ఒక్కో బాణమై దూసుకెళ్దాం
♦ మాట తప్పడం మా రక్తంలోనే లేదు..
♦ అబద్ధాలు చెప్పడం మాకు చేత కాదు
♦ ఇక చంద్రబాబు పప్పులుడకవు..వారింట్లో ఉన్న ఆ ఒక్క పప్పు తప్ప...
♦ వైఎస్సార్‌సీపీ ప్లీనరీలో షర్మిల
వైఎస్సార్ ప్రాంగణం నుంచి
‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రతి ఒక్కరూ ఒక్కో బాణమై దూసుకెళ్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీకి ఉన్న బలం మరే పార్టీకి లేదని, ప్రజలకు వైఎస్సార్ మీద ఉన్న అభిమానం.. జగనన్న మీద ఉన్న నమ్మకమే ఈ బలానికి కారణమన్నారు. ఇచ్చిన మాట తప్పడం తమ రక్తంలో లేదని, అబద్ధాలు చెప్పడం తమకు చేత కాదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ ప్లీనరీ రెండో రోజైన ఆదివారం ఆమె ప్రసంగించారు. రైతులు, డ్వాక్రా మహిళలు, పేద విద్యార్థులు, టీడీపీని నమ్మి ఓట్లేసిన వారిని చంద్రబాబు నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. ‘మీ రాజన్న కూతురు.. మీ జగనన్న చెల్లెలు.. శిరస్సు వంచి, చేతులు జోడించి.. మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నా’నంటూ
షర్మిల ప్రారంభించిన ప్రసంగం ఆమె మాటల్లోనే...
‘‘నిన్న (శనివారం) వైఎస్సార్ గారి 68వ జయంతి. నాన్న లేని లోటు మాటల్లో చెప్పలేనిది. రుణమాఫీ, విద్యుత్ బకాయిల మాఫీ, ఉచిత విద్యుత్తు, ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెద్ద పీట వంటి కార్యక్రమాలు చేపట్టిన మహానేత వైఎస్సార్ తాను రైతు పక్షపాతినే అని గర్వంగా ఫీలయ్యారు. అద్భుత పాలన సాగించిన రాజశేఖరరెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
అదే జగనన్న సంకల్పం.. సిద్ధాంతం
ప్రజలు సంతోషంగా ఉండాలనేది నాన్న కోరిక అయితే.. అది ఇవాళ జగనన్న సంకల్పం. ఇచ్చిన మాట మీద నిలబడటం నాన్న నైజం అయితే అది ఇవాళ జగనన్న సిద్ధాంతం. చంద్రబాబు గారి లాగా రుణమాఫీ చేస్తామని అబద్ధపు వాగ్దానం ఇచ్చి ఉంటే 2014లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చి ఉండేది. కానీ ఇచ్చిన మాట తప్పడం కన్నా.. నాకు ప్రతిపక్షంలో కూర్చొవడమే ఇష్టం అని ఆ రోజు జగనన్న నాతో అన్న మాటలు నాకింకా గుర్తే. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి వచ్చిన ఓట్ల మెజార్టీ కేవలం ఐదు లక్షలే. అదీ మోదీ మీద సవారీ చేస్తే.. రుణ మాఫీ చేస్తానని తప్పుడు వాగ్ధానం ఇవ్వడం వల్ల వచ్చింది. ఇక చంద్రబాబు గారి పప్పులు ఉడకవు.. ఆయన ఇంట్లో ఉన్న ఆ ఒక్క పప్పు తప్ప.
ఆ తల్లి వేదన ఎవరికి చెప్పుకోగలదు?
ఎదురుగా వచ్చి దాడి చేయాలంటే ధైర్యం ఉండాలి. అది చంద్రబాబు గారికి ఎప్పుడూ లేదు. చంద్రబాబు గారికి తెలిసిందల్లా వెన్నుపోటు పొడవడమే. ఆయన భార్య భువనేశ్వరి గారికి దండం పెట్టాలి. జన్మ ఇచ్చిన తండ్రిని వెన్నుపోటు పొడిచినా, సొంత తండ్రిని అవమానించి ఆయన మరణానికి కారణమైనా.. ఆ మాంగల్యాన్ని చూసుకుని బతికేస్తోంది. ఎన్టీఆర్ గారి పటానికి దండం పెట్టుకుంటున్న ప్రతిసారి.. ఎన్టీఆర్ గారి కళ్లలోకి చూసుకుంటున్న ప్రతిసారి.. ఆ తల్లి మనసులో పడే వేదన ఎవరికి చెప్పుకోగలదు?
చంద్రబాబు నిప్పు కాదు.. తుప్పు..
చంద్రబాబు గారివి ఎప్పుడూ వెన్నుపోటు, మోసపూరిత, దిగజారిన రాజకీయాలే. లేకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి.. వైఎస్సార్ ఫొటో పెట్టుకుని, జగనన్న పేరు చెప్పుకొని గెలిచిన వారికి ఆశ చూపించి తెలుగుదేశం పార్టీలోకి చేర్చుకుని రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డాడు. ఇప్పటికి కూడా వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లి టీడీపీ తరఫున గెలిపించుకునే దమ్ము ఈ పిరికి చంద్రబాబుకు లేదు. టేపుల్లో బ్రీఫ్డ్ మీ అని తన గొంతుతో అడ్డంగా దొరికిపోయినా ఈ రోజు వరకు విచారణ జరగకుండా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలాంటి చంద్రబాబు నిప్పా? తుప్పా? కచ్చితంగా తుప్పే. వైఎస్సార్ సీపీ రైతుల పక్షం. దళితుల పక్షం. గిరిజనుల పక్షం. మైనార్టీల పక్షం. పేదల పక్షం. ప్రత్యేక హోదా పక్షం. వైఎస్సార్ సీపీ బలం... ప్రజలకు వైఎస్సార్ మీద ఉన్న అభిమానం. ప్రజలకు జగనన్న మీద ఉన్న నమ్మకం. ఈ బలం ఇంకా ఏ పార్టీకీ లేదు. ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు మనలో ప్రతి ఒక్కరూ ఒక్కో బాణమై దూసుకెళ్దాం. విజయం నిశ్చయం. మీ ద్వారా రాబోతున్నది రాజన్న రాజ్యం. తేబోతున్నది జగనన్న. దీన్ని సాధ్యం చేయబోతున్నది దేవుని దీవెన. ఇది తథ్యం.సెలవు’’.