Rishitheswari
-
రిషితేశ్వరి కేసులో అన్ని కోణాల్లో విచారణ
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ఓ సీనియర్‌తోపాటు నలుగురు జూనియర్ విద్యార్థులను మంగళగిరి డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి విచారించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి వారిని రెండు గంటలపాటు విచారించినట్లు తెలిసింది. డైరీలోని పేజీల్లో కొట్టేసిన పేర్లు ఎవరివి, ఆ రోజు రాత్రి ఏం జరిగింది..? అనే కోణంలో విచారించి వివరాలు సేకరించినట్లు సమాచారం. జూలై 13న రాత్రి విజయవాడ సినిమా థియేటర్లో ఏం జరిగింది? రాత్రి 11 గంటల సమయంలో హాస్టల్‌కు చేరుకున్న రిషితేశ్వరికి భోజనం లేకపోవడంతో సోదరుడి వరుసయ్యే ఓ విద్యార్థి హోటల్ నుంచి భోజనం తెచ్చి హాస్టల్ సెక్యూరిటీకి ఇచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో తన గది నుంచి నడుచుకుంటూ హాస్టల్ ప్రధాన గేటు వరకు వచ్చి పార్శిల్ పట్టుకెళ్లిన తర్వాత సీనియర్లు ఆమెను పైకి పిలి చారా? లేదా జూలై 14న ఉదయం హాస్టల్లో ఆమె ను బాధించే సంఘటన ఏమైనా జరిగిందా..? ఆమె కాలేజీకి ఎందుకు వెళ్లలేదు..? అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. అరెస్ట్ అయిన ముగ్గురు సీనియర్లే కాకుండా మరో ఇద్దరు విద్యార్థులు ఆమెపై తీవ్ర వేధింపులకు పాల్పడినట్లు ఉండటంతో ఆ ఇద్దరూ ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిసింది. ప్రిన్సిపల్ బాబూరావు పాత్రపై దర్యాప్తు..? రిషితేశ్వరి మృతి కేసులో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబూరావు పాత్ర ఏమేరకు ఉందనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. రిషితేశ్వరి ఉరేసుకున్న విషయాన్ని సీనియర్లు ముందుగా బాబూరావుకు ఫోన్ చేశారని, వార్డెన్ రాకముందే మృతదేహాన్ని హడావుడిగా తరలించారని చెబుతున్నారు. పోలీసులు రాకుండానే అంత హడావుడి ఎందుకు చేశారనేదానిపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
రిషితేశ్వరి ఆత్మహత్యకు అప్పటి ప్రిన్సిపలే కారణం
విద్యార్థులతో కలిసి మద్యం తాగేవారు దళితుడిని కాబట్టే నన్ను విధుల నుంచి తొలగించారు ఆర్కిటెక్చర్ మాజీ అసిస్టెంట్ {పొఫెసర్ డేవిడ్ రాజు గుంటూరు: ఆర్కిటెక్చర్ కాలేజీ అప్పటి ప్రిన్సిపల్ బాబురావు అసభ్యకరమైన చర్యలే రిషితేశ్వరిని ఆత్మహత్యకు పురిగొల్పాయని అదే కాలేజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు ఆరోపించారు. మంగళవారం డేవిడ్ రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫ్రెషర్స్‌డే పార్టీలో ఇద్దరు విద్యార్థులు మద్యం తాగి తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని రిషితేశ్వరి తన డైరీలో కూడా రాసుకుందని తెలి పారు. ప్రిన్సిపల్ విద్యార్థులతో కలిసి మద్యం తాగటమేంటని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉండగా హాయ్‌ల్యాండ్‌లో ఫ్రెషర్స్ డే నిర్వహించటమేంటని ప్రశ్నించారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ తప్ప అధ్యాపకులనెవరినీ రానివ్వలేదని, అధ్యాపకులు వెళ్లి ఉంటే ఇలాంటివి జరిగేవి కాదన్నారు. ఫోన్లలో అసభ్యంగా మాట్లాడతారని, డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనుక నుంచి చేతులు వేస్తారని ఆడపిల్లలు బాబురావు ప్రవర్తనపై మా దగ్గర ఏడ్చి మరీ ఫిర్యాదు చేసేవారన్నారు. ఆడపిల్లలకు రక్షణ లేదని గతంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ వారు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. బాబురావు మద్యం తాగి కాలేజీకి వస్తున్నాడని అధ్యాపకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు. ఆయన ఆగడాలపై 2014 మార్చిలో రాష్ట్ర గవర్నర్‌కూ మెయిల్ పంపామని తెలిపారు. ఇన్ని జరిగినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవటం వల్లనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందన్నారు. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడటంతో బాబురావు చెక్‌పవర్ తీసివేశారని మరలా ఉద్దేశపూర్వకంగానే మళ్లీ చెక్‌పవర్ ఇచ్చారని ఆరోపించారు. కులం ముసుగులో బాబురావు అరాచకాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన అరాచకాలను బయటపెడుతున్నాననే దళితుడినైన తనను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారని, అసభ్యకరమైన పనులు చేసిన బాబురావు అగ్రకులస్తుడు కావటం వల్లనే కేవలం విధుల నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు. -
డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు?
రిషితేశ్వరి డైరీపై ఫింగర్ ప్రింట్లు పోలీసులు సేకరించారా? గుంటూరు: రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం డైరీలోని ఓ పేజీలో ఆమె ‘మై లాస్ట్ నోట్’ పేరుతో రాసిన సూసైడ్ నోట్ మాత్రమే పోలీసులు బహిర్గతం చేశారు. అయితే, మిగతా పేజీలను ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఏ సందర్భంలో ఆమెకు బాధ కలిగిందో, ఎప్పుడు మనోవేదనకు గురైందో తెలుపుతూ ఆమె మరో ఐదు పేజీలు తన డైరీలో రాసుకుంది. సూసైడ్ నోట్‌తోపాటు ఆ ఐదు పేజీలూ డైరీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. చివరకు ఆమె తల్లిదండ్రులు సైతం తమకు పోలీసులు ఈ డైరీని చూపలేదని చెబుతున్నారు. ఆ పేజీల్లో రిషితేశ్వరి ఐదుగురు విద్యార్థులు తనను వేధించినట్లు రాసింది. డైరీ పేజీల్లో వారి పేర్లు రాసి ఉన్నప్పటికీ.. ఆ పేర్లు కొట్టేసి ఉన్నాయి. రిషితేశ్వరి కొట్టేసి ఉంటుందనుకుంటే అప్పటి వరకూ బ్లూ ఇంక్‌తో రాసిన పేర్లను అదే ఇంకుతో కొట్టేసి, ‘మిస్టర్ఎక్స్’ అని రెడ్ ఇంక్‌తో ఎందుకు రాస్తుందనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ పేర్లు ఎవరు కొట్టేశారనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ గదిలోకి వెళ్లిన సీనియర్ విద్యార్థులెవరైనా డైరీని గమనించి పేర్లను కొట్టివేశారా.. లేదా మరెవరైనా కొట్టేశారా.. అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో తాను మంచి స్నేహితునిగా భావించిన ఓ విద్యార్థి తనకు ‘ ఐలవ్యూ’ చెప్పడం విస్మయాన్ని కలిగించిందని రిషితేశ్వరి డైరీలో రాసుకున్న విషయాన్ని ఓ టీవీ ఛానల్ ప్రతినిధి ఆమె తండ్రి మురళీకృష్ణను ప్రశ్నించగా ఆ సంఘటన జరిగినప్పుడు అభిషేక్ అనే విద్యార్థి తనకు ‘ఐలవ్యూ’ చెప్పాడని తన కుమార్తె తనతో చెప్పిందని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న రోజు మొదట డైరీని గమనించిందెవరు? ఒక వేళ పోలీసులే గమనించి ఉంటే ఆ డైరీపై ఉన్న ఫింగర్ ప్రింట్లను సేకరించారా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు రాకముందే తరలించిన వారు గదిలోనే ఉన్న డైరీని గమనించి ఉండే అవకాశం ఉంది కదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. -
ముఖంలో చిరునవ్వు మాయమైంది..!
ఎన్నో ఆశలు, ఆశయాలతో కాలేజీకి వచ్చా.. నేను ఇడియట్‌ని.. అందుకే వీరినందరినీ నమ్మా.. ‘డైరీ’లో రాసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి గుంటూరు: ఆడుతూ పాడుతూ గడిపిన పరిస్థితుల నుంచి ఒక్కసారిగా ఊహలకు అందని ప్రపంచంలోకి వచ్చింది. అదీ విభిన్న మనస్తత్వాలు కలిగిన యూనివర్సిటీలోకి. అంతా గందరగోళం. ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో తెలుసుకోలేకపోయింది. అమాయక నవ్వుల్ని అపార్థం చేసుకుంటారని తెలియని పసితనం. కొద్ది రోజుల్లోనే ఆశలన్నీ తలకిందులయ్యాయి. నమ్మిన వారే వెంటాడారు. అన్నీ చెప్పుకునే తండ్రికీ తన దురవస్థ చెప్పుకోలేని దుస్థితి. సరిగ్గా రెండు పదులూ నిండకుండానే నిరాశ.. నిస్పృహ.. అనిశ్చితి.. చివరికి ఆత్మహత్యను ఆసరాగా చేసుకుంది... ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని ఆర్కిటెక్చర్ కాలేజీ మొదటి సంవత్సరం విద్యార్థిని రిషితేశ్వరి. ‘మై లాస్ట్ నోట్’ పేరుతో సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఈ ఒక్క సూసైడ్నోటే ఉందని భావించగా.. తాజాగా ఆమె డైరీలో రాసుకున్న మరికొన్ని సంఘట నలు బయటపడడం చర్చనీయాంశంగా మా రింది. ఆమెను ఆత్మహత్యకు పురికొల్పిన వ్య క్తులు, అందుకు కారణమైన వాటినీ స్పష్టంగా పేర్కొంది. డైరీ రాసే అలవాటు ఉన్న రిషితేశ్వరి కాలేజీలో చేరినప్పటి నుంచీ తనకు బాధ కలిగించిన అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వీటిలో కొన్ని పేజీలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. అయితే, అందులో కొన్ని పేర్లు కొట్టివేసి ఉండడం అనుమానాలకు తావిస్తోంది. ఆ రోజుతోనే సగం చచ్చినట్లైంది... 2014 ఏప్రిల్‌లో మంగళగిరి మండలం చినకాకాని వద్ద ఉన్న హాయ్‌ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ జరిగింది. పార్టీలో స్టేజీపై ఉన్న సమయంలో సీనియర్..... (పేరు కొట్టేసి ఉంది) ఒకరు మద్యం సేవించి నా చెయ్యి పట్టుకుని ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. షాక్‌కు గురయ్యా. స్టేజి దిగి కిందకు వెళ్లబోతుండగా మరో సీనియర్..... (పేరు కొట్టేసి ఉంది) నడుంపై చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని అసభ్యంగా ప్రవర్తిం చాడు. ఆ సమయంలో అతడిని ప్రతిఘటించలేకపోయా. ఆ సంఘటనను ఊహించుకుంటే నాపై నాకే అసహ్యం వేస్తుంది. నాకేమైందో అర్థం కావడం లేదు. అన్ని విషయాలు నాన్నతో చెప్పుకునే నేను వీటిని చెప్పలేకపోయా. నేను సగం చచ్చినట్లైంది. ఈ రోజు చాలా బాధపడుతున్నా. కాలేజీలోకి అడుగు పెట్టినప్పుడు చాలా ఆశలు, ఆశయాలతో వచ్చా. కానీ ఇప్పుడు చాలా భయాందోళనకు గురవుతున్నా. జీవితంపైన విరక్తి కలుగుతోంది. నమ్మిన అబ్బాయిలంతా మోసం చేశారు. అబ్బాయిలంతా ఇడియట్స్. ప్రతి ఒక్కరిని అసహ్యించుకుం టున్నా. మొదట...... (పేరు కొట్టేసి ఉంది) అతడిని మంచి స్నేహితుడని ఊహించా. మా నాన్న కూడా అతడిని నమ్మాడు. ఫిబ్రవరి 11న అతనితో వాట్సాప్‌లో ఉండగా అకస్మాత్తుగా ‘ఐ లవ్ యూ’ అని చెప్పాడు. అలా చెబుతాడని ఊహించలేదు. కాలేజీలో చేరిన తర్వాత ఇతను మొదటి స్నేహితుడు. ఆ తర్వాత అనేక ఫోన్‌నెంబర్ల నుంచి అస అసహ్యమైన మెసేజ్‌లు పంపాడు. అతడిని పూర్తిగా అసిహ్యించుకున్నా. మంచి స్నేహితుడిగా భావించిన...... (పేరు కొట్టేసి ఉంది) వాడు వెధవే. నేను నిద్రావస్థలో ఉన్నప్పుడు అసభ్యంగా ప్రవర్తించాడు. నా జీవితంలోనే ఇది అసహ్యమైన సందర్భం. నా జీవితం వృథా. ఎవరికిలేని విధంగా నాకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. అందుకే నన్ను నేను అసహ్యించుకుంటున్నా. నా సోదరుడు వంటి జితేంద్రకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి. నేను కూతురునైనందుకు నాన్నకూ సమస్యలు తప్పడం లేదు. అందుకే చనిపోయినట్లుగా భావిస్తున్నా. ‘ ఐ లవ్యూ డాడ్’ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను నవ్వుతూ అందరితో కలుపుగోలుగా ఉండటం మొదలు పెట్టినప్పటి నుంచి కొత్త స్నేహితులు పరిచయం అవుతుండటం ఎంతో ఆనందం కలిగించింది. నాది చిన్నపిల్లల మనస్తత్వం. అందరినీ నమ్ముతా. ఎవరినైతే నమ్మానో వాళ్లందరూ ఫూల్‌ని చేశారు. నేను ఒక ఇడియట్‌ని.. ఇడియట్లందరినీ నమ్మా. నా ముఖంలో చిరునవ్వు మాయమైంది. మా నాన్నను ఎంతగానో ప్రేమిస్తున్నా. ........ (పేరు కొట్టేసి ఉంది) నాలుగో సంవత్సరం చదివే సీనియర్ విద్యార్థి,.......( పేరు కొట్టేసి ఉంది), రెండో సంవత్సరం చదివే సీనియర్ విద్యార్థినులు మంచి చేస్తున్నట్లు నటిస్తూనే నన్ను ఉపయోగించుకున్నారు. ముఖ్యంగా సీనియర్ విద్యార్థిని ఎంతగానో సహకారం అందిస్తుందని భావించా. కానీ తను చాలా చెడ్డది. నా స మాచారాన్ని సీనియర్ విద్యార్థి శ్రీనివాస్‌కు చేరవేస్తుంది. అది తెలిసి షాక్‌కు గురయ్యా. నా ఫొటోలు, ప్రతిభ, కులం, మొదలగు సమాచారాన్నంతటిని అతనికి ఇచ్చింది. ఆమె అంత చెడ్డదని తెలిసి జీర్ణించుకోలేకపోయా. చాలా బాధపడ్డా. ఈ సంఘటన తర్వాత ఎవరినీ నమ్మలేదు. రిషితేశ్వరి డైరీలో ఏం రాసిందంటే..! ఈ డైరీ చదివిన వారి తల వెయ్యి వక్కలవుతుంది... అంటూ మొదలు పెట్టిన రిషితేశ్వరి వ్యక్తిత్వం ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా నడుచుకోవాలి, జీవితంలో ఉన్నతశిఖరాలు అధిరోహించాలంటే ఏం చేయాలనే అంశాలపై 250 వరకు కొటేషన్లు రాసుకుంది. ఆ తర్వాత భగవద్గీతలోని శ్లోకాలను ప్రస్తావించింది. తనకు నచ్చిన కథ పేరుతో తెలుగులో ఓ కథనూ రాసుకుంది. ఆ తర్వాత యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఆమెకు బాధకలిగించినప్రతి సంఘటననూ ఇంగ్లిష్‌లో పొందుపరిచింది. ఇతరుల డైరీ చదవకూడదు (ఇట్స్ ఏ క్రైమ్) అంటూ డైరీలో రాయడం ప్రారంభించింది. తాను ఆరోతరగతి చదువుతున్న సమయంలో సాయంత్రం 5గంటలకల్లా ఇంటికి చేరేదాన్ని. నాన్న ఉద్యోగరీత్యా రాత్రి 9.30 గంటలకు వచ్చేవారు. అమ్మ బ్యూటీపార్లర్ మూసివేసి వచ్చేసరికి 9గంటలయ్యేది. అప్పటివరకు టీవీ చూస్తూ ఒంటరిగా గడిపేదాన్ని. ఆ సమయంలో ఒంటరిగా ఫీలవుతూ తీవ్రంగా ఆలోచించేదాన్ని. మా నాన్నంటే చాలా ఇష్టం. -
రిషితేశ్వరి ‘ఆత్మహత్య’పై ఆరా
గవర్నర్‌కు వివరాలు తెలిపిన గంటా హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన, తదనంతర పరిణామాలపై గవర్నర్ నరసింహన్ రాష్ట్రప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వస్తుండడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ వినతులు అందాయి. ఈ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ , టీఆర్ఎస్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి వినతులిచ్చాయి. ఈ నేపథ్యంలో రిషితేశ్వరి ఆత్మహత్యపై వర్సిటీల చాన్స్‌లర్ అయిన గవర్నర్ ప్రభుత్వం నుంచి వివరాలు అడిగారు. దీంతో మంగళవారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాబ్భవన్లో గవర్నర్‌ను కలసి రిషితేశ్వరి ఆత్మహత్య, అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఆత్మహత్య ఘటనపై పోలీసుల విచారణతో పాటు ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని తెలిపారు. రిషితేశ్వరి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఇంటిస్థలం మంజూరు చేసిన విషయాన్నీ వివరించారు. ర్యాగింగ్ నిరోధానికి చేపడుతున్న చర్యలపై గవర్నర్ ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు. తెలంగాణ అన్యాయం చేస్తోంది..: విభజన చట్టంలోని పదో షెడ్యూల్లో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు వర్సిటీ తదితర ఉన్నత విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని గంటా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ చర్యలతో లక్షలాది ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. వర్సిటీల్లో సిబ్బంది నియామకం, ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు, ఏపీ వర్సిటీల చట్టంలో మార్పులు తదితర అంశాలు మంత్రి గవర్నర్‌కు వివరించారు. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ వర్సిటీల్లో ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వంతో తాను మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు.