ఏఎన్‌యూ నియూమకాల్లో అంతులేని జాప్యం | ANU niyumakallo endless delay | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూ నియూమకాల్లో అంతులేని జాప్యం

Published Sun, Nov 16 2014 1:23 AM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

ANU niyumakallo endless delay

 ఏఎన్‌యూ: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో రెగ్యులర్ అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల నియామకాల్లో అంతులేని జాప్యం జరుగుతోంది. ప్రభుత్వం నుంచి అనుమతి లభించినప్పటికీ నోటిఫికేషన్ కోసం ఆశావహులు సంవత్సరాల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు ఇటీవల నోటిఫికేషన్ జారీ చేయటంతో అధిక సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. మిగతా ప్రక్రియ ఎపుడు పూర్తవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అరుుతే తాజా పరిణామాలు వారికి ఆందోళన కలిగిస్తున్నాయి.

 సర్వీస్‌పై నూటా అల్టిమేటం..
     సర్వీస్ నిబంధనలపై ఏఎన్‌యూ అధ్యాపక సంఘం(నూటా) తాజాగా ఉన్నతాధికారులకు అల్టిమేటం జారీ చేసింది. ప్రస్తుతం ఏఎన్‌యూ, వివిధ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న చాలామంది అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేశారు. వీరిలో ఎక్కువమంది 2006వ సంవత్సరం తరువాత రెగ్యులర్ అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా నియమితులైనవారే. ఈ సర్వీసు ప్రకారం అయితే అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు అర్హత ఉండదు.

దీంతో రెగ్యులర్ నియామకాలకు ముందు తాము చాలా ఏళ్లు ఇదే యూనివర్సిటీలో టీచింగ్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహించామని, ఆ సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నోటిఫికేషన్ వెలవడక ముందు కూడా నూటా నేతలు ఉన్నతాధికారుల వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు సమాచారం.

వర్సిటీని నమ్ముకుని దశాబ్దాలుగా ఇక్కడే విధులు నిర్వహిస్తున్నామని, ఇప్పుడు తమను కాకుండా  కొత్తవారిని ఎలా నియమిస్తారని కూడా వారు ఉన్నతాధికారులను ప్రశ్నించారు. ఈ సమస్యను పరిష్కరించకుండా నియూమకాలు జరపటానికి వీల్లేదని స్పష్టం చేసినట్టు సమాచారం.

     నియామకాల్లో వికలాంగులకు న్యాయం చేయకపోతే న్యాయపోరాటానికి సిద్ధమని ఏఎన్‌యూ డిఫరెంట్లీ ఏబుల్ట్ యూనియన్ నాయకులు ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు.

     ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఎప్పటినుంచో ఉన్న ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టును భర్తీ చేయకుండా రెగ్యులర్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవటంపై ఎస్టీ విద్యార్థి సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై న్యాయపోరాటం చేస్తామని ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. దీంతో ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్ విభాగంలో ఎస్టీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న విద్యార్హతలు సక్రమంగా లేవంటూ ఆ విద్యార్థి సంఘం ఆందోళనకు సిద్ధమవుతోంది.

 పోటీ తీవ్రం.. ఫిర్యాదులకు సిద్ధం
 కొత్త రాష్ట్రం ఏర్పాటయ్యూక తొలిసారిగా ఏఎన్‌యూ అధ్యాపక నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేయటంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందినవారు పోటీ పడుతున్నారు. నియామక ప్రక్రియలో చోటు చేసుకుంటున్న లోపాలపై రాష్ట్ర గవర్నర్, ప్రభుత్వ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేందుకు కొందరు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

నియామకాల్లో వర్సిటీకి ఉన్న నిర్ణయాధికారాన్ని సాకుగా చూపుతూ నోటిఫికేషన్ ప్రకటించిన పది రోజుల తర్వాత ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలను నిర్ణయించటం, డిజాస్టర్ మెంటిగేషన్ సెంటర్ పోస్టుకు ఎంఏ పొలిటికల్ సైన్స్‌ను విద్యార్హతగా నిర్ణయించటం, అన్ని యూనివర్సిటీలకంటే భిన్నంగా ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్ పోస్టుకు ఎంఏ ఎకనామిక్స్ అర్హత తీసివేయటం, ఈ ఏడాది మే నెలలో ప్రకటించిన బ్యాక్‌లాగ్ నోటిఫికేషన్‌లో ఎంఏ రూరల్ డెవలప్‌మెంట్‌లో ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టును చేర్చకుండా ఇటీవల విడిగా నోటిఫికేషన్ విడుదల చేయటం, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుకు నోటిఫికేషన్ జారీ చేసి వర్సిటీ వెబ్‌సైట్‌లో కొన్నిరోజులు ఎస్సీ పోస్టుగా పేర్కొని తర్వాత సవరించటం వంటి అంశాలపై ఫిర్యాదు చేయనున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో పోస్టుల భర్తీ ప్రక్రియ సజావుగా జరుగుతుందా అన్న సందేహం సర్వత్రా వ్యక్తం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement