
మహాసంకల్పం.. సర్వం సిద్ధం
- నేడు ఏఎన్‌యూ ఎదుట టీడీపీ ప్రభుత్వ సభ
- సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభం
- భారీ వేదిక సహా అన్ని ఏర్పాట్లు పూర్తి
- రెండు లక్షల మంది కూర్చునేలా కుర్చీల ఏర్పాటు
- సభాస్థలిలో ఎల్‌ఈడీ స్క్రీన్లు.. నిఘా కెమెరాలు
సాక్షి, గుంటూరు : తెలుగుదేశంపార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సోమవారం ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ‘మహాసంకల్పం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం సభను నిర్వహించనుంది. ఈ సభకు అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన ప్రాంతంలోనే ఈ సభ నిర్వహించనుండటం విశేషం. మహా సంకల్పం సభను సీఎం ప్రమాణస్వీకారోత్సవానికి మించి అధిక ఖర్చుతో అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
దాదాపు 40 ఎకరాల సువిశాల స్థలంలో భారీ ప్రాంగణాన్ని నిర్మించారు. సుమారు రెండు లక్షల మంది కూర్చునేందుకు వీలుగా కుర్చీలను ఏర్పాటు చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు వేదికపై ఆశీనులయ్యేందుకు వీలుగా 76/58 సైజులో 250 మంది సామర్థ్యంతో భారీ వేదిక నిర్మించారు. ఎక్కడికక్కడ మెష్, బారికేడ్లు ఏర్పాటుచేసి తొక్కిసలాట జరగకుండా చర్యలు తీసుకున్నారు.
ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్‌లు..
మంత్రులకు ఏఏ పాస్‌లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఏ1, ఐఏఎస్, ఐపీఎస్‌లకు ఏ2 పాస్‌లను ఇస్తున్నారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నాయకులకు ఇచ్చేందుకు ఒక్కో ఎమ్మెల్యేకు 250 వీఐపీ పాస్‌ల చొప్పున అందించారు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో తెలిపేలా ముందుగానే వారికి కేటాయించిన సీట్లను సూచిస్తూ బోర్డులు ఉంచారు. సభాస్థలిలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు.
సాయంత్రం ఐదు గంటలకు సభ ప్రారంభం...
సభ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభం కానుండటంతో ప్రాంగణం మొత్తం ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వద్దకు చేరుకునేందుకు సీఎంకు ప్రత్యేక కాన్వాయ్‌ను ఏర్పాటు చేసి ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ ఏర్పాట్లను వారం రోజులుగా అడిషనల్ డీజీ సురేంద్రబాబు, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, నగరపాలక సంస్థ కమిషనర్ కె.కన్నబాబు, రేంజి ఐజీ ఎన్.సంజయ్, అర్బన్, రూరల్ ఎస్పీలు సర్వశ్రేష్ఠత్రిపాఠి, నారాయణనాయక్ పర్యవేక్షిస్తున్నారు.
భారీగా బందోబస్తు
మహా సంకల్ప సభకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు గుంటూరు రేంజ్ ఐజీ ఎన్.సంజయ్ తెలిపారు. సభా ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సభకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరు కానున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ మళ్లింపులు చేపడుతున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే వాహనాలను సైతం ఎటువైపు మళ్లించాలనే విషయంపై ఆ రాష్ట్ర డీజీపీ ద్వారా ఆయా జిల్లాల ఎస్పీలకు సమాచారం అందించామన్నారు.
సోమవారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆయా మార్గాల్లో సభకు వచ్చే వాహనాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. 2500 సూచిక బోర్డులు ఏర్పాటు చేసి, సమాచారం అందరికీ తెలిసేలా చేస్తున్నామన్నారు. మూడు హెలీప్యాడ్‌లు ఏర్పాటుచేసి సీఎం, కేంద్రమంత్రులకు ప్రత్యేక కాన్వాయ్‌లు ఏర్పాటు చేశామన్నారు. భద్రత కోసం 20 మంది ఎస్పీలు, 80 మంది డీఎస్పీలు, 7,800 మంది ఇతర పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు.
ట్రాఫిక్ మళ్లింపు ఇలా...
ఉదయం 7 గంటల నుంచి బహిరంగ సభ ముగిసేవరకు విజయవాడ నుంచి గుంటూరు వరకు గల ఎన్‌హెచ్-16 రహదారిని వన్‌వేగా మార్చారు. ఈ దారిగుండా సభకు వచ్చే వాహనాలను మాత్రమే అనుమతిస్తారు. సభ వద్ద పార్కింగ్ ప్రదేశాలను వివిధ కేటగిరీల్లో విభజించి వాటికి కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే పార్కింగ్ చేసేలా చర్యలు చేపట్టారు. దారి వెంట ఏర్పాటు చేసిన సూచిక బోర్డులను అనుసరించి వాహనాలను సరైన ప్రదేశాలకు చేరుకునేలా చూసుకోవాల్సి ఉంటుంది. విజయవాడ నుంచి వచ్చే వాహనాలకు కాజ టోల్‌గేట్ వద్ద కుడివైపున పార్కింగ్ ఏర్పాటు చేశారు. గుంటూరు వైపు నుంచి వచ్చే భారీ వాహనాలకు హైవేకు కుడివైపున డాంగేనగర్ వద్ద, ఇతర వాహనాలకు హైవేకు ఎడమవైపున పార్కింగ్ సౌకర్యం కల్పించారు.
ప్రత్యేక పార్కింగ్ స్థలాలు...
సభకు హాజరయ్యే ప్రజలు తమ వాహనాలను పార్కింగ్ చేసుకొనేందుకు విజయవాడ వైపు నుంచి వచ్చే వాహనాలను టోల్‌ప్లాజా వద్ద, గుంటూరు వైపు నుంచి వచ్చే వాహనాలను డాంగే నగర్, ఐజేఎంల వద్ద పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. పార్కింగ్ స్థలం నుంచి సభావేదిక వద్దకు ప్రజలను చేరవేసేందుకు షటిల్ సర్వీస్ పేరుతో 40 తుఫాన్ వాహనాలను సమకూరుస్తున్నారు. పోలీసు, రెవెన్యూ, ఇతర అధికారుల సమన్వయం కోసం 250 వాకీటాకీలను అందజేశారు.