రజలు సంతోషంగా ఉండాలన్నదే నాన్న కోరిక అయితే, అది జగనన్న సంకల్పమంటూ ఆమె కార్యకర్తల్లో ఆత్మ విశ్వాసాన్ని నింపారు. విశ్వసనీయతకు వైఎస్సార్‌ సీపీ మారు పేరంటూ తన ప్రసంగం ద్వారా మరోసారి చాటి చెప్పారు. నేతల ప్రసంగాల మధ్య మధ్యలో జగన్‌ లేచి అభివాదం చేయటం జనాన్ని పులకింపజేసింది. వైఎస్సార్‌ సీపీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ను ప్లీనరీలో జగన్‌ పరిచయం చేశారు.  

భరోసా నింపిన జగన్‌ ప్రసంగం
మధ్యాహ్నం 3 గంటల నుంచి 4.45 గంటల వరకు తొమ్మిది కార్యక్రమాలపై ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక 30 సంవత్సరాల ప్రజా సంక్షేమ పాలన చేయాలన్నదే తన ధ్యేయమంటూ జగన్‌ ప్రసంగిస్తూ.. ‘నాన్న ఫొటో పక్కన నా ఫొటో ఉండాలన్నదే నా కోరిక’ అనడంతో ఈలలు, కేరింతలతో ప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తమ మద్దతు తెలిపారు. ఉద్యోగుల డీఏ, కాపులకు జరిగిన అన్యాయం, మాదిగలకు చంద్రబాబు వెన్నుపోటు గురించి ఆయన ప్రస్తావిస్తూ... అధికారంలోకొచ్చాక అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తానని భరోసా ఇవ్వటంపై సభికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.

అన్న మాట.. నవరత్నాల మూట
అన్నొస్తున్నాడు.. మంచి రోజులు ముందున్నాయని ధైర్యంగా చెప్పండంటూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకొచ్చాక చేపట్టే తొమ్మిది కార్యక్రమాలను జగన్‌ ప్రకటించడంతో ప్రతి ఒక్కరి మోములో ఆనందం ఉప్పెనలా పొంగింది. ఈలలు, కేకలతో ప్రాంగణమంతా దద్దరిల్లింది.

అక్టోబరు 27 నుంచి పాదయాత్ర
అక్టోబరు 27 నుంచి రాష్ట్రమంతటా ఆరు నెలల పాటు పాదయాత్ర చేస్తున్నట్లు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. ఇడుపులపాయ నుంచి ప్రారంభించి తిరుమల కొండపైకి కాలినడకన వెళ్లి అక్కడి నుంచి ఇచ్ఛాపురం వరకు మూడువేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తానని వెల్లడించారు.

తీర్మాన ప్రసంగాల్లో జిల్లా నేతలు
ప్లీనరీలో పార్టీ జిల్లా తీర్మానాన్ని గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి ప్రవేశపెట్టారు. పులిచింతల ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. నాగార్జున కుడికాలువ కింద మూడేళ్లుగా పంటలు లేవని తెలిపారు. సాగర్‌ పరిరక్షణ పేరుతో కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. మిర్చి, పత్తి అపరాల కంపెనీలకు గిట్టుబాటు ధర వచ్చేలా చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. భూ పోరాటాలు, రాజధాని నిర్మాణంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాజధాని భూములతో ప్రభుత్వం దోపిడీకి పాల్పడుతోందని, 30 వేల ఎకరాలను రాజధాని పేరుతో తీసుకుని 20 ఎకరాల్లో మాత్రమే తాత్కాలిక భవనాలు నిర్మించారన్నారు.

ఇందులో కూడా రూ.1000 కోట్లు దోచుకున్నారని తెలిపారు. అన్ని వర్గాల రైతులను ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు. రాజధాని ప్రాంతంలో కేవలం భూ దోపిడీదారులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకే తప్ప ఎవరికీ మేలు జరగలేదన్నారు. మానవ వనరుల తీర్మానాన్ని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బలపర్చారు. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వారిని మంత్రిగా చేసి లోకేష్‌బాబుకు మూడు మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని తూట్లు పొడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆకట్టుకున్న ఫొటో గ్యాలరీ
దివంగత మహానేత డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ ప్రస్థానంతో కూడిన ఫొటోలతో ఏర్పాటు చేసిన గ్యాలరీ ప్రతినిధులను ఆకట్టుకుంది. పెద్ద ఎత్తున ప్రతినిధులు ఫొటోలను ఆసక్తికరంగా తిలకించారు. రెండోరోజు కూడా వైఎస్సార్‌ సీపీ అభిమానులు ఉత్సాహంగా రక్తదానం చేశారు. ప్లీనరీ ప్రారంభంలో వంగపండు ఉష బృందం ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి.  

కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), షేక్‌ మహమ్మద్‌ ముస్తఫా, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మోపిదేవి వెంకటరమణ, ఆతుకూరి ఆంజనేయులు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున, బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, రాష్ట్ర కార్యదర్శులు లేళ్ల అప్పిరెడ్డి, మేకతోటి సుచరిత, రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) లావు శ్రీకృష్ణదేవరాయలు, లక్కాకుల థామస్‌నాయుడు, కిలారి రోశయ్య, మందపాటి శేషగిరిరావు, ఈచంపాటి ఆచారి, మహ్మద్‌ నసీర్‌ అహ్మద్, సంయుక్త కార్యదర్శి షేక్‌ గులాం రసూల్, నియోజకవర్గ సమన్వయకర్తలు రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్, బొల్లా బ్రహ్మనాయుడు, కాసు మహేష్‌రెడ్డి, కావటి మనోహర్‌నాయుడు, కత్తెర హెనీ క్రిస్టీనా,  జెడ్పీటీసీలు కొలకలూరి కోటేశ్వరరావు, రామిరెడ్డి, ఎన్‌ సునీత, పార్టీ నేతలు, అనుబంధ విభాగాల నాయకులు అంగడి శ్రీనివాసరావు, కర్రా కోటేశ్వరరావు, పోలూరి వెంకటరెడ్డి, తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, నూనె ఉమామహేశ్వర్‌రెడ్డి, మామిడి రాము, కొత్తా చిన్నపరెడ్డి, డైమండ్‌బాబు, బండారు సాయిబాబు, కోవూరి సునీల్, పూర్ణచంద్రరావు, సయ్యద్‌మాబు, కంది సంజీవరెడ్డి, యేళ్ల జయలక్ష్మి, నూతలపాటి హనుమయ్య, పాణ్యం హనిమిరెడ్డి, మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కోటా పిచ్చిరెడ్డి, మాలె దేవరాజ్,  సఫాయితుల్లా, శానంపూడి రఘురామిరెడ్డి, మండేపూడి పురుషోత్తం, ఉప్పుటూరి నర్శిరెడ్డి, పానుగంటి చైతన్య, షేక్‌ రబ్బాని, ఉయ్యూరి సతీష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement