రిషితేశ్వరి ఆత్మహత్యకు అప్పటి ప్రిన్సిపలే కారణం
విద్యార్థులతో కలిసి మద్యం తాగేవారు
దళితుడిని కాబట్టే నన్ను విధుల నుంచి తొలగించారు
ఆర్కిటెక్చర్ మాజీ అసిస్టెంట్ {పొఫెసర్ డేవిడ్ రాజు
గుంటూరు: ఆర్కిటెక్చర్ కాలేజీ అప్పటి ప్రిన్సిపల్ బాబురావు అసభ్యకరమైన చర్యలే రిషితేశ్వరిని ఆత్మహత్యకు పురిగొల్పాయని అదే కాలేజీ మాజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డేవిడ్ రాజు ఆరోపించారు. మంగళవారం డేవిడ్ రాజు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఫ్రెషర్స్‌డే పార్టీలో ఇద్దరు విద్యార్థులు మద్యం తాగి తనపై అసభ్యకరంగా ప్రవర్తించారని రిషితేశ్వరి తన డైరీలో కూడా రాసుకుందని తెలి పారు. ప్రిన్సిపల్ విద్యార్థులతో కలిసి మద్యం తాగటమేంటని ప్రశ్నించారు. యూనివర్సిటీలో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం ఉండగా హాయ్‌ల్యాండ్‌లో ఫ్రెషర్స్ డే నిర్వహించటమేంటని ప్రశ్నించారు. అక్కడ జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపల్ తప్ప అధ్యాపకులనెవరినీ రానివ్వలేదని, అధ్యాపకులు వెళ్లి ఉంటే ఇలాంటివి జరిగేవి కాదన్నారు. ఫోన్లలో అసభ్యంగా మాట్లాడతారని, డ్రాయింగ్ వేసుకుంటుంటే వెనుక నుంచి చేతులు వేస్తారని ఆడపిల్లలు బాబురావు ప్రవర్తనపై మా దగ్గర ఏడ్చి మరీ ఫిర్యాదు చేసేవారన్నారు. ఆడపిల్లలకు రక్షణ లేదని గతంలో యూనివర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, కానీ వారు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. బాబురావు మద్యం తాగి కాలేజీకి వస్తున్నాడని అధ్యాపకులు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారని తెలిపారు.
ఆయన ఆగడాలపై 2014 మార్చిలో రాష్ట్ర గవర్నర్‌కూ మెయిల్ పంపామని తెలిపారు. ఇన్ని జరిగినప్పటికీ ఆయనపై చర్యలు తీసుకోకపోవటం వల్లనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడాల్సి వచ్చిందన్నారు. ఆర్థికపరమైన అవకతవకలకు పాల్పడటంతో బాబురావు చెక్‌పవర్ తీసివేశారని మరలా ఉద్దేశపూర్వకంగానే మళ్లీ చెక్‌పవర్ ఇచ్చారని ఆరోపించారు. కులం ముసుగులో బాబురావు అరాచకాలను కాపాడుతున్నారని పేర్కొన్నారు. విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆయన అరాచకాలను బయటపెడుతున్నాననే దళితుడినైన తనను విధుల నుంచి శాశ్వతంగా తొలగించారని, అసభ్యకరమైన పనులు చేసిన బాబురావు అగ్రకులస్తుడు కావటం వల్లనే కేవలం విధుల నుంచి బహిష్కరించారని పేర్కొన్నారు.