పాము కంటే బాబు ప్రమాదం
♦ ప్లీనరీ విజయవంతంతో టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్
♦ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా ?
♦ నవరత్నాల్లాంటి పథకాలతో వైఎస్ పాలన
♦ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులు
గుంటూరు (పట్నం బజార్): పాము కాటుకు మందుందేమోగానీ సీఎం చంద్రబాబు విషకౌగిలికి మందు లేదని మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. కొందరు చంద్రబాబు ఎంగిలికూటికి కక్కుర్తిపడి వెళ్లిపోయినంత మాత్రాన ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్పారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించగలరా అని ప్రశ్నించారు. టీడీపీ పాలనలో రూ.3 లక్షల 70 వేల కోట్ల అవినీతి జరిగిందని, దీనిని మాయ చేసేందుకు వారికి సంబంధించిన కొన్ని పత్రికల్లో ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. నంద్యాలలో సైతం నీచ రాజకీయాలకు నాంది పలుకుతున్నారని ధ్వజమెత్తారు.
మహానాడును విశాఖ కుంభకోణం డబ్బుతో నిర్వహించారా ?
నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్లీనరీని టీడీపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయిందని ఎద్దేవా చేశారు. ఇంటిలిజెన్స్ వర్గాలే తొలి రోజు 40 నుంచి 50 వేల మంది వచ్చారని చెప్పాయన్నారు. ప్లీనరీని అవినీతి డబ్బుతో నిర్వహించారని వ్యాఖ్యలు చేస్తున్న అధికార పార్టీ నేతలు, మంత్రులు ఎక్కడ అవినీతి జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. మహానాడును విశాఖలో వచ్చిన భూ కుంభకోణం డబ్బుతోనే నిర్వహించారా అని ప్రశ్నించారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల వరకు ఖనిజ సంపదను దోపిడీ చేసిన విషయం వాస్తవమా ? కాదా ? అని ప్రశ్నించారు. ఒక్కొక్క మద్యం షాపు నుంచి రూ. 30 లక్షలు వసూలు చేస్తున్నారన్నారు. దివంగత ఎన్టీఆర్ తరువాత ఎంతో ధైర్యంతో మద్యపాన నిషేధం ప్రకటించిన నాయకుడు జననేత అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే మద్యపాన నిషేధంపై మాట్లాడగలరా ? అని సవాల్ విసిరారు.
నవరత్నాల్లాంటి పథకాలు
తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్లీనరీని చూసి టీడీపీ నేతలకు నెత్తిన బండపడ్డట్లు ఉందని ఎద్దేవా చేశారు. అసలు మంత్రులు ఏ మాట్లాడుతున్నారో వారికైనా అర్థమవుతందో లేదో తెలియని పరిస్థితులు దాపురించాయని విమర్శించారు. ప్రతి ఒక్కరికీ ధైర్యం కలిగించేలా తొమ్మిది పథకాలు ఉన్నాయని ప్రజలే అంటున్నారని చెప్పారు. ఈ పథకాలను చూసి చంద్రబాబుకు ఫీజులు మాడిపోయాయన్నారు.
త్వరలోనే వైఎస్ పాలన
పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ ప్లీనరీని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో వైఎస్ పాలన రాబోతుందన్నారు. అవినీతి డబ్బుతో ప్లీనరీ నిర్వహించారని వ్యాఖ్యలు చేస్తున్న మంత్రులు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. టీడీపీ నేతలను ఓటుతో కుళ్లబొడిచే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ అన్ని వర్గాలకు ఉపయోగపడేలా జగన్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు మాట్లాడుతూ సామాన్యులు తినే తిండిని ప్లీనరీలో పెట్టామని, మహానాడులాగా కాకినాడ కాజాలు, బాపట్ల బాద్‌షాలు, చీరాల చీకులు పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి షేక్ గులాం రసూల్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు కొత్తా చిన్నపరెడ్డి, నేతలు తిమ్మరాజు, శ్రీకాంత్ యాదవ్ పాల్గొన్నారు.