principal baburao
-
బాబురావు పాత్ర నాడే తేలింది!
ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన.. విచారణ కమిటీ నివేదికను పట్టించుకోని వైనం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజా, విద్యార్థి సంఘాల డిమాండ్ గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్, లైంగిక వేధింపులు తట్టుకోలేక మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో నియమించి కమిటీ పలువురిని విచారించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. ఈ నివేదికలో అప్పటి ప్రిన్సిపాల్ బాబురావు పాత్ర ఉందని స్పష్టం చేసింది. చినకాకానిలోని హాయ్లాండ్లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో బాబురావు ఉద్దేశపూర్వకంగానే రిషితేశ్వరిని వేధింపులకు గురిచేసే విద్యార్థులను ప్రోత్సహించాడని నివేదికలో తేల్చిచెప్పింది. అందరికీ బహుమతులు స్వయంగా అందజేసిన ఆయన రిషితేశ్వరికి మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడే విద్యార్థి శ్రీనివాస్‌తో బహుమతి ఇప్పించాడని పేర్కొంది. కళాశాలలో జరుగుతున్న వేధింపులు కూడా తన దృష్టికి వచ్చినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ర్యాగింగ్ శ్రుతి మించిందని కమిటీ పేర్కొంది. ఆయా అంశాల ఆధారంగా బాబురావుపై చర్యలు తీసుకోవాలని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆయన్ను రక్షించే క్రమంలో బాలసుబ్రహ్మణ్యం కమిటీ సూచనలు పక్కన బెడుతూ వచ్చాయి. తప్పులు సరిదిద్దే పనుల్లో పోలీసులు దీంతో ప్రభుత్వం, పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని భావించి అప్పటి ప్రిన్సిపాల్ పాత్రపై ఆధారాలు వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు ఆరు నెలల తరువాత దాఖలు చేసిన చార్జిషీట్లో బాబురావు పేరు చేర్చడం చూస్తుంటే ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. చార్జిషీటులో పేరు చేర్చడమే కాకుండా సంచలనాత్మక కేసు కావడంతో బాబురావును అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అతడ్ని అరెస్టు చేయకుండా చార్జిషీటులో పేరు చేర్చడం వల్ల ముందస్తు బెయిల్ పొందే అవకాశం పోలీసులే కల్పించినట్లుగా అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.. అప్పట్లో విద్యార్థి, మహిళాసంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదు. అతని పాత్రపై తమకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం, పోలీసులు కేసును మరుగున పెట్టేందుకు యత్నించారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో స్పందించి సోషల్ మీడియాలో సైతం రిషితేశ్వరి పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడం, అందులో వేల మంది లైక్‌లు, కామెంట్లు పెట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబురావును శిక్షిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుంది ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబురావును శిక్షిస్తేనే రిషితేశ్వరి కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు. ప్రస్తుతం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో బాబురావును నాలుగో నింది తుడిగా చేర్చడం వల్ల కేసు న్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అతనిపై చర్యలు తీసుకోవాలి. - ఎం. మురళీకృష్ణ, రిషితేశ్వరి తండ్రి -
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
* రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు * ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడని తేల్చిన పోలీసులు * వివిధ సెక్షన్ల కింద శిక్షించాలని కోర్టుకు నివేదన * చార్జిషీట్ వివరాలను గోప్యంగా ఉంచిన వైనం * జనవరి నాలుగో తేదీన తదుపరి విచారణ సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరు నెలలుగా కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు ఎట్టకేలకు బాబూరావు పాత్రపై నిగ్గు తేల్చగలిగారు. సుమారు 70 మందిని విచారించగా కళాశాలలో ర్యాగింగ్, హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో రిషితేశ్వరిపై లైంగిక వేధింపులు జరిగినట్లు తెలి సినా ఆయన పట్టించుకోలేదని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిసింది. ర్యాగింగ్ విషయంలో బాబూరావు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనపై ర్యాగింగ్ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిసింది. అయితే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినప్పటికీ హాయ్ ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ జరిగే సమయానికి ఆమె మైనర్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని సైతం పోలీసులు చార్జిషీట్లో ప్రస్తావించినట్లు తెలిసింది. 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఆరు నెలల సమగ్ర విచారణ తరువాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడు... న్యాయవాది వై.కె. శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రిషితేశ్వరి కేసులో బాబూరావును 4వ నిందితుడిగా చేరుస్తూ మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారని చెప్పారు. ర్యాగింగ్ నేరాన్ని చూస్తూ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడమేకాక, నేరాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించాడని, దీనిపై విచారించి ఆయనను శిక్షించాలని పోలీసులు చార్జిషీట్లో కోరారని తెలిపారు. నిందితులపై గతంలో నమోదైన ఐపీసీ 306, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4తోపాటు, బాలికలపై లైంగిక అత్యాచారాల రక్షణ చట్టంలోని 7, 8, 11, 12 సెక్షన్ల కింద కూడా విచారించి శిక్షించాలని పోలీసులు చార్జిషీట్ ద్వారా కోర్టును కోరారని ఆయన చెప్పారు. దీనిపై కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించడానికి జనవరి 4వ తేదీకి కేసును వాయిదా వేసిందని తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున తానూ వాదనలు వినిపించనున్నట్లు చెప్పారు. బాబూరావును నిందితుడిగా చేర్చినప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని, చార్జిషీట్‌తో సంబంధం లేకుండానే నిందితులను అరెస్ట్ చేయవచ్చని వై.కె. అన్నారు. కాల్‌మనీ కేసులో నిందితుడు సత్యానందంలాగా బాబూరావు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం పోలీసులే ఇస్తున్నట్లు భావించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. బాబూరావును వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి ఆరోపణలకు తెరదించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. -
రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
-
నేరస్తులకు ప్రభుత్వ రక్షణ
సాక్షి, హైదరాబాద్: మహిళలపై దౌర్జన్యాలు చేసి వారి మరణాలకు కార కులైన నేరస్తులను చంద్రబాబునాయుడి ప్రభుత్వం వెనకేసుకొస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. నేరస్థులకు అండగా నిలిచి మహిళా వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి కేసులో ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉందని సాక్షాత్తూ మృతురాలి తండ్రి మొరపెట్టుకుంటున్నా నిందితుడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో తాము బాబూరావు పేరు ప్రస్తావించగానే టీడీపీ నేత ధూళి పాళ్ల నరేంద్ర, మంత్రి గంటా శ్రీనివాసరావు ఉలిక్కిపడ్డారన్నారు. బాబూరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలేవీ లభించలేదని డీజీపీ జేవీ రాముడు చెప్పడం విచిత్రంగా ఉందన్నారు. దర్యాప్తులు లేవు, నివేదికలు రావు.. తహసీల్దార్ వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దౌర్జన్యం చేసిన కేసులో విచారణే ముందుకు సాగడంలేదని విమర్శించారు. నారాయణ విద్యాసంస్థల్లో ఇద్దరమ్మాయిల మరణంపై త్రిసభ్య విచారణ కమిటీ నివేదిక రాలేదని, పుష్కరాల్లో మహిళల మరణాలపై ఏం దర్యాప్తు చేస్తున్నారో తెలియదని, రిషితేశ్వరి మృతిపై విచారణ జరిపిన బాలసుబ్రమణ్యం కమిటీ నివేదికను ప్రభుత్వం ఆమోదించలేదని రోజా ధ్వజమెత్తారు. 2014 ఎన్నికల్లో మంత్రి నారాయణ టీడీపీకి మద్దతునిచ్చారు కాబట్టే ఆయన విద్యాసంస్థల్లో 11 మంది మృతి చెందినా సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించకుండా అండగా నిలిచారన్నారు. మంత్రి గంటాకు నారాయణ వియ్యంకుడు కావడంతో అక్కడ ఎంత మంది చనిపోయినా విచారణకు ఆదేశించరన్నారు. కడప నారాయణ కాలేజీలో ఒకే రూంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతదేహాలపై గాయాలున్నందున రీపోస్ట్‌మార్టం జరపాలని ఆ విద్యార్థినుల కుటుంబాలను పరామర్శించే సందర్భంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. టీడీపీ ప్రభుత్వం అన్యాయాలపై మహిళలు స్పందించాలని, మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నపుడు వారిని నిలదీయాలని రోజా పిలుపు నిచ్చారు. -
'ఇప్పటికీ పశ్చాత్తాపం కనిపించడం లేదు'
గుంటూరు: ‘ఓ అమ్మాయికి అంతటి అన్యాయం జరిగినా.. ఇప్పటికీ మీలో పశ్ఛాతాపం కనిపించడం లేదు..’అంటూ రిషితేశ్వరి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆర్కిటెక్చర్ కళాశాల పూర్వ ప్రిన్సిపాల్ బాబూరావును ఉద్దేశించి న్యాయసేవాధికార సంస్ధ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి జి.లక్ష్మీనరసింహారెడ్డి వ్యాఖ్యానించారు. ఆచార్య నాగార్జున యూనివర్సీటీ విద్యార్ధిని రిషితేశ్వరి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు, వార్డెన్ స్వరూపారాణిలు శుక్రవారంలో జిల్లా న్యాయసేవాధికార సంస్ధల ఎదుట హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి కేసులో సాక్షి కధనాల ఆధారంగా సుమోటోగా తీసుకుని వారిద్దరికి ప్రీలిటికేషన్ కేసు కింద నోటీసులు పంపిన విషయం విదితమే. నోటీసులు అందుకున్న ఇద్దరు ఈనెల 1న సంస్థ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. మరింత సమగ్ర సమాచారంతో రావాలని న్యాయమూర్తి వారిని ఆదేశిస్తూ 7వ తేదీకి వాయిదా వేశారు. ఇద్దరూ హాజరుకాగా ఇప్పటికే ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, ప్రభుత్వం సుబ్రమణ్యం కమిటీ సైతం విచారణ జరుపుతున్న తరుణంలో ప్రిలిటికేషన్ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదంటూ ఈ కేసును మూసివేస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు. మహిళా న్యాయవాదులు అధిక సంఖ్యలో హాజరై ప్రిన్సిపాల్ బాబూరావుకు విద్యార్ధిని మృతిపై ఎటువంటి పశ్ఛాతాపం కనపడటం లేదని న్యాయమూరి దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి ప్రిన్సిపాల్ పదవిలో ఎవరూ ఉన్నా కానీ విద్యార్దిని మృతిపై పశ్ఛాతాపం వ్యక్తం చే స్తారని, కానీ మీలో అధి కనపడటంలేని బాబూరావుని ప్రశ్నించారు. సమాధానంగా బాబూరావు మాట్లాడుతూ జరిగిన సంఘటనపై తాను తీవ్రంగా పశ్ఛాతాపం చెందుతున్నానని తెలిపారు. పక్కనే ఉన్న ప్రిన్సిపాల్ కుమారుడిని నీవు ఏం చేస్తున్నావని యువకుడిని ప్రశ్నించగా ఇంటీరియల్ డెకరేషన్ చేస్తున్నట్లు సమాధానం తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి లక్ష్మీనరసింహారెడ్డి ‘ముందు మీ తండ్రిని డెకరేట్ చేయాల్సిన అవసరం ఉంది’ అని వ్యాఖ్యానించారు. కేసు ముగిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
ప్రిన్సిపాల్ బాబూరావుపై ఎట్టకేలకు ఫిర్యాదు
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచిపోయినా.. రాష్ట్రమంతా దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగినా స్పందించని నాగార్జున యూనివర్సిటీ వీసీ.. వైఎస్ఆర్సీపీ కమిటీ పర్యటనతో ఎట్టకేలకు కదిలారు. ఆత్మహత్యకు ప్రత్యక్షంగా కారకుడని ఆరోపణలు వస్తున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంటీ ర్యాగింగ్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దాదాపు గంటన్నరకు పైగా వీసీ సాంబశివరావు,రిజిస్ర్టార్ రాజశేఖరలతో నిజనిర్ధారణ కమిటీ సమావేశమైంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు యూనివర్సిటీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. హాస్టల్‌ను తనిఖీచేసి విద్యార్థులతో పాటు వార్డెన్‌తో మాట్లాడారు. అక్కడ ఉన్న వసతులపై కూడా చర్చించారు. ఇప్పటికి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచినా బాబూరావు మీద అసలు కేసు కూడా పెట్టలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయడంతో.. అక్కడే కమిటీ సభ్యుల సమక్షంలోనే తాగి తందనాలాడుతున్న బాబూరావుపై చర్యలు తీసుకోవాలంటూ వీసీ ఫిర్యాదు రాసి పెదకాకాని సర్కిల్ ఇన్స్పెక్టర్ కు అందించారు. -
రిషితేశ్వరి కేసులో అన్ని కోణాల్లో విచారణ
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ఓ సీనియర్‌తోపాటు నలుగురు జూనియర్ విద్యార్థులను మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిని రెండు గంటలపాటు విచారించినట్లు తెలిసింది. డైరీలోని పేజీల్లో కొట్టేసిన పేర్లు ఎవరివి, ఆ రోజు రాత్రి ఏం జరిగింది..? అనే కోణంలో విచారించి వివరాలు సేకరించినట్లు సమాచారం. జూలై 13న రాత్రి విజయవాడ సినిమా థియేటర్లో ఏం జరిగింది? రాత్రి 11 గంటల సమయంలో హాస్టల్‌కు చేరుకున్న రిషితేశ్వరికి భోజనం లేకపోవడంతో సోదరుడి వరుసయ్యే ఓ విద్యార్థి హోటల్ నుంచి భోజనం తెచ్చి హాస్టల్ సెక్యూరిటీకి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో తన గది నుంచి నడుచుకుంటూ హాస్టల్ ప్రధాన గేటు వరకు వచ్చి పార్శిల్ పట్టుకెళ్లిన తర్వాత సీనియర్లు ఆమెను పైకి పిలి చారా? లేదా జూలై 14న ఉదయం హాస్టల్లో ఆమె ను బాధించే సంఘటన ఏమైనా జరిగిందా..? ఆమె కాలేజీకి ఎందుకు వెళ్లలేదు..? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన ముగ్గురు సీనియర్లే కాకుండా మరో ఇద్దరు విద్యార్థులు ఆమెపై తీవ్ర వేధింపులకు పాల్పడినట్లు ఉండటంతో ఆ ఇద్దరూ ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ప్రిన్సిపల్ బాబూరావు పాత్రపై దర్యాప్తు..? రిషితేశ్వరి మృతి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు పాత్ర ఏమేరకు ఉందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రిషితేశ్వరి ఉరేసుకున్న విషయాన్ని సీనియర్లు ముందుగా బాబూరావుకు ఫోన్ చేశారని, వార్డెన్ రాకముందే మృతదేహాన్ని హడావుడిగా తరలించారని చెబుతున్నారు. పోలీసులు రాకుండానే అంత హడావుడి ఎందుకు చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'
గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో ఓ కులం వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రొఫెసర్ డేవిడ్ రాజు అన్నారు. ప్రశ్నించిన వారిని, నిజాలు మాట్లాడేవారి నోరు నొక్కేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం తాగి క్లాసుకు వస్తారని, ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల పాటు స్టాప్ రూమ్‌లోనే నిద్రపోతారని, అమ్మాయిలతో బాబూరావు అసభ్యకరంగా వ్యవహిరించే మాట వాస్తవమని డేవిడ్ రాజు అన్నారు. విద్యార్థులు ప్రతివారం ప్రిన్సిపాల్‌కు మందు పార్టీ ఇవ్వాలని, లేదంటే విద్యార్థులకు మార్కులు వేయరని, ఇలాంటి చరిత్ర ఉందనే గతంలో బాబురావు పని చేసిన కాలేజీల యాజమాన్యాలు తరిమేశాయని, ఫ్రెషర్స్ పార్టీలో ఆయన మద్యం సేవించి డాన్స్ చేశారని, బాబూరావు బాధలు తట్టుకోలేక ఇద్దరు మహిళా ఫ్యాకల్టీలు వెళ్లిపోయారని, రిషితేశ్వరి చనిపోయిన రోజు... ఇంకా బతికే ఉందని లెటర్ కోసం వర్సిటీ మెడికల్ ఆఫీసర్‌పై ఒత్తిడి తెచ్చారని డేవిడ్ రాజు తెలిపారు. -
బాబూరావును ఎ1గా చేర్చాల్సిందే
రిషితేశ్వరి ఆత్మహత్యకు ప్రధాన కారణం నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజి ప్రిన్సిపల్ బాబూరావేనని, ఆయనను ఈ కేసులో మొదటి ముద్దాయిగా చేర్చాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా డిమాండ్ చేశారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లోనే... రిషితేశ్వరి తల్లిదండ్రులకు కనీసం అపాయింట్ మెంట్ ఇవ్వలేదు విద్యార్థులు క్యాంప్ ఆఫీసుకువెళ్తే లాఠీ చార్జి చేయిస్తారా? చార్జిషీటులో ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి పేరు పెట్టారు నాగార్జున వర్సిటీ వీసీ, ప్రిన్సిపల్ దీనికి కారణం. వాళ్ల పేర్లు ఎందుకు చేర్చలేదు ప్రిన్సిపల్ బాబూరావు అమ్మాయిలతో తైతక్కలాడతాడు, ఉమనైజర్ అని అంటున్నారు వనజాక్షి కేసులాగే దీన్నీ నీరుగారుస్తున్నారు యాంటీ ర్యాగింగ్ మీద సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది అమాయక విద్యార్థుల జీవితాలు నాశనం కాకూడదని చెప్పింది యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్ లు వేయాలని, వార్డెన్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని చెప్పారు బయట ఉండే పిల్లల వివరాలు సేకరించాలని అన్నారు లెక్చరర్లు, ప్రిన్సిపల్ ర్యాగింగ్ మీద కౌన్సెలింగ్ ఇవ్వాలని కూడా అందులో అన్నారు కానీ ఇక్కడ మాత్రం తనకు ర్యాగింగ్ వల్ల చాలా మానసిక ఒత్తిడి ఉందని, రిషితేశ్వరి , ఆమె తండ్రి వచ్చి ఫిర్యాదుచేసినా ప్రిన్సిపల్ పట్టించుకోకపోవడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకున్న విషయమై ఏమంటారు? ర్యాగింగ్ జరిగిందని ఎవరైనా ఫిర్యాదుచేస్తే, పోలీసులకు చెప్పాలి, చర్యలు తీసుకోవాలి కానీ ప్రిన్సిపల్ దాన్ని పక్కన పెట్టడం వల్లే ఆమె చనిపోయింది కాబట్టి ఎ1 ప్రిన్సిపల్, ఎ2 వీసీ అవుతారు కానీ ఇప్పుడు ఆయనంత ఉత్తముడు ఎవరూ లేరని టీడీపీ నాయకులు అంటున్నారు ఇది కేవలం రిషితేశ్వరికి సంబంధించిందే కాదు.. అన్నిచోట్లా జరుగుతోంది యూనివర్సిటీ కులాల కుంపటిగా మారిపోయింది ప్రిన్సిపల్ అమ్మాయిలతో డాన్సులు వేసినా, ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించినా అడ్డు అదుపు లేదు. ఇలాంటివాళ్లను వదిలితే ఇంకెందరి జీవితాలు నాశనం అవుతాయో చెప్పలేం చంద్రబాబు ఇప్పటికైనా ముందుకొచ్చి, అమ్మాయిలకు అండగా ఉండాలని కోరుతున్నాం కాలేజీలకు సెలవు ఇచ్చేసి, ప్రిన్సిపల్‌కు అనుకూలంగా ఉండేవాళ్లను మాత్రమే పిలిపించి విచారణ చేయిస్తున్నారు ఇంత తప్పు జరిగినా ప్రిన్సిపల్‌ను ఎందుకు వెనకేసుకు వస్తున్నారు, సీడీలలో ఆధారాలున్నా.. అందరూ ఆయనపై పోరాడుతున్నా ఎందుకు అరెస్టు చేయలేదు? ర్యాగింగ్‌ను కాలేజీల నుంచి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది చంద్రబాబు వనజాక్షి విషయంలో గానీ, ఎమ్మెల్యేల విషయంలో గానీ.. తన అనుకూల మీడియాతో దాన్ని నీరుగార్చేలా చేస్తున్నారు దీన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇందులో మంత్రుల పిల్లలున్నా, టీడీపీ నేతల పిల్లలున్నా వదలం. అమ్మాయి కోరుకున్నట్లుగా, ఆమె తల్లిదండ్రులు కోరుకున్నట్లుగా సిటింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలి ప్రిన్సిపల్‌ను ఎ1గా చేర్చాలి. అమ్మాయి ఆత్మహత్యకు కారకులైన వారందరినీ ర్యాగింగ్ చట్టం కింద అరెస్టు చేయాలి. లేనిపక్షంలో రేపు అసెంబ్లీలో, బయట వైఎస్ఆర్సీపీ వదిలే ప్రసక్తి లేదు 6వ తేదీ పార్టీ మహిళా విభాగం, విద్యార్థి విభాగం యూనివర్సిటీకి వెళ్తున్నాం. నిజనిర్ధారణ కమిటీగా అక్కడ చూసి, వాస్తవాలు బయటకు తీసుకొస్తాం