ప్రాణస్నేహం | Close friendship | Sakshi
Sakshi News home page

ప్రాణస్నేహం

Published Mon, Aug 24 2015 11:14 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

ప్రాణస్నేహం - Sakshi

ప్రాణస్నేహం

ఆత్మహత్య ఆపడానికి ఒక్క ఫ్రెండూ ఉండడు...
కాటికి మోసుకెళ్లడానికి నలుగురు అవసరమా?
స్నేహం చెయ్యాల్సింది బాటలో ముళ్లు తీయడానికి...
అంతిమయాత్రలో పూలు చల్లడానికి కాదు!
స్నేహం నిలబడాల్సింది భారం మోయడానికి...
కాయాన్ని మోయడానికి కాదు!
స్నేహం కావల్సింది కన్నీటిని తుడవడానికి...
నీటి కుండ పగలేయడానికి కాదు!
స్నేహం ఉండాల్సింది జీవాగ్ని నింపడానికి...
చితికి మంట పెట్టడానికి కాదు!
వృథా... వృథా... వృథా... స్నేహం వృథా...
ఫ్రెండ్ ప్రాణం కాపాడలేని స్నేహం వ్యథ!
ఏడవకండి... ఏడుస్తూ కూర్చోకండి.
మీ స్నేహంలో దమ్ముంటే...
స్నేహం ప్రాణాన్ని నిలబెట్టండి.
ఆత్మీయ స్నేహితుల్లారా...
ఆత్మహత్యల్ని ఆపండి.

 
ఎదుటి వారి మాటలను మనం ఎప్పుడైనా వింటున్నామా..? కనీసం ‘ప్రాణ’స్నేహితుల్ల మాటలను మనసుపెట్టి ఆలకిస్తున్నామా..?
 గజి‘బిజీ‘ జీవితాలతో గిడసబారిపోయి, మనం వినే అలవాటును ఎప్పుడో పోగొట్టుకున్నాం.
 
బతుకుపోరు సాగించలేని ప్రాణస్నేహితులు...

 జీవితంపై విరక్తి చెంది ప్రాణాలు తీసేసుకున్నాక... చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు నిండు జీవితమే ముగిసిపోయాక వగచి విలపిస్తున్నాం. అలా కాకుండా, నిరాశలో కూరుకుపోయిన మిత్రుల మాటలను కాస్త ఓపికగా విని ఉంటే ఇన్ని అనర్థాలు జరిగేవా? ఒక రవళి, ఒక రిషితేశ్వరి, ఒక నందిని, ఒక మనీషా... ఇంకా ఇలాంటి చాలామంది...అర్ధంతరంగా తమ బతుకుకు చరమగీతం పాడేవారా..?
   
 మొన్న కడప నారాయణ కాలేజీలో నందిని, మనీషాలు, అటుమొన్న గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో రిషితేశ్వరి, నిన్న నెల్లూరు డిగ్రీ కాలేజీలో రవళి... ఆత్మహత్య చేసుకున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు... ఈ ఏడాది ఇప్పటివరకు మనకు తెలిసి తెలుగు రాష్ట్రాలలో పదిహేను మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వారిలో పదకొండు మంది ఒక విద్యాసంస్థకు చెందిన కాలేజీల్లోని విద్యార్థులే! తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక... ఒకవేళ చెప్పుకుందామని ఆశగా ప్రయత్నించినా, వినేవాళ్లు ఎవరూ లేక... ఒంటరిపక్షుల్లా అల్లాడి అల్లాడి... చాలామంది నిరాశలో కూరుకుపోయి, అర్ధంతరంగా తమ జీవితాలను ముగించేసుకుంటున్నారు. అనర్థాలు జరిగిపోయాక అందరూ తీరికగా ఆవేదన చెందుతున్నారు. మిత్రుల బలవన్మరణాలను జీర్ణించుకోలేక. ఆవేశంతో బంద్‌లు, రాస్తారోకోలు చేస్తున్నారు. మిత్రుల మరణాలను మరవలేకున్నా, ఏమీ చేయలేని నిస్సహాయతతో కాలగమనంలో పడి కొట్టుకుపోతున్నారు.

 మనసుపెట్టి గమనించండి
 ‘ప్రాణ’స్నేహితులుగా ఉండేవారు మనసుపెట్టి గమనిస్తే, తమ స్నేహితుల్లోని ఆత్మహత్యా ధోరణులను ముందుగానే కనిపెట్టి జాగ్రత్తపడవచ్చు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక నిరాశలో కూరుకుపోయిన వారు, ప్రేమ వ్యవహారాల్లో విఫలమై మనోవేదనను అనుభవించేవారు, ర్యాగింగ్ వంటి వేధింపుల కారణంగా మనస్తాపం చెందిన వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. వాళ్లలో కొందరు ఇదివరకు ఆత్మహత్యకు విఫలయత్నాలు చేసిన వారూ ఉండే ఉంటారు. పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం లేక ఒంటరిగా కుమిలిపోతున్న వారు మీ మిత్రుల్లో కొందరు ఉండే ఉంటారు. అలాంటి వాళ్ల పట్ల కాస్త శ్రద్ధపెట్టండి. ఒంటరిగా మిగిలిపోయామని భావించి, బాధపడుతున్న వారికి ఆసరాగా ఉన్నామంటూ భరోసా ఇవ్వండి. వాళ్లు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకించండి. బతుకుపోరులో తోడుగా మేమున్నామంటూ వారికి ధైర్యం చెప్పి, వాళ్లకు బతుకు మీద ఆశ కల్పించండి. ఈ కాస్త మిత్రధర్మాన్ని పాటించినట్లయితే, మీరు మీ మిత్రుల నిండుప్రాణాలను కాపాడినవాళ్లవుతారు.

 మీ మిత్రుల్లో డేంజర్ సిగ్నల్స్ ఏవి కనిపించినా, వెంటనే అలెర్ట్ కావాల్సిందే. అలాంటి మిత్రుల వద్ద ప్రమాదకరమైన వస్తువులేవీ లేకుండా జాగ్రత్తలు తీసుకోండి. వారి మనసు మళ్లించడానికి, ధైర్యం చెప్పడానికి మీ వంతు ప్రయత్నాలు చేయడంతో పాటు, విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకువెళ్లడం, వారికి నిపుణుల సలహా సూచనలు అందేలా సాయం చేయడం మీ మిత్రధర్మంగా గుర్తెరగండి. అవసరమైతే ఢిల్లీలోని సూసైడ్ ప్రివెన్షన్ హెల్ప్‌లైన్- 88888 17666, హైదరాబాద్‌లోని రోష్నీ స్వచ్ఛంద సంస్థ 040-27848584, 66202000. ముంబైలోని ఆస్రా స్వచ్ఛంద సంస్థ 91-22-27546669 నంబర్లకు సంప్రదించి, సలహా సూచనలు కోరండి.
 
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 
 ఇన్‌పుట్స్: మోపూరు బాలకృష్ణారెడ్డి, సాక్షి, కడప
 పోలు అశోక్ కుమార్, సాక్షి, నెల్లూరు, సాక్షి
 
 ఇవీ... డేంజర్ సిగ్నల్స్
 ఆత్మహత్యలకు సిద్ధపడే వారు ముందుగానే కొన్ని సిగ్నల్స్ ఇస్తారు. వాటిని గుర్తించి, సకాలంలో అలర్ట్ అయితే చాలు... నిండుప్రాణాలు బలికాకుండా కాపాడుకోవచ్చు. అంతర్జాతీయ నిపుణులు చెబుతున్న ప్రకారం ఆత్మహత్యలకు సిద్ధపడేవారు ఇచ్చే కొన్ని ముఖ్యమైన డేంజర్ సిగ్నల్స్...

 తిండి, నిద్ర అలవాట్లలో విపరీతమైన మార్పులు కనపరుస్తారు. నిత్యం ఉల్లాసంగా ఉండేవారు అకస్మాత్తుగా ముభావంగా మారిపోతారు. లేదంటే, ఎప్పుడు మౌనంగా ఉండేవారు హఠాత్తుగా ఉత్సాహం ఉరకలేస్తూ కనిపిస్తారు.  మిత్రులకు, కుటుంబ సభ్యులకు దూరదూరంగా ఉంటారు. కొందరు హింసాత్మక ధోరణిని కూడా ప్రదర్శిస్తారు. ఏకాగ్రత లోపంతో కనిపిస్తారు. తరచు కడుపునొప్పి, తలనొప్పి, అలసటగా ఉన్నట్లు చెబుతారు.  కత్తి, బ్లేడు, తాడు, విషం, నిద్రమాత్రలు... వంటి ఆత్మహత్యా సాధనాల గురించి తరచుగా ప్రస్తావిస్తూ ఉంటారు. ఆత్మహత్యా పద్ధతుల గురించి చదవడం వంటివి చేస్తుంటారు.  ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు బాధగా ఉంటారు. ఏ పని మీదా ఆసక్తి చూపరు. ఎక్కువసేపు ఒంటరిగా ఉంటారు. ఎవరినీ కలవడానికి ఇష్టపడరు.అపరాధ భావనలో ఉంటారు. ‘నాకు బతికే అర్హత లేదు’, ‘నన్ను పట్టించుకునే వారే లేరు’, ‘ఈ జీవితంతో విసిగిపోయాను’... అంటూ నిరాశాపూరితమైన మాటలు మాట్లాడుతుంటారు.
 
అప్పుడే వెళ్లి ఉంటే...
రవళిది, మాది ఒకే ఊరు. ఒకే రూమ్‌లో ఉండేవాళ్లం. ఇద్దరం డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాం. ‘హాస్టల్‌లో ఉండలేకపోతున్నాను. మా నాన్నకు ఫోన్‌చేసి రమ్మంటాను. రాగానే ఇంటికి వెళ్లిపోతాను’ అని చెప్పింది. బట్టలు కూడా బ్యాగులో సర్దుకుంది. గురువారం ఎప్పట్లాగే క్లాసుకు బయల్దేరాం. కిందకు రాగానే ‘నోట్స్ మర్చిపోయాను’ అంటూ తన బుక్స్ నా చేతికిచ్చి, మేడమీద గదిలోకి వెళ్లింది. ఎంతకూ రాకపోవడంతో మేం క్లాస్‌కు బయల్దేరాం. రవళి బుక్స్‌ను ఆమె క్లాస్‌రూమ్‌లో ఇచ్చి వెళ్లాం. కొంతసేపటి తర్వాత రవళి ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందింది. అప్పుడే అనుమానించి, మేమూ రూమ్‌కి వెళ్లి ఉంటే ఆమె బతికేదనిపిస్తోంది.
 - ఎర్రబల్లి గంగాభవాని,
 రాపూరు మండలం,పెనుబర్తి, నెల్లూరు
 
 తెలుసుకోలేకపోయాం...
 మేమిద్దరం ఒకే ఊరు వాళ్లం. దాంతో మా ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. నేను డిగ్రీ మూడో సంవత్సరం చదువుతున్నాను. ఒకే హాస్టల్‌లో ఉండటంతో నాతో చనువుగానే ఉండేది. అయితే, తన కష్టమేంటో ఎప్పుడూ చెప్పేది కాదు. నేనూ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఇప్పుడు తను మా మధ్య లేదంటే బాధగా ఉంది.
 - మాదమాల శ్రీలక్ష్మి,
 రాపూరు మండలం, పెనుబర్తి
 
 మంచి స్నేహితులు...
 మాకు ఇక్కడ మార్కులు ఆధారంగా సెక్షన్స్ కేటాయిస్తారు. తక్కువ మార్కులు వస్తే అటు పేరెంట్స్ నుంచి, ఇటు కాలేజీ నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అప్పటి వరకూ మేం మా పేరెంట్స్ వద్దే పెరిగి ఒక్కసారిగా హాస్టల్ పరిస్థితులకు అలవాటు కావడం చాలా కష్టంగా ఉంటుంది. దీంతో త్వరగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాం. అదే విషయాన్ని కొన్ని సార్లు మనీషా, నందిని మాటల్లోనూ దొర్లాయి. మేమంత సీరియస్ తీసుకోలేదు. మంచి స్నేహితులు దూరమైపోయారు.
 - జి.గీతారెడ్డి,
 ద్వితీయ సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప
 
 ఊహించలేదు..

 మనీషా, నందిని ఇద్దరూ నా క్లోజ్ ఫ్రెండ్స్. చాలా హుషారుగా ఉండేవారు. హాస్టల్‌లోని మిగతావారితోనూ బాగా మాట్లాడేవారు. అలాంటి వారు ఒక్కసారిగా చనిపోయారంటే  చాలా భయపడ్డాం. కళాశాలలో ఉదయం నుంచి రాత్రి వరకు చదువే. బాగా ఒత్తిడి ఉంటుంది. అమ్మనాన్నలు ఎలాగూ అందుబాటులో ఉండరు. ఆ ఒత్తిడి గురించి మా మాటల్లో దొర్లినా ఇదంతా మామూలేకదా అనుకున్నాం. కానీ, ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేదు.
 - పి.శివబిందు,
 మొదటి సంవత్సరం, నారాయణ కళాశాల బాలికల క్యాంపస్, కడప
 
 ఒక్క ఆత్మహత్య ఆపడానికి ఎంతోమంది స్నేహితులు కావాలి. ఉన్న స్నేహితులే కాదు... తల్లిదండ్రులూ స్నేహితులు కావాలి. గురువులూ స్నేహితులు కావాలి.ఇరుగు పొరుగు వారూ స్నేహితులు కావాలి. నాయకుడనేవాడూ స్నేహితుడు కావాలి. కాపాడగలవారందరూ స్నేహితులు కావాలి. అప్పుడే ఈ ఆత్మహత్యల్ని ఆపగలుగుతాం.
 
కడపలో ఆత్మహత్య చేసుకున్న కాలేజీ స్టూడెంట్ (మనీషా) తల్లిని ఓదార్చుతున్న వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి (ఫైల్‌ఫొటో)
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement