రైతుల పాలిట ఆధునిక ఆలయాలు | Agroecologist Gurava Reddy comments on performance of RBK | Sakshi
Sakshi News home page

రైతుల పాలిట ఆధునిక ఆలయాలు

Published Sun, Jun 7 2020 5:33 AM | Last Updated on Sun, Jun 7 2020 5:33 AM

Agroecologist Gurava Reddy comments on performance of RBK - Sakshi

రైతు భరోసా కేంద్రంలో రైతులతో మాట్లాడుతున్న సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.గురవారెడ్డి

తెనాలి: ఏ పంట సాగు చేయాలి? ఏ పంట వేస్తే మంచి రేటుకు అమ్ముకోవచ్చు? ఈ విషయం ఎవరిని అడగాలి? విత్తనాలు ఏ విధంగా సమకూర్చుకోవాలి? మందులు, ఎరువుల మాటేమిటి? పంట చేతికొచ్చే దశలో నష్టపోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి? బీమా ఎలా చేయాలి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఊరూరా రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే)ను ప్రారంభించింది. ప్రస్తుతం రైతులందరికీ చక్కగా విత్తనాలు అందిస్తుండటం వినూత్నం. ప్రతి రైతుకూ తానుంటున్న ఊళ్లోనే ఇన్ని సేవలు అందిస్తున్న ఆర్‌బీకేల పనితీరు ఎలా ఉందో ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయంలోని సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ కె.గురవారెడ్డికి ప్రత్యక్షంగా చూడాలనిపించింది. ఆలోచన వచ్చిందే తడవుగా శుక్రవారం ఉదయం గుంటూరు నుంచి బయలు దేరారు. వేమూరు, తెనాలి నియోజకవర్గాల్లోని చుండూరు, అంగలకుదురు, పెదరావూరు, వల్లభా పురంలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించారు. ఆయన గమనించిన విషయాలు ఆయన మాటల్లోనే.. 

ఇంతలో ఎంత మార్పు..!
► పల్లెటూళ్లలో ఒక్కో ఆర్‌బీకేను చూడగానే అత్యాధునిక టెక్నాలజీతో ఉన్న కుటీరంలోకి అడుగు పెట్టిన అనుభూతి కలిగింది. పల్లె వాతావర ణాన్ని తలపించే రంగులతో తీర్చిది ద్దడం ఆహ్లాదంగా అనిపించింది.
► అతి పెద్ద మొబైల్‌ ఫోన్‌ లాంటి డిజిటల్‌ కియోస్క్, స్మార్ట్‌ ఫోనుతో అనువుగా తీర్చిదిద్దారు. నేను వెళ్లే సరికే పలువురు రైతులు అక్కడున్న వ్యవసాయ సహాయకులతో సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు.
► కృష్ణా పశ్చిమ డెల్టాలో ఖరీఫ్‌ సీజనులో విస్తారంగా సాగుచేసే వరి విత్తనాల గురించి రైతులు చర్చించుకుంటున్నారు. కియోస్క్‌ పని తీరును స్వయంగా చూశాను. స్మార్ట్‌ మొబైల్‌ ఫోన్‌ను వినియోగించే రైతు ఎవరైనా, తానే సొంతంగా కియోస్క్‌లో కావాల్సిన విత్తన రకాన్ని బుక్‌ చేసుకోవచ్చు. సహాయకుల సహకారంతో కొందరు బుక్‌ చేసుకున్నారు. మరికొందరు సహాయకులతోనే బుక్‌ చేయించారు. 
► విత్తనం బుక్‌ చేసిన 48 గంటల్లోపు డెలివరీ తీసుకొనేలా చర్యలు తీసుకున్నారు. విత్తనాలే కాదు, ఎరువులు, పురుగు మందులనూ ఇలాగే తీసుకోవచ్చని తెలిసి ఎంతో ఆనందం వేసింది. 
► వ్యవసాయ రంగంలో ఇదొక నూతన అధ్యాయం.. దేశంలోనే వినూత్నమైన ముందడుగు.. ఇంతలో ఇంత మార్పు వస్తుందని ఊహించలేదని రైతులు చర్చించుకోవడం కనిపించింది.

ఇలా చేస్తే ఇంకా మేలు..
► దుక్కి దున్నిన రైతులు, భూమి పదును తేలగానే విత్తనం కోసం వెతుకుతాడు. పంట వేశాక, వర్షం కురవగానే ఎరువుల కోసం దౌడుతీస్తాడు. తెగులు కనిపిం
చగానే తగిన మందు కొట్టేందుకు ఆరాటపడతాడు. అలాంటి పరిస్థితుల్లో గ్రామ సచివాలయంలో డబ్బు చెల్లించి, చీటీ తీసుకురాగానే తగిన విత్తనం/ ఎరువు/ పురుగుమందు సిద్ధంగా ఉండే లా స్టాకు పాయింట్‌ ఏర్పాటు చేయాలని కొందరు రైతులు సూచించారు. 
► వేర్వేరు చోట్ల స్థిరపడిన వారికి ఊళ్లో గల భూములను అనధికారికంగా కుటుంబ సభ్యులే కౌలు చేస్తుంటారు. ‘యజమాని వచ్చి వేలిముద్ర వేస్తేనే’ అనే నిబంధన స్థానంలో ఎక్కడైనా రేషన్‌ తీసుకున్నట్టుగా ఓటీపీ/లెటర్‌/ఆధార్‌ సీడింగ్‌ ద్వారా సేవలందించగలిగితే ఎంతో మేలు. 

ఆధునిక పరిజ్ఞానంతో రైతులకు మేలే
► వ్యవసాయాన్నంతటినీ ఆర్‌బీకే అనే వ్యవస్థలోకి మళ్లించటం, సాంకేతిక పరిజ్ఞానా నికి అధిక ప్రాధా న్యత ఇవ్వటం వల్ల దళారుల ప్రాబల్యం తగ్గుతుం దన్న ఆశాభావాన్ని రైతులే వెలిబుచ్చారు. దీనివల్ల అవినీతికి ఆస్కారం లేకపోవటంతో పాటు రైతులకు మంచి జరుగుతుండటం కళ్లెదుటే కనిపించింది.
► నాడు నాగార్జునసాగర్‌ను ఆధునిక దేవాలయం అన్నారు. నేడు ఊరూరా ఉన్న రైతు భరోసా కేంద్రాలు రైతుల పాలిట ఆధునిక దేవాలయాలుగా వర్ధిల్లుతాయన్న భావన కలిగింది. 

డీలర్‌ వద్దకు పరుగెత్తాల్సిన పనిలేదిక
► భూసార పరీక్షలకు తగిన సలహాలు, తోడ్పాటు, వరి విత్తే దశ నుంచి నారుమడి పెంపకం, వరి నాట్లు, ఎదిగిన పైరుకు కావాల్సిన ఎరువులు, చీడ పీడలు, దోమల నివారణకు అవసరమైన పురుగు మందు లపై తగిన సలహాలను ఇవ్వడానికి ఉద్యోగు లు సిద్ధంగా ఉండటం చూసి ముచ్చటేసింది.
► ఏదైనా పంటకు తెగులు ఆశించిందని తెలి యగానే ఇన్నాళ్లూ రైతులు పరుగెత్తుకుంటూ పురుగు మందుల డీలర్‌ దగ్గరకు ఇక వెళ్లాల్సిన అవసరం లేదే లేదనిపించింది. 
► ఇన్నాళ్లూ ఆ వ్యాపారి తన పరిజ్ఞానంతో ఏదో ఒక మందు వాడాలని చెప్పడం.. 
అది సరిగా పని చేయక రైతులు నష్టపోవడం ఏటా చూశాం. ఇక ఈ పరిస్థితి ఉండదు. ఎరువుల విషయంలోనూ అంతే. వల్లభాపురంలో పలువురు రైతులు ఇదే విషయం గురించి మాట్లాడుకున్నారు. 

రైతులకు విస్తృత ప్రయోజనాలు 
ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కుటుంబం నాది. సొంతూరు వల్లభాపురంలో వ్యవసాయం చేస్తున్నాను. మండల కేంద్రానికి వెళ్లకుండా, అన్నీ గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల్లోనే రైతులకు వనరులు, సలహాలు, శిక్షణ లభించటం గొప్ప విషయం. 
– లంకిరెడ్డి రాజశేఖరరెడ్డి, రైతు, వల్లభాపురం

కాన్సెప్ట్‌ అద్భుతం..
రైతు భరోసా కేంద్రాల కాన్సెప్ట్‌ అద్భుతం. చక్కని ముందడుగు. ఎంతోకాలంగా కష్టనష్టాలు పడుతూ వ్యవసాయాన్ని వదులుకోలేక, సాగు కొనసాగిస్తున్నాం. ఏవేవో రాయితీలంటూ ఇచ్చినా, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు.. రైతుల అన్ని సమస్యలకు పరిష్కారంగా తోస్తోంది.  
– కాకర్ల వెంకట కృష్ణయ్య, రైతు, అంగలకుదురు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement