చరిత్రపై విశిష్ట పరిశోధనలు చేసి భావితరాలకు తెలియజేసే విధంగా చరిత్రశాఖ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ కె.వియన్నారావు సూచించారు.
ఒంగోలు వన్‌టౌన్ : చరిత్రపై విశిష్ట పరిశోధనలు చేసి భావితరాలకు తెలియజేసే విధంగా చరిత్రశాఖ కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ చాన్సిలర్ ప్రొఫెసర్ కె.వియన్నారావు సూచించారు. ప్రకాశం జిల్లా ప్రాచీన, మధ్యయుగ చరిత్రపై శనివారం స్థానిక ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒంగోలు క్యాంపస్‌లో ప్రారంభమైన రెండురోజుల జాతీయ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. చరిత్రపై ఆశించిన స్థాయిలో పరిశోధనలు జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భావితరాలకు చరిత్ర గురించి సంపూర్ణ అవగాహన కలిగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రకాశం జిల్లాకు ప్రాచీన, మధ్యయుగాల్లో విశిష్టమైన చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయని వియన్నారావు వివరించారు. వాటన్నింటిపై లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.
జిల్లాలో అనేక మతాలు పరిహరివిల్లాయన్నారు. బౌద్ధ, జైన మతాలతో పాటు హిందూ మతం కూడా బాగా విస్తరించిందన్నారు. జిల్లాలో బౌద్ధమతం వ్యాప్తికి సంబంధించి అనేక ప్రాంతాల్లో బౌద్ధస్తూపాలు, చారిత్రక ఆనవాళ్లు ఉన్నాయన్నారు. జిల్లా చరిత్ర గురించి విస్తృతమైన పరిశోధనలు నిర్వహిస్తే అవన్నీ తెలుస్తాయని పేర్కొన్నారు. పరిశోధనాంశాలను పుస్తకరూపంలో తెచ్చేందుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్థిక సహాయం అందిస్తుందని ఆయన తెలిపారు. సామాజిక శాస్త్రాలకు సంబంధించి అన్ని విభాగాల్లో ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో సెమినార్లు నిర్వహించాలని, విద్యార్థులకు ఆయా అంశాలపై అవగాహన పెంచాలని ప్రొఫెసర్ వియన్నారావు సూచించారు.
జిల్లాలో అందుబాటులో ఉండే వనరులు, రాజకీయ, సామాజిక అంశాలను వెలుగులోకి తెస్తే సమాజంలో అన్నివర్గాల వారికి ఉపయోగకరంగా ఉంటుందని ఆయన సూచించారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఒంగోలు క్యాంపస్ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించిన సదస్సును డాక్టర్ వి.వి.సుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో యూనివర్సిటీ చరిత్రశాఖ విశ్రాంత ప్రొఫెసర్ వి.డేవిడ్‌రాజు, వైస్ చాన్సిలర్ సతీమణి ప్రొఫెసర్ జ్యోతి, గ్రానైట్ వ్యాపారి బదరీనారాయణ, సెమినార్ కో ఆర్డినేటర్ డాక్టర్ డి.వెంకటేశ్వరరెడ్డి, ప్రొఫెసర్ ఎం.వెంకటేశ్వరరావు, చరిత్రశాఖ అధ్యాపకులు డాక్టర్ జి.రాజమోహనరావు, డి.సోమశేఖర్, కేవీఎన్ రాజు, ఎన్.సంజీవరావు, నిర్మలామణి, వివిధ విశ్వవిద్యాలయాల అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు.