ప్రిన్సిపాల్ బాబూరావుపై ఎట్టకేలకు ఫిర్యాదు
రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచిపోయినా.. రాష్ట్రమంతా దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన చెలరేగినా స్పందించని నాగార్జున యూనివర్సిటీ వీసీ.. వైఎస్ఆర్సీపీ కమిటీ పర్యటనతో ఎట్టకేలకు కదిలారు. ఆత్మహత్యకు ప్రత్యక్షంగా కారకుడని ఆరోపణలు వస్తున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యాంటీ ర్యాగింగ్ చట్టం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు. దాదాపు గంటన్నరకు పైగా వీసీ సాంబశివరావు,రిజిస్ర్టార్ రాజశేఖరలతో నిజనిర్ధారణ కమిటీ సమావేశమైంది.
అంతకుముందు వైఎస్ఆర్సీపీ నిజనిర్ధారణ కమిటీ సభ్యులు యూనివర్సిటీ హాస్టల్ భవనాన్ని పరిశీలించారు. హాస్టల్ను తనిఖీచేసి విద్యార్థులతో పాటు వార్డెన్తో మాట్లాడారు. అక్కడ ఉన్న వసతులపై కూడా చర్చించారు. ఇప్పటికి రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మూడు వారాలు గడిచినా బాబూరావు మీద అసలు కేసు కూడా పెట్టలేదు, ఎలాంటి చర్య తీసుకోలేదు. ఈరోజు వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేయడంతో.. అక్కడే కమిటీ సభ్యుల సమక్షంలోనే తాగి తందనాలాడుతున్న బాబూరావుపై చర్యలు తీసుకోవాలంటూ వీసీ ఫిర్యాదు రాసి పెదకాకాని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కు అందించారు.