మంత్రి గంటా తీవ్ర అసంతృప్తి | Ganta Srinivasa Rao Disappointed Over ANU VC Appointment | Sakshi
Sakshi News home page

ఆ అధికారం కూడా నాకు లేదా?!

Published Wed, Jan 16 2019 8:36 AM | Last Updated on Wed, Jan 16 2019 5:57 PM

Ganta Srinivasa Rao Disappointed Over ANU VC Appointment - Sakshi

సాక్షి, అమరావతి: ఆచార్య నాగార్జున వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా శ్రీకాకుళం అంబేడ్కర్‌ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్‌ కె.రామ్‌జీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఇంతకు ముందు ఈ వర్సిటీ ఇన్‌చార్జి వీసీగా ఇక్కడే వీసీగా కాలపరిమితి ముగించుకున్న ప్రొఫెసర్‌ ఏ.రాజేంద్రప్రసాద్‌ను నియమిస్తూ ఈ నెల 11న ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీ యూనివర్సిటీ చట్టానికి విరుద్ధంగా ఈ నియామకం జరిగిందంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఇన్‌చార్జి వీసీగా వర్సిటీ రెక్టార్‌ను నియమించాలని ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రతిపాదనలను పక్కన పెట్టిమరీ.. ముఖ్యమంత్రి కార్యాలయంలోని అధికారులు రాజేంద్రప్రసాద్‌ను నియమించడంతో చివరకు అది వివాదంగా మారింది. మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తపరచడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. చివరకు రాజేంద్రప్రసాద్‌ నియామకాన్ని తాత్కాలికంగా నిలుపుచేసిన ఉన్నత విద్యాశాఖ.. చివరకు ఆయన నియామక ఉత్తర్వులు రద్దుచేసి కొత్తగా రామ్‌జీని నియమిస్తూ ఉత్తర్వులిచ్చింది.  

సీఎంవో తీరుపై మంత్రి అసంతృప్తి
ఇన్‌చార్జి వీసీగా రెక్టార్‌ను నియమించాలని అంతకు ముందు ఆ శాఖ మంత్రి గంటా లిఖిత పూర్వకంగా చేసిన ప్రతిపాదనను సీఎంవో అధికారులు పక్కన పెట్టడంపై మంత్రి అసంతృప్తికి లోనయ్యారు. ఇన్‌చార్జి వీసీ నియామకం వంటి చిన్న చిన్న అంశాల్లో మంత్రులే నిర్ణయం తీసుకోవడం ఆనవాయితీ. అయితే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు రెక్టార్‌కు బదులు రాజేంద్రప్రసాద్‌ను నియమించి.. మంత్రి నిరసనతో మళ్లీ మార్పు చేసి.. ప్రస్తుతం రామ్‌జీని నియమించారు. ఇన్‌చార్జి వీసీని నియమించే అధికారం కూడా తనకు లేకపోవడంపై మంత్రి మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
 
హడావుడిగా పలు ఫైళ్లపై సంతకాలు
మరోపక్క ఇన్‌చార్జి వీసీగా కొనసాగేలా ఈ నెల11న ఉత్తర్వులందుకున్న రాజేంద్రప్రసాద్‌.. ఆ ఉత్తర్వులు పెండింగ్‌లో పడడంతో రాత్రికి రాత్రే హడావుడిగా పలు ఫైళ్లపై సంతకాలు చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో నిబంధనలకు విరుద్ధమైన నియామకాలతో పాటు.. పలు ఇతర నిర్ణయాలకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారన్న ఆరోపణలొస్తున్నాయి. ఈ నియామకాలపై విచారణ జరిపి రాజేంద్రప్రసాద్‌పై చర్యలు చేపట్టాలంటూ రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మానవ వనరులశాఖ మంత్రికి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌కు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదులు పంపినట్టు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

ఏఎన్‌యూ ఇన్‌చార్జ్‌ వీసీగా ఆచార్య రామ్‌జీ
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌చార్జ్‌ వీసీగా శ్రీకాకుళం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ఆచార్య కూన రామ్‌జీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దమయంతి జీవో నంబర్‌ ఆర్‌టీ 14ను ఆదివారం విడుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేవరకు రామ్‌జీ ఏఎన్‌యూకి ఇన్‌చార్జ్‌ వీసీగా కొనసాగుతారు. ఈ ఉత్తర్వుల్లో రాజేంద్రప్రసాద్‌ను 2016లో రెగ్యులర్‌ వీసీగా నియమించిన జీవోను, ఇన్‌చార్జ్‌ వీసీగా నియమించిన జీవోను రిఫరెన్స్‌గా పేర్కొన్నారు. ఇలా రెండు జీవోలను రిఫరెన్స్‌గా చూపడం వెనుక ఆంతర్యమేమింటనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇదిలా ఉండగా రామ్‌జీ 17న విధుల్లో చేరనున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement