'నా కుమార్తె మృతిపై అనుమానాలున్నాయి'
కడప : తన కుమార్తె మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని నారాయణ కళాశాలలో ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థిని నందిని తండ్రి సుబ్బారావు వ్యాఖ్యానించారు. నందిని కాళ్లకి, మంచానికి జానెడు తేడా లేకుండా ఆత్మహత్య ఎలా జరుగుతుందని ఆయన బుధవారమిక్కడ ప్రశ్నించారు.
'ఆత్మహత్య చేసుకునే సమయంలో పెనుగులాట జరిగి ఉంటే ఆమె కళ్లజోడు కిందపడేది కదా?, ఇంతవరకూ కనీసం మాతో కళాశాల యాజమాన్యం మాట్లాడలేదు? నా కూతురికి జరిగిన అన్యాయం ఏ ఒక్కరికి జరగకూడదన్నదే నా ఆవేదన' అని సుబ్బారావు కన్నీటిపర్యంతమయ్యారు. కడప శివారులోని నారాయణ కళాశాలలో ఇంటర్ విద్యార్థిని నందిని సోమవారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా కడపలో ఆర్యవైశ్య సంఘం భారీ ర్యాలీ నిర్వహించింది. నారాయణ కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆర్యవైశ్య సంఘం డిమాండ్ చేసింది.