గవర్నర్‌కు వివరాలు తెలిపిన గంటా
హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన, తదనంతర పరిణామాలపై గవర్నర్ నరసింహన్ రాష్ట్రప్రభుత్వం నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి గత కొద్దిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు, ఆందోళనలు వస్తుండడంతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకూ వినతులు అందాయి. ఈ ఆత్మహత్య ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ , టీఆర్‌ఎస్ కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి వినతులిచ్చాయి. ఈ నేపథ్యంలో రిషితేశ్వరి ఆత్మహత్యపై వర్సిటీల చాన్స్‌లర్ అయిన గవర్నర్ ప్రభుత్వం నుంచి వివరాలు అడిగారు. దీంతో మంగళవారం రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు రాబ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి రిషితేశ్వరి ఆత్మహత్య, అనంతరం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారు. ఆత్మహత్య ఘటనపై పోలీసుల విచారణతో పాటు ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని తెలిపారు. రిషితేశ్వరి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా, ఇంటిస్థలం మంజూరు చేసిన విషయాన్నీ వివరించారు. ర్యాగింగ్ నిరోధానికి చేపడుతున్న చర్యలపై గవర్నర్ ఆరా తీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారు.
తెలంగాణ అన్యాయం చేస్తోంది..: విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు వర్సిటీ తదితర ఉన్నత విద్యాసంస్థల్లో ఏపీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించకుండా తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని గంటా గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెలంగాణ చర్యలతో లక్షలాది ఏపీ విద్యార్థులు నష్టపోతున్నారని తెలిపారు. వర్సిటీల్లో సిబ్బంది నియామకం, ప్రైవేటు వర్సిటీల ఏర్పాటు, ఏపీ వర్సిటీల చట్టంలో మార్పులు తదితర అంశాలు మంత్రి గవర్నర్‌కు వివరించారు. తెలుగు వర్సిటీ, అంబేద్కర్ వర్సిటీల్లో ప్రవేశాలపై తెలంగాణ ప్రభుత్వంతో తాను మాట్లాడతానని గవర్నర్ హామీ ఇచ్చారు.
రిషితేశ్వరి ‘ఆత్మహత్య’పై ఆరా
Published Wed, Aug 5 2015 1:08 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement