టీడీపీ సర్కారు నిర్వాకాలను వైఎస్సార్‌సీపీకి ఆపాదిస్తూ రామోజీ క్షుద్ర రాతలు
రాజకీయ లబ్ధి కోసం చావులనూ వదలని రాజ గురివింద
పచ్చమూక భూ మాయకు చేనేత కుటుంబం బలి
2015లో ఆన్‌లైన్‌లో చేర్చినట్లు మోసం.. 2017లో మరో మహిళ పేరుతో ఆన్‌లైన్‌లోకి
ప్రభుత్వ భూమికి పట్టాలిచ్చినట్లు వంచన
భూమి దక్కకపోవడం, వ్యసనాలు, రూ.40 లక్షలకుపైగా అప్పులతో కుటుంబాన్ని కడతేర్చి.. సుబ్బారావు బలవన్మరణం
రాజంపేట: అసలే అంతులేని అప్పుల భారం.. ఆపై పచ్చ మూకల ఆన్‌లైన్ భూ మాయాజాలం! ఇదీ అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంలో చేనేతకారుడు పాల సుబ్బారావు కుటుంబం విషాదకర చావులకు అసలు కారణం! దీన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అంటగడుతూ, రాష్ట్రమంతా ఇలాగే జరిగిపోతోందంటూ శోకాలు పెడుతూ ఈనాడు రామోజీ మరోసారి శవాలపై పేలాలను ఏరుకున్నారు! దాదాపు రూ.అరకోటి దాకా తలకు మించిన అప్పులు, భూముల రికార్డులు తారుమారు కావడమే తమ చావులకు దారి తీసినట్లు మరణ వాంగ్మూలంలో సుబ్బారావే వెల్లడించాడు.
అప్పులు చేసింది తానేనని బాధితుడే స్వయంగా ఒప్పుకున్నాడు. మరి ఇక భూములు రికార్డులు తారుమారు ఎప్పుడయ్యాయి? ఎవరు చేశారు? అనేది కదా తేలాల్సిన కీలక అంశం. టీడీపీ హయాంలో 2015లో ఆన్‌లైన్‌లో భూముల మాయాజాలం కారణంగా బాధితుడు వంచనకు గురయ్యాడు. ఎక్కడో కొండల్లో ఉన్న ప్రభుత్వ భూమిని నాడు పచ్చమూకలు రికార్డులు తారుమారు చేసి బాధితుడి తండ్రి చలపతి పేరుతో ఆన్‌లైన్‌లో చేర్చినట్లు నమ్మించాయి. ఆ వెంటనే మరొకరి పేరుతో మార్చి ఇదే వంచనను కొనసాగించాయి. పచ్చమూకలు ఒకరి తరువాత ఒకరిని మోసగించాయి.
ఇవేవీ నిన్ననో మొన్ననో జరిగిన వ్యవహారాలు కాదు. నిజానికి ఆ భూమిని సుబ్బారావుకే కాదు.. ఎవరికీ అసైన్‌మెంట్ (డీకేటీ) కింద ప్రభుత్వం కేటాయించనేలేదు. గతంలో ఎవరూ అధికారికంగా, అనధికారికంగా సాగు చేసిన దాఖలాలూ లేవు. ఆ భూమిని తనకు కేటాయించాలని బాధితుడు ఎన్నడూ కూడా అర్జీ పెట్టుకోలేదు. మరి అలాంటప్పుడు వ్యక్తిగత సమస్యలతో ఓ వ్యక్తి తన కుటుంబాన్ని బలి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లడం ఏమిటనే ఇంగితం రాజ గురువుకు ఉండాలి కదా?
రికార్డుల్లో లేకుండా ఆన్‌లైన్‌లో మాయ
మృతుడు సుబ్బారావు తన తండ్రి వెంకట చలపతి పేరుతో 2187/2 సర్వే నెంబరులో 3.10 ఎకరాల భూమి (ఖాతా నెంబరు 1712) ఉన్నట్లు ఆత్మహత్య లేఖలో పేర్కొన్నాడు. ఆన్‌లైన్‌లో ఎక్కించినట్లు తొలుత సుబ్బారావును 2015లో నమ్మించగా ఆ తరువాత 2017లో కట్టా శ్రావణి పేరుతో ఆన్‌లైన్‌లో చేర్చారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఉన్న కట్టా శ్రావణికి 2020 నుంచి రైతు భరోసా వస్తున్నట్లు వ్యవసాయాధికారి కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతున్నారు.
రెవెన్యూ రికార్డుల మేరకు సర్వే నెంబరు 2050 కొండ నుంచి సబ్ డివిజన్ చేశారు. ఇందులో 9.12 ఎకరాల భూమి ఉండగా మూడు సబ్ డివిజన్లు చేశారు. 2187/1 విస్తీర్ణంలో 3.76 ఎకరాలు, 2187/2 విస్తీర్ణం 5.00 ఎకరాలు, 2187/3 విస్తీర్ణంలో 0.36 ఎకరాలు సబ్ డివిజన్ చేశారు. ఈ సర్వే నెంబర్లలో మృతుడి తండ్రి వెంకట చలపతి పేరుతో డీకేటీ పట్టా ఇచ్చినట్లు రికార్డులో నమోదు కాలేదని రెవిన్యూశాఖ స్పష్టంగా చెబుతోంది.
మృతుడి తండ్రి పేరుతో ఉన్నట్లు చెబుతున్న భూమి సాగులో కానీ, ఎవరి అనుభవంలోగానీ లేదు. ఆ భూమి, రాళ్లు, చెట్లతో కూడుకుని ఉంది. టీడీపీ హయాంలో చోటు చేసుకున్న ఈ అవకతవకలపై ఉన్నతస్ధాయి విచారణ జరిపి చర్యలు తీసుకునేందుకు రెవెన్యూ శాఖ సన్నద్ధమైంది.
నేతకు దూరంగా.. అప్పుల ఊబిలో
విభజన అనంతరం 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెవెన్యూ రికార్డుల తారుమారు మొదలుకొని లెక్కలేనన్ని భూ మాయాజాలాలు జరిగాయి. చేనేతకారుడు సుబ్బారావు దీనికి బలి పశువుగా మారాడు. సుబ్బారావు చాలా రోజులుగా చేనేత పనులకు దూరంగా ఉంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడు.
మద్యానికి బానిస కావడం, ఆపైన క్రికెట్ బెట్టింగ్ లాంటి వ్యసనాలున్నాయి. అందిన చోట అధిక మొత్తంలో అప్పులు చేశాడు. తిరిగి వాటిని తీర్చలేక భార్య, కుమార్తెకు మత్తు ఇచ్చి హతమార్చి ఆ తరువాత ఒంటిమిట్ట చెరువు సమీపంలో రైల్వే ట్రాక్‌పై వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు.
అది ప్రభుత్వ భూమే
ఒంటిమిట్ట: కుటుంబాన్ని కడతేర్చి ఆత్మహత్యకు పాల్పడ్డ చేనేతకారుడు పాలా సుబ్బారావు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అప్పులు చేసినట్లు తమ విచారణలో వెలుగులోకి వచ్చినట్లు కడప డీఎస్పీ షరీఫ్ తెలిపారు. ఎవరెవరికి ఎంత అప్పు ఉన్నాడనే వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. బాధితుడు తన కుటుంబం పేరుతో ఉన్నట్లు చెబుతున్న 3.10 ఎకరాల భూమిపై కడప ఆర్డీవో ప్రత్యేకంగా విచారణ చేపట్టి పూర్తి స్పష్టత ఇచ్చారని వెల్లడించారు.
ఆ వివరాల ప్రకారం అది పక్కాగా ప్రభుత్వ భూమి అని, అందులో ఎలాంటి డీకేటీ పట్టాలు గానీ, ఇతర పట్టాలు గానీ ప్రభుత్వం ఇవ్వలేదని స్పష్టం చేశారు. 2015లో సుబ్బారావు ఇతరుల సహకారంతో ఆన్‌లైన్‌లో తన పేరు నమోదు చేశారని, అనంతరం రెండేళ్లకు (2017లో) మరొకరి పేరుతో అదే భూమి ఆన్‌లైన్‌లో మార్చేశారని చెప్పారు. ఆన్‌లైన్‌లో తారుమారు చేశారే గానీ ప్రభుత్వం తరపున 3.10 ఎకరాలకు సంబంధించి ఎలాంటి పత్రాలు ఇవ్వలేదన్నారు.
నాడు ఆన్‌లైన్‌లో ఎవరు చేర్చారు? రెవెన్యూ శాఖలో ఎవరి ప్రమేయం ఉంది? అనే అంశాలపై దృష్టి సారించినట్లు చెప్పారు. 2015లో పీఎం కిసాన్ లేదని, తర్వాత కూడా సుబ్బారావు పేరుతో పీఎం కిసాన్ సాయం పడలేదని తెలిపారు. సుబ్బారావు వ్యసనాలకు బానిసగా మారి క్రికెట్ బెట్టింగ్ కారణంగా అప్పుల పాలై చనిపోవాలని నిర్ణయించుకున్నాడన్నారు.
:::ఎండీ షరీఫ్ డీఎస్పీ ,కడప
బాబు శవ రాజకీయాలు: ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి
టీడీపీ అధినేత చంద్రబాబు శవ రాజకీయాలతో పబ్బం గడుపుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్‌సీపీ రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్ధి ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి విమర్శించారు. సుబ్బారావు, పద్మావతి, వినయ మృతదేహాలకు ఆయన నివాళులర్పించి పెద్ద కుమార్తెను ఓదార్చారు. తామున్నామని ధైర్యం చెప్పారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
సుబ్బారావు భూమికి సంబంధించి ఆన్‌లైన్ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగిందనే విషయం గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు. సుబ్బారావు కుటుంబానికి అన్యాయం చేసిన వారు ఎవరైనా సరే ఉరి తీయాలన్నారు. బాధిత కుటుంబానికి అండగా నిలబడాల్సింది పోయి రాజకీయ లబ్ధి కోసం ప్రభుత్వంపై బురదచల్లడం చంద్రబాబు చిల్లర రాజకీయానికి నిదర్శనమన్నారు. బీసీల సంక్షేమం కోసం సీఎం జగన్ ఎంత కృషి చేశారో బడుగులందరికీ తెలుసన్నారు. ఈ ఘటనను సీఎం జగన్ దృష్టికి తెచ్చి న్యాయం చేస్తామన్నారు.
డీకేటీ పట్టా ఇవ్వలేదు..
పాల సుబ్బారావు అప్పులు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తండ్రి వెంకట చలపతి పేరుతో డీకేటీ పట్టా మంజూరు చేసినట్లు రికార్డుల్లో ఎక్కడా నమోదు కాలేదు. ఆ సర్వే నంబరు ఉన్న భూమి సాగు, అనుభవంలో లేదు. రాళ్లు ,చెట్లతో నిండి ఉంది. అది కట్టా శ్రావణి పేరుతో ఎలా మార్పు జరిగిందనే అంశంపై విచారణ చేసి చర్యలు తీసుకుంటాం.
:::వెంకటరమణ, తహసీల్దారు, ఒంటిమిట్ట
గతంలో జరిగిన మోసమే..
టీడీపీ పాలనలోనే సుబ్బారావు, కట్టా శ్రావణి ఆన్‌లైన్ భూముల వ్యవహారాలు జరిగాయన్నది సత్యం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై బురదచల్లడం విచారకరం. గతంలో జరిగిన మోసాన్ని ఈ ప్రభుత్వంపై రుద్దడం ఎన్నికల స్టంట్ అని చేనేత కార్మికులతోపాటు ప్రజలందరికీ తెలుసు. భూమి ఆన్‌లైన్‌లో మారిన కొత్తపల్లెకు చెందిన కట్టా శ్రావణి విదేశాల్లో ఉన్నారని చెబుతున్నారు. సుబ్బారావు కుటుంబం మృతి ఘటన మమ్మల్ని కలిచివేసింది. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
:::పి.శేషారెడ్డి, కొత్త మాధవరం, ఒంటిమిట్ట
ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అవివేకం..
మా గ్రామంలో ముగ్గురు చనిపోవడం చాలా బాధాకరం. అప్పుల బాధలు సుబ్బారావును చుట్టుముట్టాయి. ఆయన భూమి ఆన్‌లైన్ వ్యవహారం టీడీపీ హయాంలోనే జరిగింది. దాన్ని ఈ ప్రభుత్వానికి అంటగట్టడం అవివేకం. సుబ్బారావు తండ్రి చలపతి మూడేళ్ల క్రితం చనిపోయారు. వృత్తికి దూరమైన సుబ్బారావు మద్యం వ్యసనాలతో అప్పుల్లో కూరుకుపోయి తనువు చాలించాలనుకున్నాడు. భార్య, కుమార్తెను హత్య చేయటాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం.
:::పన్నెల చంద్రశేఖర్, గ్రామపెద్ద, కొత్తమాధవరం, ఒంటిమిట్ట
Comments
Please login to add a commentAdd a comment