తిరుపతి (ఎడ్యుకేషన్): దేశానికి వెన్నెముక అయిన రైతుల ఆదాయం పెంచేలా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తలు కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చాన్సలర్ విశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ 52, 53వ స్నాతకోత్సవ వేడుకలను బుధవారం సాయంత్రం స్థానిక మహతి ఆడిటోరియంలో ఎస్వీ వ్యవసాయ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు.
గవర్నర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ.. ఆహార భద్రత, పంట ఉత్పాదకత, రైతు ఆదాయం పెంపు లక్ష్యంగా వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విజ్ఞానం అందించాలని సూచించారు. 2019–20లో జాతీయ స్థూల ఉత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా 17.8 శాతం నమోదు కాగా, 2021 సంవత్సరానికి 19.9 శాతం సాధించడంలో మన రైతులు చేసిన కృషి అభినందనీయమన్నారు.
జాతీయ వరి ఉత్పత్తిలో మూడోవంతు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన విత్తన రకాలు ఉండటం విశ్వవిద్యాలయం సాధించిన పరిశోధన ప్రగతికి లభించిన గౌరవమన్నారు. రాష్ట్రంలో పండించే వేరుశనగలో 95 శాతం వ్యవసాయ విశ్వవిద్యాలయం రూపొందించిన రకాలు ఉండగా.. రాష్ట్ర వ్యవసాయ స్థూల ఉత్పత్తిలో దీని వాటా 1.06 శాతంగా ఉండటం గర్వకారణమన్నారు.
ఆర్బీకేల పనితీరు భేష్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల పనితీరు అమోఘమని గవర్నర్ అభినందించారు. ఆర్బీకేలకు సాంకేతికంగా సహకారం అందిస్తూ గ్రామీణ స్థాయిలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరువ చేయడం అభినందనీయమన్నారు. యూనివర్సిటీ స్నాతకోత్సవాల సందర్భంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు గౌరవ డాక్టరేట్‌ను వర్సిటీ ప్రకటించింది.
2018–19, 2019–20 విద్యా సంవత్సరాల్లో వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ (వ్యవసాయం) పూర్తి చేసిన 1,544 మందికి, పీజీ పూర్తి చేసిన 328 మందికి, 91 మంది పీహెచ్‌డీ విద్యార్థులకు పట్టాలు అందజేశారు. డాక్టర్ వి.రామచంద్ర రావు జాతీయ అవార్డును ఐఆర్ డైరెక్టర్ డాక్టర్ ఏకే సింగ్, డాక్టర్ ఎన్‌వీ రెడ్డి జాతీయ అవార్డును రిటైర్డ్ శాస్త్రవేత్త డాక్టర్ ఆలపాటి సత్యనారాయణకు అందజేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా, వైస్ చాన్సలర్ డాక్టర్ ఏ.విష్ణువర్ధన్‌రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ టి.గిరిధర్‌కృష్ణ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment