బాబురావు పాత్ర నాడే తేలింది!
ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన..
విచారణ కమిటీ నివేదికను పట్టించుకోని వైనం
ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు
అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజా, విద్యార్థి సంఘాల డిమాండ్
గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్, లైంగిక వేధింపులు తట్టుకోలేక మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో నియమించి కమిటీ పలువురిని విచారించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. ఈ నివేదికలో అప్పటి ప్రిన్సిపాల్ బాబురావు పాత్ర ఉందని స్పష్టం చేసింది. చినకాకానిలోని హాయ్‌లాండ్‌లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో బాబురావు ఉద్దేశపూర్వకంగానే రిషితేశ్వరిని వేధింపులకు గురిచేసే విద్యార్థులను ప్రోత్సహించాడని నివేదికలో తేల్చిచెప్పింది. అందరికీ బహుమతులు స్వయంగా అందజేసిన ఆయన రిషితేశ్వరికి మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడే విద్యార్థి శ్రీనివాస్‌తో బహుమతి ఇప్పించాడని పేర్కొంది. కళాశాలలో జరుగుతున్న వేధింపులు కూడా తన దృష్టికి వచ్చినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ర్యాగింగ్ శ్రుతి మించిందని కమిటీ పేర్కొంది. ఆయా అంశాల ఆధారంగా బాబురావుపై చర్యలు తీసుకోవాలని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆయన్ను రక్షించే క్రమంలో బాలసుబ్రహ్మణ్యం కమిటీ సూచనలు పక్కన బెడుతూ వచ్చాయి.
తప్పులు సరిదిద్దే పనుల్లో పోలీసులు
దీంతో ప్రభుత్వం, పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని భావించి అప్పటి ప్రిన్సిపాల్ పాత్రపై ఆధారాలు వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు ఆరు నెలల తరువాత దాఖలు చేసిన చార్జిషీట్‌లో బాబురావు పేరు చేర్చడం చూస్తుంటే ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. చార్జిషీటులో పేరు చేర్చడమే కాకుండా సంచలనాత్మక కేసు కావడంతో బాబురావును అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అతడ్ని అరెస్టు చేయకుండా చార్జిషీటులో పేరు చేర్చడం వల్ల ముందస్తు బెయిల్ పొందే అవకాశం పోలీసులే కల్పించినట్లుగా అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు..
అప్పట్లో విద్యార్థి, మహిళాసంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదు. అతని పాత్రపై తమకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం, పోలీసులు కేసును మరుగున పెట్టేందుకు యత్నించారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో స్పందించి సోషల్ మీడియాలో సైతం రిషితేశ్వరి పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడం, అందులో వేల మంది లైక్‌లు, కామెంట్లు పెట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
బాబురావును శిక్షిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుంది
ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబురావును శిక్షిస్తేనే రిషితేశ్వరి కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు. ప్రస్తుతం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో బాబురావును నాలుగో నింది తుడిగా చేర్చడం వల్ల కేసు న్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అతనిపై చర్యలు తీసుకోవాలి.
- ఎం. మురళీకృష్ణ, రిషితేశ్వరి తండ్రి