చంద్రబాబు టీడీపీకే ముఖ్యమంత్రి
♦ రాష్ట్రంలో వంచన పాలన..
♦ ఓటుకు నోటు కేసులో భయపడే విజయవాడ చేరుకున్న ముఖ్యమంత్రి
♦ 2019లో జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయం
♦ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాసు
చీపురుపల్లి/ గరివిడి: రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వంచన పాలన కొనసాగిస్తోందని, చంద్రబాబునాయుడు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర వ్యవహారాల కమిటీ సభ్యుడు, జిల్లా పరిశీలకుడు ధర్మాన కృష్ణదాస్ అన్నారు. చీపురుపల్లి నియోజకవర్గ స్థాయి ప్లీనరీ సమావేశాన్ని గురువారం సాయంత్రం గరివిడిలో గల మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర నాయకుడు బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయం ఆవరణలో నిర్వహించారు.
ముందుగా వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రాష్ట్రంలో ఆదర్శవంతమైన పరిపాలన కొనసాగితే.. చంద్రబాబునాయుడు హయాంలో హత్యలు, అరాచకాలు, మోసాలతో కూడిన పరిపాలన సాగిస్తున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ దగ్గర భయపడిన చంద్రబాబు హైదరాబాద్‌ను కేసీఆర్‌కు ధారాదత్తం చేసి విజయవాడకు పరుగు తీశాడన్నారు. మూడేళ్ల టీడీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో జరిగిందని చెప్పుకోవడానికి ఆ పార్టీకు సిగ్గులేదా అని ప్రశ్నించారు.
బీసీలకు అన్యాయం
టీడీపీ పాలనలో బీసీ ప్రజాప్రతినిధులకు అన్యాయం జరుగుతోందని కృష్ణదాస్ ఆరోపించారు. చౌదరి, రాజవంశీకులనే కేంద్రమంత్రులుగా పంపించారే తప్ప బీసీలకు అత్యున్నత పదవులు ఇవ్వలేదన్నారు. విజయనగరం జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో సమర్థవంతమైన నాయకత్వం ఉందన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా 9 నియోజకవర్గాలు వైఎస్సార్‌సీపీ కైవసం చేసుకోవడం ఖాయమని జోష్యం చెప్పారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, జగన్ పేరు వింటేనే టీడీపీ నాయకులు భయపడుతున్నారన్నారు . తమ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజల మనస్సుల్లో స్థానం దక్కించుకోగా, లోక్‌ష్ పప్పుసుద్ధగా మారాడని ఎద్దేవా చేశారు.
2019 ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. బూత్ స్థాయి కమిటీలు వేసుకుని పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు. చంద్రబాబునాయుడు చేసిన మోసాలకు తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీ జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు(చిన్నశ్రీను) మాట్లాడుతూ, ఎంతో వెనుకపడి ఉన్న చీపురుపల్లి నియోజకవర్గాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఏ స్థాయిలో అభివృద్ధి చేసి చూపించారో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. రహదారులు, ఇళ్లు, తాగునీరు, మౌలిక వసతుల కల్పనకు సత్యనారాయణ విశేష కృషి చేశారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క అభివృద్ధి కూడా జరగలేదన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.