సాగుకు 16,250 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ సమర్పించిన మంత్రి ప్రత్తిపాటి
* వ్యవసాయం, అనుబంధ రంగాలు
* ఒకే గొడుగు కిందకు తెస్తామని వెల్లడి
* ప్రణాళికా వ్యయం 7,691.90 కోట్లు
* ప్రణాళికేతర వ్యయం 8,558.68 కోట్లు
సాక్షి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయం, నీటికుంటల తవ్వకం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను గురువారం రాష్ట్ర శాసనసభకు సమర్పించారు.
రైతును రాజుగా చేసే క్రమంలో ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్ని ‘రైతుకోసం’ పేరిట ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్టు వెల్లడించారు. గతేడాదికంటే రూ.రెండు వేల కోట్ల పెంపుతో 2016-17 సంవత్సరానికి రూ.16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి చేసే ప్రణాళిక వ్యయం రూ.7,691.90 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం రూ.8,558.68 కోట్లుగా మంత్రి పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్‌లో వ్యవసాయానికి రూ.5,786.23 కోట్లను కేటాయించామన్నారు. ఇందులో 1,311.77 కోట్లు ప్రణాళికా వ్యయం, 4,474.46 కోట్లు ప్రణాళికేతర వ్యయమని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా 22 పేజీల ప్రసంగపాఠాన్ని చదివారు.
కరువు వల్ల దిగుబడులు తగ్గాయి..
2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగ మిషన్ 8.4 శాతం అభివృద్ధి సాధించినప్పటికీ పంటల దిగుబడులు తిరోగమనంలో సాగాయని మంత్రి చెప్పారు. తీవ్ర కరువు పరిస్థితులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట ఉత్పత్తులు తగ్గాయన్నారు. అయితే ఉద్యానవన, ఆక్వా, పశు సంవర్థక రంగాలు గణనీయమైన ప్రగతి సాధించాయన్నారు. 2016-17లో వ్యవసాయం పురోగమనంలో సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధించినట్టు వివరించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఎన్నో విజయాలు సాధించినట్టు చెబుతూ వాటిని ప్రస్తావించారు. రైతులకు 2015-16లో రూ.45,512 కోట్ల పంట రుణాలు, రూ.13,018 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, 95,299 మంది కౌలు రైతులకు రూ.218.81 కోట్ల పంట రుణాలను బ్యాంకులు అందజేశాయని తెలిపారు. గిర్, సాహివాల్ పశువుల రవాణా, బీమాకోసం ఒక్కో పశువుకు రూ.పదివేల సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఏపీని ఆక్వా హబ్‌గా తీర్చదిద్దనున్నట్టు తెలిపారు.
ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మకమైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రణాళిక కేటాయింపులేవీ ఈ బడ్జెట్‌లో లేవు. కేంద్రప్రభుత్వమిచ్చిన రూ.81.40 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ వరి పరిశోధన కేంద్రం శాఖ ఏర్పాటు కానున్నదని తెలిపారు. కాగా శాసనమండలిలో 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను మంత్రి పి.నారాయణ, వ్యవసా య బడ్జెట్‌ను కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు.