'తల్లిదండ్రుల వైఖరి మారాలి'
గుంటూరు : విద్యాసంస్థల యాజమాన్యాలతో పాటు పేరెంట్స్ వైఖరి మారాలని ఆంధ్రప్రదేశ్ మంత్రులు గంటా శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. ఒత్తిడి లేని విద్యావ్యవస్థ, కాలేజీ యాజమాన్యాల తీరుపై మంత్రులు గుంటూరు పట్టణంలో సమీక్ష నిర్వహించారు. ప్రైవేట్ యాజమాన్యాల కోసం పిల్లల ప్రాణాలు పణంగా పెట్టలేమని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ప్రత్తిపాటి అన్నారు.
విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వంతో పాటు కాలేజీ యాజమాన్యాలూ కారణమేనన్నారు. ఒత్తిడిలేని విద్యావ్యవస్థ కోసం అందరూ ప్రయత్నించాలని మంత్రులు పేర్కొన్నారు. విద్యార్థులకు యోగా, సాంస్కృతిక కార్యక్రమాలు నేర్పించడంపై విద్యాసంస్థలు దృష్టిపెట్టాలని మంత్రి ప్రత్తిపాటి సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్య తర్వాత ప్రభుత్వం పూర్తిస్థాయిలో విద్యావ్యవస్థపై దృష్టిసారించిందన్నారు.