రిషితేశ్వరి కేసులో ఏ4 నిందితుడిగా బాబురావు
* రిషితేశ్వరి కేసులో చార్జిషీటు దాఖలు
* ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడని తేల్చిన పోలీసులు
* వివిధ సెక్షన్ల కింద శిక్షించాలని కోర్టుకు నివేదన
* చార్జిషీట్ వివరాలను గోప్యంగా ఉంచిన వైనం
* జనవరి నాలుగో తేదీన తదుపరి విచారణ
సాక్షి, గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అప్పటి ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆరు నెలలుగా కేసు దర్యాప్తు చేస్తున్న ఏపీ పోలీసులు ఎట్టకేలకు బాబూరావు పాత్రపై నిగ్గు తేల్చగలిగారు.
సుమారు 70 మందిని విచారించగా కళాశాలలో ర్యాగింగ్, హాయ్‌ల్యాండ్‌లో జరిగిన ఫ్రెషర్స్‌డే వేడుకల్లో రిషితేశ్వరిపై లైంగిక వేధింపులు జరిగినట్లు తెలి సినా ఆయన పట్టించుకోలేదని వెల్లడైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు 15 రోజుల క్రితం గుంటూరు జిల్లా ఒకటో అదనపు జిల్లా సెషన్స్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలిసింది. ర్యాగింగ్ విషయంలో బాబూరావు నిర్లక్ష్యంగా వ్యవహరించాడని పోలీసుల విచారణలో నిర్ధారణ కావడంతో ఆయనపై ర్యాగింగ్ యాక్ట్ నమోదు చేసినట్టు తెలిసింది.
అయితే ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సమయానికి రిషితేశ్వరి మేజర్ అయినప్పటికీ హాయ్ ల్యాండ్‌లో ఫ్రెషర్స్‌డే పార్టీ జరిగే సమయానికి ఆమె మైనర్ కావడం గమనార్హం. ఈ విషయాన్ని సైతం పోలీసులు చార్జిషీట్‌లో ప్రస్తావించినట్లు తెలిసింది. 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా ఆరు నెలల సమగ్ర విచారణ తరువాత పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.
ర్యాగింగ్‌ను ప్రోత్సహించాడు...
న్యాయవాది వై.కె. శుక్రవారం ‘సాక్షి’తో మాట్లాడుతూ రిషితేశ్వరి కేసులో బాబూరావును 4వ నిందితుడిగా చేరుస్తూ మంగళగిరి డీఎస్పీ రామాంజనేయులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారని చెప్పారు. ర్యాగింగ్ నేరాన్ని చూస్తూ చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించడమేకాక, నేరాన్ని ప్రత్యక్షంగా ప్రోత్సహించాడని, దీనిపై విచారించి ఆయనను శిక్షించాలని పోలీసులు చార్జిషీట్‌లో కోరారని తెలిపారు.
నిందితులపై గతంలో నమోదైన ఐపీసీ 306, ర్యాగింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 4తోపాటు, బాలికలపై లైంగిక అత్యాచారాల రక్షణ చట్టంలోని 7, 8, 11, 12 సెక్షన్‌ల కింద కూడా విచారించి శిక్షించాలని పోలీసులు చార్జిషీట్ ద్వారా కోర్టును కోరారని ఆయన చెప్పారు. దీనిపై కోర్టు కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించడానికి జనవరి 4వ తేదీకి కేసును వాయిదా వేసిందని తెలిపారు.
ఈ కేసులో పోలీసుల తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌తో పాటు రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తరఫున తానూ వాదనలు వినిపించనున్నట్లు చెప్పారు. బాబూరావును నిందితుడిగా చేర్చినప్పటికీ ఆయన్ను అరెస్ట్ చేయకుండా పోలీసులు జాప్యం చేస్తున్నారని, చార్జిషీట్‌తో సంబంధం లేకుండానే నిందితులను అరెస్ట్ చేయవచ్చని వై.కె. అన్నారు. కాల్‌మనీ కేసులో నిందితుడు సత్యానందంలాగా బాబూరావు కూడా ముందస్తు బెయిల్ తెచ్చుకునే అవకాశం పోలీసులే ఇస్తున్నట్లు భావించాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. బాబూరావును వెంటనే అరెస్ట్ చేసి ఇలాంటి ఆరోపణలకు తెరదించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.