గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ఓ సీనియర్‌తోపాటు నలుగురు జూనియర్ విద్యార్థులను మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిని రెండు గంటలపాటు విచారించినట్లు తెలిసింది. డైరీలోని పేజీల్లో కొట్టేసిన పేర్లు ఎవరివి, ఆ రోజు రాత్రి ఏం జరిగింది..? అనే కోణంలో విచారించి వివరాలు సేకరించినట్లు సమాచారం. జూలై 13న రాత్రి విజయవాడ సినిమా థియేటర్‌లో ఏం జరిగింది? రాత్రి 11 గంటల సమయంలో హాస్టల్‌కు చేరుకున్న రిషితేశ్వరికి భోజనం లేకపోవడంతో సోదరుడి వరుసయ్యే ఓ విద్యార్థి హోటల్ నుంచి భోజనం తెచ్చి హాస్టల్ సెక్యూరిటీకి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో తన గది నుంచి నడుచుకుంటూ హాస్టల్ ప్రధాన గేటు వరకు వచ్చి పార్శిల్ పట్టుకెళ్లిన తర్వాత సీనియర్‌లు ఆమెను పైకి పిలి చారా? లేదా జూలై 14న ఉదయం హాస్టల్‌లో ఆమె ను బాధించే సంఘటన ఏమైనా జరిగిందా..? ఆమె కాలేజీకి ఎందుకు వెళ్లలేదు..? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన ముగ్గురు సీనియర్‌లే కాకుండా మరో ఇద్దరు విద్యార్థులు ఆమెపై తీవ్ర వేధింపులకు పాల్పడినట్లు ఉండటంతో ఆ ఇద్దరూ ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది.
ప్రిన్సిపల్ బాబూరావు పాత్రపై దర్యాప్తు..?
రిషితేశ్వరి మృతి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు పాత్ర ఏమేరకు ఉందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రిషితేశ్వరి ఉరేసుకున్న విషయాన్ని సీనియర్‌లు ముందుగా బాబూరావుకు ఫోన్ చేశారని, వార్డెన్ రాకముందే మృతదేహాన్ని హడావుడిగా తరలించారని చెబుతున్నారు. పోలీసులు రాకుండానే అంత హడావుడి ఎందుకు చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం.
రిషితేశ్వరి కేసులో అన్ని కోణాల్లో విచారణ
Published Wed, Aug 5 2015 2:43 AM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM
Advertisement