సాక్షి,హైదరాబాద్: వ్యవసాయ పాలిటెక్నిక్, అగ్రికల్చర్,హార్టికల్చర్ వెటర్నరీ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు మొదటివిడత కౌన్సెలింగ్ నిర్వహించేందుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మరోసారి సిద్ధమైంది. ఈ నెల 27నుంచి 31 వరకు పాలిటెక్నిక్ కోర్సులకు, సెప్టెంబర్ 2 నుంచి 5 వరకు యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఇందుకోసం రాష్ట్రం మొత్తంమీద 10 ఆన్‌లైన్ వెబ్‌కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
సీమాంధ్ర ప్రాంతంలోని తిరుపతి వ్యవసాయ కళాశాల, కర్నూలులోని నంద్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం, గుంటూరు బాపట్ల వ్యవసాయ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ కళాశాల, అనకాపల్లి వ్యవసాయపరిశోధనా కేంద్రం, కడపలోని ప్రొద్దుటూరు పశువైద్యకళాశాల, కృష్ణాజిల్లాలోని గన్నవరం పశువైద్య కళాశాల, తెలంగాణలో ఏజీ వర్సిటీ సెంట్రల్ లైబ్రరీ, కరీంనగర్‌లోని జగిత్యాల వ్యవసాయ పరిశోధనా కేంద్రం, వరంగల్‌లోని వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు వెబ్‌కౌన్సిల్ కేంద్రాలకు ఎంపిక చేశారు.
కౌన్సెలింగ్ తేదీలు : పాలిటెక్నిక్ కోర్సులకు 10వ,తరగతి గ్రేడ్ పాయింట్ యావరేజ్(జీపీఏ) అనుసరించి ఈ నెల 27న బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన అన్ని కేటగిరీలకు 30న ఆంధ్రా, ఉస్మానియా, వెంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో కౌన్సెలింగ్ ఉంటుంది. పై రోజుల్లో హాజరుకాని అభ్యర్థులు 31న హాజరు కావచ్చని వర్సిటీ అధికారులు తెలిపారు. యూజీ కోర్సులైన అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ కోర్సులకు సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 4 వరకు ర్యాంకుల ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. పై మూడు రోజులలో హాజరుకాని అభ్యర్థులు 5న కౌన్సెలింగ్‌కు హాజరు కావొచ్చు. అభ్యర్థులు వెబ్ కౌన్సెలింగ్ కేంద్రాలకు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో ఉదయం 9 గంటలలోపు హాజరు కావాలని ఎన్జీరంగా వర్సిటీ ఉపకులపతి ఎ.పద్మరాజు సూచించారు.