విద్యార్థి ఉద్యమం
- వర్సిటీలో ఐక్యకార్యాచరణ కమిటీగా ఏర్పడిన విద్యార్థి సంఘాలు
- క్యాంపస్‌లో భారీ ర్యాలీ, ప్రధాన ద్వారం వద్ద ధర్నా
- ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై న్యాయ విచారణకు డిమాండ్
- విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఇన్‌చార్జి వీసీకి వినతిపత్రం
ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యపై న్యాయ విచారణకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు ఉద్యమం చేపట్టారు. ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ)గా ఏర్పడిన విద్యార్థి సంఘాలు శుక్రవారం వర్సిటీలో భారీ స్థాయిలో ర్యాలీ నిర్వహించి ప్రధాన ద్వారం వద్ద ధర్నా నిర్వహించారు.
విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో దోషులను పట్టుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని, వర్సిటీలో విద్యార్థినులకు రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా నినాదాలు చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జి వీసీకి అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ నాయకులు మాట్లాడుతూ విద్యార్థినులకు యూనివర్సిటీలో రక్షణ లేదనటానికి, మితిమీరిన వేధింపులు ఉన్నాయనటానికి రిషితేశ్వరి ఆత్మహత్యే నిదర్శనమన్నారు.
మరే విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి బలి కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకునే వరకు తాము ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. ర్యాగింగ్‌ను యూనివర్సిటీ నుంచి తరిమి కొడతామని పేర్కొన్నారు. విద్యార్థిని మృతిపై న్యాయవిచారణ జరిపించాలని, ర్యాగింగ్ నిరోధక కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని ఇన్‌చార్జి వీసీ ఆచార్య కేఆర్‌ఎస్ సాంబశివరావు కు సమర్పించారు. దీనిపై ఇన్‌చార్జి వీసీ స్పందిస్తూ యూనివర్సిటీ వసతి గృహాల్లో భద్రతా చర్యలు ప్రారంభమయ్యాయని రెసిడెంట్ వార్డెన్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామన్నారు. ర్యాగింగ్ నిరోధక కమిటీలు, యూనివర్సిటీ సీనియర్ అధ్యాపకులు వారంలో మూడు రోజులు వసతి గృహాల్లో పర్యటిస్తారని తెలిపారు.
రాత్రి పదిగంటల తరువాత తాను కూడా వసతి గృహాల్లో ఆకస్మిక తనిఖీ చేస్తానని తెలిపారు. ఘటనపై న్యాయ విచారణ జరపటం, కళాశాల ప్రిన్సిపాల్‌పై చర్యలకు ప్రభుత్వాన్ని సంప్రదిస్తాననీ, వారు ఏవిధంగా చెబితే ఆవిధంగా నడుచుకుంటానన్నారు. దీనికి నిర్ణీత గడువు చెప్పాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేయగా, ప్రభుత్వంతో ఈ రోజే తాను మాట్లాడతానన్నారు. యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీలో ఉన్న ఓ అధ్యాపకుడు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ అసాంఘిక చర్యలను సమర్థిస్తూ మాట్లాడడం సమంజసమా అని ఎస్‌ఎఫ్‌ఐ నాయకురాలు జ్యోతి ఈ సందర్భంగా ప్రశ్నించారు. దీనికి వీసీ స్పందిస్తూ కమిటీ సభ్యుడు అలా మాట్లాడి ఉండకూడన్నారు.
విద్యార్థుల దాడిపై పోలీసులకు ఫిర్యాదు.. యూనివర్సిటీలో గురువారం సాయంత్రం జరిగిన బహిరంగ విచారణలో ఆర్కిటెక్చర్ విద్యార్థులు తమపై దాడి చేశారని వారిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి జేఏసీ డిమాండ్ చేసింది. దీనికి వీసీ స్పందిస్తూ ఆ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామనీ, పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు.
రిషితేశ్వరి కేసు దర్యాప్తుపై అర్బన్ ఎస్పీ ఆరా
పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన రిషితేశ్వరి కేసులో అప్రమత్తంగా వ్యవహరించాలని అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి సూచించారు. పెదకాకాని పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఎస్పీ నాలుగుగంటల పాటు అధికారులతో చర్చించారు. మహిళా పోలీసుస్టేషన్ డీఎస్పీ కమలాకర్‌రావు, సీఐలు కాకర్ల శేషారావు, కొంకా శ్రీనివాసరావు, ఎస్‌ఐలు పి.కృష్ణయ్యతో కేసు విషయం చర్చించారు. ప్రిన్సిపాల్ బాబూరావు పార్టీల పేరుతో విద్యార్థులతో కలిసి డాన్సులు వేస్తున్న దృశ్యాలు, మెసేజ్‌లు వంటివి క్షుణ్ణంగా పరిశీలించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు సంబంధించి పోస్టుమార్టం, ఫోర్సెనిక్ రిపోర్ట్‌లకు సంబంధించిన నివేదిక అందాల్సి ఉందన్నారు.