డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు? | who is erase the names written in the diary? | Sakshi
Sakshi News home page

డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు?

Published Wed, Aug 5 2015 2:38 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

డైరీలో రాసిన  పేర్లు కొట్టేసిందెవరు? - Sakshi

డైరీలో రాసిన పేర్లు కొట్టేసిందెవరు?

రిషితేశ్వరి డైరీపై ఫింగర్ ప్రింట్‌లు పోలీసులు సేకరించారా?
 
గుంటూరు:   రిషితేశ్వరి ఆత్మహత్య అనంతరం డైరీలోని ఓ పేజీలో ఆమె ‘మై లాస్ట్ నోట్’ పేరుతో రాసిన సూసైడ్ నోట్ మాత్రమే పోలీసులు బహిర్గతం చేశారు. అయితే, మిగతా పేజీలను ఎందుకు బయటపెట్టలేదనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో చేరినప్పటి నుంచి ఏ సందర్భంలో ఆమెకు బాధ కలిగిందో, ఎప్పుడు మనోవేదనకు గురైందో తెలుపుతూ ఆమె మరో ఐదు పేజీలు తన డైరీలో రాసుకుంది. సూసైడ్ నోట్‌తోపాటు ఆ ఐదు పేజీలూ డైరీలో ఉన్నప్పటికీ ఇప్పటివరకూ ఎవ్వరికీ తెలియదు. చివరకు ఆమె తల్లిదండ్రులు సైతం తమకు పోలీసులు ఈ డైరీని చూపలేదని చెబుతున్నారు. ఆ పేజీల్లో రిషితేశ్వరి ఐదుగురు విద్యార్థులు తనను వేధించినట్లు రాసింది. డైరీ పేజీల్లో వారి పేర్లు రాసి ఉన్నప్పటికీ.. ఆ పేర్లు కొట్టేసి ఉన్నాయి. రిషితేశ్వరి కొట్టేసి ఉంటుందనుకుంటే అప్పటి వరకూ బ్లూ ఇంక్‌తో రాసిన పేర్లను అదే ఇంకుతో కొట్టేసి, ‘మిస్టర్‌ఎక్స్’ అని రెడ్ ఇంక్‌తో ఎందుకు రాస్తుందనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆ పేర్లు ఎవరు కొట్టేశారనే అనుమానాలు తీవ్రమవుతున్నాయి.

రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఆ గదిలోకి వెళ్లిన సీనియర్ విద్యార్థులెవరైనా డైరీని గమనించి పేర్లను కొట్టివేశారా.. లేదా మరెవరైనా కొట్టేశారా.. అనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అందులో తాను మంచి స్నేహితునిగా భావించిన ఓ విద్యార్థి తనకు ‘ ఐలవ్‌యూ’ చెప్పడం విస్మయాన్ని కలిగించిందని రిషితేశ్వరి డైరీలో రాసుకున్న విషయాన్ని ఓ టీవీ ఛానల్ ప్రతినిధి ఆమె తండ్రి మురళీకృష్ణను ప్రశ్నించగా ఆ సంఘటన జరిగినప్పుడు అభిషేక్ అనే విద్యార్థి తనకు ‘ఐలవ్‌యూ’ చెప్పాడని తన కుమార్తె తనతో చెప్పిందని ఆయన స్పష్టం చేయడం గమనార్హం. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న రోజు మొదట డైరీని గమనించిందెవరు? ఒక వేళ పోలీసులే గమనించి ఉంటే ఆ డైరీపై ఉన్న ఫింగర్ ప్రింట్లను సేకరించారా? అనే ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. మృతదేహాన్ని పోలీసులు రాకముందే తరలించిన వారు గదిలోనే ఉన్న డైరీని గమనించి ఉండే అవకాశం ఉంది కదా.. అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement