-‘సాక్షి’ వార్తతో కదిలిన యంత్రాంగం
-నేటి నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు నిలిపివేత
-తక్షణమే జరపాలంటూ టీచర్ల డిమాండ్
-వర్శిటీ టీచర్ల అసోసియేషన్ అత్యవసర భేటీ
హైదరాబాద్
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకు బ్రేక్ పడింది. బుధవారం నుంచి రెండు రోజుల పాటు జరగాల్సిన ప్రమోషన్ల ఇంటర్వ్యూలను వాయిదా వేయగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని యూనివర్శిటీ టీచర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. 'అగ్రీవర్శిటీలో హడావిడి ప్రమోషన్ల' శీర్షికన ఈనెల 23న ‘సాక్షి దినపత్రిక’లో వచ్చిన కథనానికి స్పందనగా యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పద్మరాజు ఇంటర్వ్యూలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
వచ్చే నెల 13న పదవీ విరమణ చేయనున్న వైస్ ఛాన్సలర్ ఇంత హడావిడిగా 18 మంది ప్రొఫెసర్లు, ఏడుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, 70 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల ప్రమోషన్లకు ఇంటర్వ్యూ తేదీలు ఖరారు చేయడాన్ని పలువురు తప్పుబట్టిన నేపథ్యంలో డాక్టర్ పద్మరాజు వాటిని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సోమవారం ప్రకటించారు. 2014 జనవరి నుంచి ప్రతి ఆరు నెలలకోసారి ఉపాధ్యాయులకు జరపాల్సిన మెరిట్ ప్రమోషన్లు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే చేపట్టాలని అసోసియేషన్ యూనివర్శిటీ పాలకవర్గానికి విజ్ఞప్తి చేసింది.