పంజాబ్‌లోని లూథియానా సెంట్రల్ జైలులో కలకలం చెలరేగింది. ఖైదీలంతా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న వీడియో ఆన్‌లైన్‌లో కనిపించడంతో, దీనిని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
రెండు రోజుల క్రితం లూథియానాలోని సెంట్రల్ జైలులోని ఖైదీలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ అయ్యింది. ఆ క్లిప్‌లో కొందరు ఖైదీలు ఒక చేతితో గ్లాసులు పట్టుకుని, మరో చేతితో పకోడీలు తింటూ కనిపిస్తున్నారు. ఆ ఖైదీలు ‘నేడు మణి భాయ్ పుట్టినరోజు’ అని పాడటం కూడా ఆ వీడియోలో వినిపిస్తోంది. జైలులోని ఖైదీలు అరుణ్ కుమార్ అలియాస్ మణి రాణా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారని తెలుస్తోంది.
హిమాచల్ ప్రదేశ్‌లో 2019లో జరిగిన దోపిడీ కేసులో మణి అండర్ ట్రయల్‌గా ఉన్నాడు. వీడియో రికార్డు చేసి, అప్‌లోడ్ చేయడానికి ఉపయోగించిన మొబైల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. అయితే ఆ ఫోన్ పగిలిపోయిందని, పూర్తి డేటా వెలువడలేదని వారు పేర్కొన్నారు.
ఈ ఉదంతంలో 10 మంది ఖైదీలపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. ఈ ఖైదీలపై జైలు చట్టంలోని సెక్షన్ 52ఏ (జైలు నిబంధనల ఉల్లంఘన) కింద కేసు నమోదు చేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (లూథియానా ఈస్ట్) గుర్దేవ్ సింగ్ తెలిపారు.
ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ఇన్‌స్పెక్టర్ జనరల్ (జైలు) ఆర్కే అరోరా, పాటియాలా రేంజ్ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ (డీఐజీ) సురీందర్ సింగ్ సైనీ ఈ ఘటనపై సమగ్ర విచారణ ప్రారంభించారు.
ఇటువంటి ఉదంతాలతో పంజాబ్ జైళ్లు వార్తల్లోకి రావడం ఇదేమీ మొదటిసారి కాదు. ఇటువంటి పరిస్థితుల నేపధ్యంలో జైళ్ల భద్రతను మెరుగుపరచాల్సిన అవసరం ఉన్నదని పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఇటీవల వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment