minister prathipati pulla rao
-
మంత్రి ప్రత్తిపాటి కంపెనీలో అగ్నిప్రమాదం
నాదెండ్ల (చిలకలూరిపేట): మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు చెందిన స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆయిల్ డివిజన్ సీడ్ గోడౌన్లో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 7 వేల డీలింట్ కాటన్ బేళ్లు అగ్నికి ఆహుతవగా, సుమారు రూ.3.5 కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. గుంటూరు జిల్లా గణపవరంలోని వేలూరు రోడ్డులో మంత్రి ప్రత్తిపాటికి శివస్వాతి టెక్స్టైల్స్, స్వాతి కాటన్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మిల్లులున్నాయి. ఆదివారం అర్ధరాత్రి సీడ్ గోడౌన్లో మంటలు వ్యాపించాయి. నైట్ వాచ్మెన్లు మేనేజ్మెంట్ సిబ్బందికి సమాచారం అందించారు. నాలుగు ఫైరింజన్లు మంటలను ఆర్పే ప్రయత్నం చేశాయి. అనంతరం మరో నాలుగు ఫైరింజన్లను రప్పించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఉదయం 7 గంటలకు మంత్రి మిల్లును పరిశీలించారు. -
‘అగ్రి’ చర్చ బుగ్గి
♦ లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి గాథను దారి మళ్లించిన సర్కార్ ♦ బాధితుల పక్షాన సభలో వాణి వినిపించిన వైఎస్ జగన్ ♦ అన్యాయాన్ని ఆధారాలతో సహా నిలదీసిన ప్రతిపక్షనేత ♦ మంత్రి ప్రత్తిపాటి కారుచౌకగా ‘అగ్రి’ భూముల కొనుగోళ్లపై కలకలం ♦ ఇరుకున పడ్డ అధికారపక్షం.. చర్చను దారి మళ్లించేందుకు అడ్డదారులు సాక్షి, అమరావతి: న్యాయం చేయండి మహాప్రభో అని లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు మొరపెట్టుకుంటున్నా.. నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నా.. కనికరించకపోవడమే కాదు కనీసం కన్నెత్తి చూడని చంద్రబాబు ప్రభుత్వం శాసనసభ వేదికగా ఆ అంశానికి మరోమారు పాతరేసే ప్రయత్నం చేసింది. 32 లక్షల కుటుంబాల్లోని 1.28 కోట్ల మందిని రోడ్డు పాలు చేసిన అగ్రిగోల్డ్ కుంభకోణంపై శాసనసభలో చర్చను అధికారపక్షం పక్కదారి పట్టించింది. బాధితుల పక్షాన ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధారాలతో సహా నిలదీస్తోంటే.. తమ బండారం బట్టబయలవుతుం దని అధికారపక్షం భయపడింది. స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అడుగడుగునా అడ్డు తగిలి ప్రతిపక్షం గొంతునొక్కారు. ఈ వ్యవహారంలో బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా పాలు పంచుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ నుంచి తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడాన్ని కప్పిపుచ్చు కునేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చర్చకు సంబంధం లేని రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెస్తే.. ఆర్థిక మంత్రి యనమల 40 రోజుల క్రితం స్పీకర్ కోడెల శివప్రసాదరావు విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడాన్ని ప్రస్తావనకు తెచ్చి చర్చను పక్కదోవ పట్టించారు. చర్చను దారిమళ్లించే క్రమంలో అధికారపక్షం అడుగ డుగునా కవ్వించినా వైఎస్ జగన్ సంయమనం పాటిస్తూ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన తన వాణిని విన్పించడానికి, వాస్తవాలను వివరించడానికే ప్రాధా న్యం ఇచ్చారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై చర్చ సందర్భంగా గురువారం శానసభలో చోటుచేసుకున్న వరుస నాటకీయ పరిణామాలను పరిశీలిస్తే.. అసెంబ్లీలో ‘అగ్రి’ భారతం...దారి మళ్లిన 18 పర్వాలివీ... సీన్–1: జీరో అవర్ తర్వాత అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబునాయుడు స్టేట్మెంట్ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే అంశంపై ప్రతి కేబినెట్ సమావేశంలోనూ చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. సీఐడీ ఇప్పటివరకూ ఏడుగురు డైరెక్టర్లను అరెస్టు చేసిందన్నారు. మరో 11 మంది డైరెక్టర్లను పట్టిస్తే ఒకొక్కరికి రూ.పది లక్షల చొప్పున బహుమానంగా ఇస్తామని చెప్పారు. కేసు హైకోర్టు విచారణలో ఉందని.. ఆ సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు. సీన్–2: సీఎం స్టేట్మెంట్ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.7300 కోట్లని సీఐడీ అంచనా వేయడాన్ని గుర్తు చేస్తూ.. కేవలం రూ.1,182 కోట్లు సర్కార్ ఇవ్వగలిగితే 13.83 లక్షల మంది డిపాజిటర్లకు పూర్తిగా న్యాయం చేయవచ్చునని వైఎస్ జగన్ వివరించా రు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని బాబుకు సూచించారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఆధారాలతో ఎండగట్టారు. ఆ సంస్థ చైర్మన్ అవ్వా సోదరుల్లో ఆరుగురిని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. దాంతో పాటు అవ్వా సోదరుల్లో ఒకరైన సీతారాం అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్న తీరును వివరించారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తక్కువ ధరలకే కొనుగోలు చేసిన అంశాన్ని ఎత్తి చూపారు. సీన్–3: ఇంతలోనే స్పీకర్.. జగన్ మైక్ కట్ చేసి ప్రత్తిపాటికి అవకాశం ఇచ్చారు. గత శాసనసభలో ప్రతిపక్ష నేత ఇదే అంశాన్ని ప్రస్తావించారని చెబు తూనే చర్చతో సంబంధం లేని, సభలో సభ్యుడే కాని కరణం ధర్మశ్రీ రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అవాస్తవమైన విమర్శలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తాను అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని.. నిరూపించక పోతే ప్రతిపక్ష నేత రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో ఈ వ్యవహారంపై సభా సంఘం వేయాలని కోరారు. సీన్–4: స్పీకర్ అవకాశం ఇవ్వడంతో జగన్ మాట్లాడు తూ ఉదయ్ దినకర్ అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్ ల్యాండ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని వివరించారు. ‘2014లో అగ్రిగోల్డ్‌పై కేసు నమోదైంది. భూము లు కొనకల్లు ఉదయ్ దినకర్ అమ్మారు.. ప్రత్తిపాటి కొనుగోలు చేశారు.. గత శాసనసభలోనే పూర్తి ఆధారాలు ఇచ్చాను. చర్యలు తీసుకోవడం తీసుకో కపోవడం సీఎం ఇష్టం... ఇదే అంశంపై మాట్లాడితే సభ పక్కదోవ పడుతోంది. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేసినట్లు అవుతుంది’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించే యత్నం చేశారు. సీన్–5: ఇంతలోనే విపక్ష నేతకు మైక్ కట్ చేసిన స్పీకర్.. మంత్రి అచ్చెన్నాయుడుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి పుల్లారావు విసిరిన సవాల్ స్వీకరిస్తున్నారో లేదో చెప్పాలని కోరుతూనే విపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు. సీన్–6: జగన్‌కు అవకాశం ఇస్తున్నట్లుగానే ఇచ్చి.. మళ్లీ మైక్ కట్‌చేసి పత్తిపాటికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఉదయ్ దినకర్ నుంచి భూములు కొనుగోలు చేసిన అంశాన్ని అంగీకరించిన పత్తిపాటి.. వాటికి అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో జగన్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు. సీన్–7: జగన్‌కు మైక్ ఇస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. మంత్రి యనమలకు అవకాశం ఇచ్చారు. యన మల మాట్లాడుతూ.. ప్రత్తిపాటి విసిరిన సవాల్‌కు ప్రతిపక్ష నేత కట్టుబడుతున్నారో లేదో చెప్పిన తర్వాతే ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ప్రత్తిపాటి అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంపై సభా సంఘం వేయాల ని కోరారు. ప్రత్తిపాటి తప్పు చేసినట్లయితే ఆయనను సభ నుంచి బహిష్కరించాలని.. అవాస్తవమని తేలితే ప్రతిపక్ష నేతను సభ నుంచి వెలివేయాలని డిమాండ్ చేశారు. సీన్–8: స్పీకర్ మైక్ ఇవ్వడంతో జగన్ మాట్లాడుతూ ‘ఉదయ్ దినకర్ అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్ ల్యాండ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సీఈవోగానూ వ్యవహరిస్తున్నారు. చర్యలు తీసుకోవడం తీసుకోక పోవడం సీఎం ఇష్టం.. మంత్రి ప్రత్తిపాటి ఇష్టం. అగ్రిగోల్డ్ భూములను వేలం వేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలి. హాయ్‌ల్యాండ్ భూములు.. విశాఖలో యారాడ భూములు ఎందుకు వేలం వేయడం లేదు’ అంటూ ప్రశ్నించారు. సీన్–9: ఇంతలోనే జగన్ మైక్ కట్ చేసిన స్పీకర్.. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడు తూ ప్రత్తిపాటి సవాల్‌ను విపక్ష నేత కచ్చితంగా స్వీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో చర్చతో సంబంధం లేని కరణం ధర్మశ్రీ రుణ మాఫీ వ్యవహారాన్ని ప్రస్తావించారు. సీన్–10: జగన్‌కు మైక్ ఇస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. మరోసారి యనమలకు అవ కాశం ఇచ్చారు. ప్రత్తిపాటి సవాల్‌ను స్వీక రిస్తున్నారో లేదో తేల్చిన తర్వాతే విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు. సీన్–11: జగన్ మాట్లాడుతూ ‘సభా సంఘం వేస్తే ఏమవుతుంది.. ప్రివిలేజ్ కమిటీలో ఏం జరిగిందో అదే జరుగుతుంది.. ఏడుగురు సభ్యుల్లో ఆరుగురు అధికారపార్టీ వారే ఉంటారు. అప్పుడు వారు చెప్పిందే సభా సంఘం చేస్తుంది.. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి ఆదేశించండి’ అని కోరారు. సీన్–12: మళ్లీ జగన్ మైక్ కట్ చేసిన స్పీకర్.. అచ్చెన్నాయుడుకు మరో సారి మైక్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘సభా సంఘం వేయాలో.. జుడీషియల్ ఎంక్వైరీ వేయాలో సభ నిర్ణయిస్తుంది.. ప్రత్తిపాటి సవాల్‌ను స్వీకరిస్తున్నా రో లేదో విపక్ష నేత చెప్పాలి.. లేదంటే జగన్‌ను బహిష్కరించండి’ అని స్పీకర్‌ను డిమాండ్ చేశారు. సీన్–13: జగన్‌కు మైక్ ఇస్తున్నట్లుగా ప్రకటించిన స్పీకర్.. వెంటనే చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులకు అవకాశం ఇచ్చారు. అంతకు ముందే సీఎంతో మంతనాలు సాగించిన కాలవ.. జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆ క్రమంలోనే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ముందు విలేకరు ల సమావేశంలో స్పీకర్ వెల్లడించిన అంశాలను ‘సాక్షి’ టీవీ, పత్రిక వక్రీకరించాయని వాటిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అనిత కూడా ఇదే అంశాన్ని ప్రస్తా వించారు. స్పీకర్ విలేకరుల వద్ద వెల్లడించిన వివరాలను శాసనసభలో ప్రదర్శించాలని కోరారు. సీన్–14: మరోసారి జగన్‌కు మైక్ ఇస్తున్నట్లుగా ప్రకటించిన స్పీకర్ కోడెల.. సీఎం చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. దాంతో విపక్ష సభ్యులు పోడి యం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశా రు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని నినాదాలు హోరెత్తించారు. నినాదాల మధ్యే బాబు మాట్లాడుతూ.. ప్రత్తిపాటి విసిరిన సవాల్‌ను ప్రతిపక్ష నేత స్వీకరిస్తారో లేదో చెప్పాలని డిమాం డ్ చేశారు. తప్పని తేలితే ప్రత్తిపాటిని సభ నుంచి వెలేస్తామని.. అవాస్తమని తేలితే వైఎస్ జగన్ రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా రా చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తేల్చి చెబితే విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వంపై ‘సాక్షి’ పత్రిక, టీవీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని.. జాతీయ మహిళా పార్లమెంట్‌కు ముందు స్పీకర్ కోడెల విలేకరుల వద్ద చెప్పిన అంశాలను వక్రీకరించింద ని.. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. సీన్–15: స్పీకర్ జోక్యం చేసుకుంటూ మంత్రి సవాల్‌కు స్వీకరిస్తున్నారో లేదో తేల్చిచెప్పిన తర్వాతే మాట్లాడాలని జగన్‌కు సూచించారు. జగన్‌కు అవకాశం ఇస్తున్నట్లుగా ఇచ్చి ఆ తర్వాత మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. కామినేని మాట్లాడుతూ జాతీయ మహిళా పార్ల మెంట్ సదస్సుకు ముందు స్పీకర్ విలేకరుల వద్ద వెల్లడించిన అంశాలను ‘సాక్షి’ టీవీ, పత్రికలు వక్రీకరించాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ మాట్లాడుతూ సభ వాయిదా వేద్దామని.. సభ ప్రారంభమయ్యాక తాను విలేకరుల వద్ద వెల్లడించిన అంశాల వీడియోను ప్రదర్శిస్తామని చెప్పారు. సీన్–16: 10 నిమిషాల తర్వాత సభ ప్రారంభమైంది. స్పీకర్ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై చర్చించకపోవడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు ఈ సభకో నమస్కారం అంటూ వెలుపలికి వచ్చేశారు. వీడియో ప్రదర్శన ముగిసిన తర్వాత స్పీకర్ మాట్లాడుతూ.. ‘జరిగింది ఇది.. చర్యలు తీసుకునే నిర్ణయం సభదే’ అన్నారు. సీన్–17: ఆ తర్వాత మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, గౌతు శ్యామసుంద ర శివాజీ, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక, టీవీలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. సీన్–18: ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ఉన్నప్పుడు మరోసారి ఇదే వీడియోను ప్రదర్శించాలని స్పీకర్‌కు సూచించారు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ కుంభకోణంపై మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఇదీ.. పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు. ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయ కులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోప ణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఏడాదిన్నర నుంచి మొరపె ట్టుకుంటున్నా, ఆందోళనలు చేస్తున్నా, చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించడంలేదు. -
కోట్ల విలువైన భూములిచ్చాం.. అన్యాయం చేయొద్దు!
► సర్కారుకు రైతుల మొర ► మంత్రి ముంగిట మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతుల ఆవేదన ► ప్లాట్ల కేటాయింపులో లోపాలపై అభ్యంతరాలు సాక్షి, విజయవాడ బ్యూరో : కోట్ల విలువైన భూములిచ్చిన తమకు అన్యాయం చేయొద్దంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. గురువారం విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతుల సమావేశంలో సర్కారు తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, సీఆర్డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ సమక్షంలో వారు పలు అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న లోపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవి వారి మాటల్లోనే.. ప్రభుత్వానికో రూలు.. మాకో రూలా రాజధాని కోసం భూములు త్యాగాలు చేసిన రైతులకు ఒక రూలు, ప్రభుత్వానికి అనుకూలంగా మరో రూలు అమలు చేయడం సరికాదు. కమర్షియల్ ప్లాట్లలో ప్రభుత్వం 18 అంతస్తులు నిర్మించుకునే అవకాశం పెట్టుకుని, అదే రైతులకైతే 11 అంతస్తుల వరకే అనుమతించడం దారుణం. రాజధాని అంతటా ప్రభుత్వానికి, రైతులకు ఒకే తరహా పాలసీ ఉండాలి. భూములు ఇచ్చిన రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి వాటి ద్వారా బ్యాంకుల్లో ఎకరాకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. కేటాయించే ప్లాట్లలో నిర్మించే ఇంటి ప్లాన్ ఫీజును మినహాయించాలి. - శివరామకృష్ణయ్య, మందడం రైతు వాస్తు ప్రకారమే ఇవ్వాలి... రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చే ప్లాట్లు నార్త్ ఈస్ట్ వాస్తు ప్రకారం కేటాయించాలి. రాజధాని నిర్మాణమే వాస్తు ప్రకారం చేపట్టినప్పుడు భూములు ఇచ్చిన రైతులకు వాస్తు ప్రకారం ప్లాట్లు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టే. అవసరమైతే రైతులు వారిలో వారు తమ ప్లాట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలి. ఏ రెవెన్యూ గ్రామంలోని రైతులకు ఆ గ్రామంలోనే ప్లాట్లు కేటాయించాలనే నిబంధన కచ్చితంగా పాటించాలి. - రవీంద్రబాబు, రైతు ఆరోగ్య సేవల్లో దీర్ఘకాలిక రోగాలకు మందులివ్వాలి భూములిచ్చిన రైతులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించాలి. శస్త్రచికిత్సలే కాకుండా దీర్ఘకాలిక రోగాలకు మందులను అందించేలా వైద్య సేవల్లో నిబంధనలు సడలించాలి. ప్లాట్లలో నిర్మాణాల విషయంలో ప్రభుత్వానికి ఒకలా, రైతులకు మరోలా నిబంధనలు ఉండటం సరికాదు. - రమేష్, కృష్ణాయపాలెం సకాలంలో ప్లాట్లు కేటాయిస్తారా రాజధాని ప్రాంతంలో అందరికీ ప్లాట్లు సకాలంలో కేటాయిస్తారా అనే అనుమానం కలుగుతోంది. భూములివ్వని రైతులు కోర్టుకు వెళ్లారు. వాటి విషయం తేలేవరకు ప్రభుత్వం వేచిచూస్తే భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం కలుగుతుంది. అలా కాకుండా భూములిచ్చిన రైతులకు వీలైనంత త్వరగా ప్లాట్లు కేటాయించాలి. మా ప్రాంతంలో 200 మీటర్ల రోడ్డు వేయకుండా ఆపేశారు. దాన్ని పూర్తి చేయాలి. - శ్రీధర్, పెనుమాక రైతు ఫారెస్ట్, అసైన్డ్ భూములపై స్పష్టత లేదు ఫారెస్ట్, అసైన్డ్ భూముల విషయంలో స్పష్టత లేదు. తుళ్లూరు మండలంలో ఫారెస్టు భూములకు క్లియరెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్‌కు సహకరిస్తున్నారు. మా గ్రామంలో భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. తుళ్లూరుపై ఉన్న శ్రద్ధ, మా ప్రాంతంపై ఎందుకు లేదు? - సురేంద్రబాబు, నీరుకొండ రైతు ఎస్సీల భూములకు చెక్కులు ఇవ్వలేదు రాజధాని ప్రాంతంలో ఎస్సీల భూములకు కౌలు చెక్కులు ఇంతవరకు ఇవ్వలేదు. తక్షణం కౌలు చెక్కులు ఇవ్వాలి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులకు సీఆర్డీఏ అధికారులు చెప్పడం లేదు. మాకు కూడా వివరాలు అందించాలి. దీనివల్ల ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో సీఆర్డీఏ అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లాలి. - పి.రత్నకుమారి, మంగళగిరి ఎంపీపీ రైతుల సూచనలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం సీఆర్డీఏ నిర్వహించిన సమావేశంలో రైతులు ప్రస్తావించిన ప్రతి సమస్యనూ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సీఆర్డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ హామీ ఇచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులకు రాజధానిలో రోడ్డు, ప్లాట్లు, జోనింగ్ నిబంధనలు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఉచిత విద్య, వైద్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ల్యాండ్ పూలింగ్ అమలైన నాటి నుంచి దీన్ని వర్తింపజేసి రీయింబర్స్మెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. నేలపాడును నమూనాగా తీసుకుని ప్లాట్ల విభజన చేపట్టామని, ఇలాగే అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేస్తామని శ్రీధర్ చెప్పారు. ప్రతి గ్రామానికీ డ్రాఫ్ట్ లేఅవుట్ ఇచ్చి దానిపై 30 రోజుల్లో రైతుల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక లేఅవుట్ ప్లాన్‌ను ఫైనల్ చేస్తామని చెప్పారు. ప్లాట్ల విషయంలో 9.18 పత్రాలను రైతులు ఇవ్వాల్సి ఉంటుందని, ప్లాట్లు ఎలా కావాలనే దానిపై ఆ అంగీకార పత్రంలో తెలపాల్సి ఉంటుందని వివరించారు. ఇద్దరు, ముగ్గురు, ఎంతమందైనా కలిసి ఒకేచోట ప్లాట్లు తీసుకోవచ్చని, వాటిని అమ్ముకోవచ్చని అన్నారు. లేఅవుట్లో రైతులకు కేటాయించిన నిర్దిష్ట కొలతలతో కూడిన ప్లాట్లు కాకుండా మిగిలిన ప్లాట్లను వేలం వేసి ఆ మొత్తాన్ని రైతులకు పంచనున్నట్లు చెప్పారు. లేఅవుట్లలో మొదటి ఏడాది 50 నుంచి 80 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు, రానున్న మూడేళ్లలో తారు రోడ్లు వేసి అభివృద్ధి చేస్తామన్నారు. లేఅవుట్లను నార్త్ ఈస్ట్ ప్రకారం పక్కా వాస్తుతో వేస్తావని, కొన్ని సౌత్‌కు కూడా ఉంటాయని చెప్పారు. ఎకనామిక్స్ యాక్టివిటీ కోసమే కమర్షియల్ ప్లాట్లలో ప్రభుత్వం 18 అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చని, రైతులు 11 అంతస్తుల వరకే నిర్మించుకోవాలనే నిబంధన పెట్టడం జరిగిందని వివరించారు. -
సాగుకు 16,250 కోట్లు
వ్యవసాయ బడ్జెట్ సమర్పించిన మంత్రి ప్రత్తిపాటి * వ్యవసాయం, అనుబంధ రంగాలు * ఒకే గొడుగు కిందకు తెస్తామని వెల్లడి * ప్రణాళికా వ్యయం 7,691.90 కోట్లు * ప్రణాళికేతర వ్యయం 8,558.68 కోట్లు సాక్షి, హైదరాబాద్: సేంద్రియ వ్యవసాయం, నీటికుంటల తవ్వకం, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ఏర్పాటు లక్ష్యంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వచ్చే ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ బడ్జెట్‌ను గురువారం రాష్ట్ర శాసనసభకు సమర్పించారు. రైతును రాజుగా చేసే క్రమంలో ముచ్చటగా మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం తనకు లభించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్ని ‘రైతుకోసం’ పేరిట ఒకే గొడుగు కిందకు తీసుకురానున్నట్టు వెల్లడించారు. గతేడాదికంటే రూ.రెండు వేల కోట్ల పెంపుతో 2016-17 సంవత్సరానికి రూ.16,250.58 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ఇందులో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కలిపి చేసే ప్రణాళిక వ్యయం రూ.7,691.90 కోట్లు కాగా.. ప్రణాళికేతర వ్యయం రూ.8,558.68 కోట్లుగా మంత్రి పేర్కొన్నారు. మొత్తం బడ్జెట్లో వ్యవసాయానికి రూ.5,786.23 కోట్లను కేటాయించామన్నారు. ఇందులో 1,311.77 కోట్లు ప్రణాళికా వ్యయం, 4,474.46 కోట్లు ప్రణాళికేతర వ్యయమని మంత్రి వివరించారు. ఈ సందర్భంగా 22 పేజీల ప్రసంగపాఠాన్ని చదివారు. కరువు వల్ల దిగుబడులు తగ్గాయి.. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ప్రాథమిక రంగ మిషన్ 8.4 శాతం అభివృద్ధి సాధించినప్పటికీ పంటల దిగుబడులు తిరోగమనంలో సాగాయని మంత్రి చెప్పారు. తీవ్ర కరువు పరిస్థితులతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పంట ఉత్పత్తులు తగ్గాయన్నారు. అయితే ఉద్యానవన, ఆక్వా, పశు సంవర్థక రంగాలు గణనీయమైన ప్రగతి సాధించాయన్నారు. 2016-17లో వ్యవసాయం పురోగమనంలో సాగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. పప్పుధాన్యాల ఉత్పత్తిలో గణనీయమైన పెరుగుదల సాధించినట్టు వివరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగంలో ఎన్నో విజయాలు సాధించినట్టు చెబుతూ వాటిని ప్రస్తావించారు. రైతులకు 2015-16లో రూ.45,512 కోట్ల పంట రుణాలు, రూ.13,018 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, 95,299 మంది కౌలు రైతులకు రూ.218.81 కోట్ల పంట రుణాలను బ్యాంకులు అందజేశాయని తెలిపారు. గిర్, సాహివాల్ పశువుల రవాణా, బీమాకోసం ఒక్కో పశువుకు రూ.పదివేల సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ఏపీని ఆక్వా హబ్‌గా తీర్చదిద్దనున్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రతిష్టాత్మకమైన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ప్రణాళిక కేటాయింపులేవీ ఈ బడ్జెట్లో లేవు. కేంద్రప్రభుత్వమిచ్చిన రూ.81.40 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టినట్టు మంత్రి వివరించారు. శ్రీకాకుళం జిల్లాలో జాతీయ వరి పరిశోధన కేంద్రం శాఖ ఏర్పాటు కానున్నదని తెలిపారు. కాగా శాసనమండలిలో 2016-17 ఆర్థిక సంవత్సర వార్షిక బడ్జెట్‌ను మంత్రి పి.నారాయణ, వ్యవసా య బడ్జెట్‌ను కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టారు. -
ప్రత్తిపాటి, ఆలపాటి క్షమాపణ చెప్పాలి
ఏపీ కాపునాడు మండిపాటు సాక్షి, హైదరాబాద్: తమపై అనుచిత వ్యాఖ్యలను అనుమతించినందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే ఆలపాటి రాజాలు క్షమాపణ చెప్పాలని ఏపీ కాపునాడు డిమాండ్ చేసింది. ఎవరి కులాన్ని వారు కీర్తించుకోవడంలో తప్పు లేదని, ఇతరులపై విద్వేషం వెళ్లగక్కడమే ఆక్షేపణనీయమని పేర్కొంది. గుంటూరు జిల్లాలో ఇటీవల పరిటాల రవి, ఎన్టీఆర్ వర్థంతి సభకు ప్రత్తిపాటి పుల్లారావు, ఆలపాటి రాజా ముఖ్య అతిథులుగా హాజరయ్యారని, వారి సమక్షంలో కాపులను కించపరిచేలా ఓ వక్త అనుచిత వ్యాఖ్యలు చేశారని వివరించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఈ వీడియో తమ జాతిని అవమానించేలా ఉందని కాపునాడు రాష్ట్ర నేతలు కె.అప్పారావు, ఆర్.చైతన్య, గడ్డం కోటేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పవన్ సూచనలను పాటిస్తాం
మున్సిపల్ మంత్రి నారాయణ సాక్షి, గుంటూరు : పవన్ కళ్యాణ్ సూచనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూములు సమీకరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. బుధవారం రాత్రి జీజీహెచ్‌లో విలేకరులతో మాట్లాడుతూ రైతుల్లో గ్రామ కంఠాలపై ఉన్న అభ్యంతరాలను తీరుస్తూ ముందుకు సాగుతామన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శనివారం సాయంత్రానికి 99 శాతం గ్రామ కంఠాలపై అనుమానాలను పూర్తిగా తీరుస్తామని, చిన్నచిన్నవి ఏమైనా ఉంటే సోమవారం పూర్తి చేస్తామన్నారు. మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రైతులు 9.5 గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గతంలో 9.5ను నెట్లో పెట్టారని, ప్రస్తుతం నెట్లో నుంచి తొలగించామని చెప్పారు. గ్రామ కంఠాలు ప్రకటించిన తీరు అస్తవ్యస్తంగా ఉన్నందున రైతుల్లో గందరగోళం నెలకొందని అన్నారు.జీజీహెచ్‌లో జరిగిన ఘటన కలిచి వేసిందని, ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత మృత శిశువు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో ప్రకటిస్తామన్నారు. -
'పవన్ ను ఒప్పించే భూసేకరణ'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రాంత రైతులను, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఒప్పించి రాజధానికి భూసేకరణ చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. పవన్ తో మాకు ఎటువంటి విభేదాలు లేవని ఆయన పేర్కొన్నారు. తుళ్లురు నుంచి భూ సేకరణ మొదలు పెడతామని వెల్లడించారు. భూ సేకరణ నోటిఫికేషన్ వచ్చిన 24 గంటల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భూ సేకరణ ద్వారా సుమారు మూడు వేల ఎకరాలు సేకరిస్తామని.. పవన్ కల్యాణ్ కు ప్రస్తుత వాస్తవ పరిస్థితులను వివరిస్తామని మంత్రి ప్రత్తిపాటి వివరించారు. -
టీడీపీ ఎమ్మెల్యేల తరపున రెండు బదిలీలు
టీచర్ల బదిలీల్లో అలా చేస్తే మాకు ఇబ్బందులుండవు: మంత్రి ప్రత్తిపాటి గుంటూరు ఎడ్యుకేషన్ : ప్రజా ప్రతినిధులుగా తమ రాజకీయ అనుచరులు, అయిన వారికి పనులు చేసి పెట్టాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. రాష్ట్రంలోని ఒక్కో టీడీపీ ఎమ్మెల్యే తరపున ఇద్దరేసి ఉపాధ్యాయులను బదిలీ చేస్తే మంత్రిగా తమకు రాజకీయపరమైన ఇబ్బందులుండవని పేర్కొన్నారు. అలా కాకపోతే తాము కోరిన పనులు చేయడంలేదని ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. గుంటూరులో ఏఎస్ రామకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం టెన్త్ ఫలితాల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులకు జరిగిన సన్మాన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ఈ విషయాలన్నింటినీ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేయాలని కోరుతున్న ఉపాధ్యాయులే రాజకీయంగా ఒత్తిడి తెచ్చి అక్రమ పద్ధతుల్లో బదిలీలు అడుగుతున్నారని మంత్రి తెలిపారు. సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన టీచర్లు బదిలీల కోసం పక్క దారి పట్టవద్దని ఆయన సూచించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ డాక్టర్ ఏఎస్ రామకృష్ణ, జెడ్పీ చైర్పర్సన్ షేక్ జానీమూన్, మాజీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, డీఈవో కె.వి.శ్రీనివాసులురెడ్డి, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు. -
ఏపీ మంత్రి గారు చాలా బిజీ..!
గుంటూరు : అనంతపురం జిల్లా యువరైతు కోదండరామిరెడ్డి (29) ఆత్మహత్య ఘటనపై స్పందించడానికి ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిరాకరించారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఆయన నివాసం వద్ద మంత్రి స్పందన కోసం 'సాక్షి' మీడియా ప్రతినిధి రెండు గంటలకు పైగా వేసి చూసినా ముఖం చాటేశారు. మంత్రి ప్రత్తిపాటి నివాసం వద్ద చాలా సమయం ఎదురుచూసిన తర్వాత మంత్రి బిజీగా ఉన్నారంటూ చెప్పిన ఆయన పీఏ, గన్‌మన్ లు సాక్షి' ప్రతినిధిని పంపించేశారు. బ్యాంకు మేనేజర్ ఒత్తిళ్లు భరించలేక ఉరవకొండ సిండికేట్ బ్యాంకులో రైతు కోదండరామిరెడ్డి పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం విదితమే. ఉద్యోగం రాక చివరకు వ్యవసాయమే జీవనాధారంగా బతకాలని ఆశించిన ఆ యువరైతు చదివింది ఎంబీఏ కావడం గమనార్హం. -
‘ఆక్వా’ అభివృద్ధికి ప్రత్యేక ఫిషరీస్ పాలసీ
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడి సాక్షి, విజయవాడ: ఆక్వాతోపాటు అనుబంధ రంగాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఇందులో భాగంగా ప్రత్యేక ఫిషరీస్ పాలసీని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో నిర్వహించిన ‘భారత్‌లో ఆక్వా హబ్‌గా ఆంధ్రప్రదేశ్’ సదస్సులో మంత్రి మాట్లాడారు. మత్స్యశాఖ ఉత్పత్తులను రూ.23 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్లకు పెంచేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. మత్స్యశాఖ అభివృద్ధికి రూ.187 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిషరీస్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పుల్లారావు ప్రకటించారు. భీమవరం సమీపంలోని తుందుర్రులో రూ.300 కోట్లతో ఏర్పాటు చేసే ఈ యూనివర్సిటీతో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలకు మరింత ప్రయోజనం కలుగుతుందని వివరించారు. -
వెలవెలబోయిన చెక్కుల పంపిణీ కార్యక్రమం
కంగుతిన్న వ్యవసాయ మంత్రి తాడేపల్లి రూరల్ : మండలంలోని పెనుమాక గ్రామంలో గురువారం సీఆర్డీఏ అధికారులు నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం వెలవెలబోయింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆహ్వానించారు. గ్రామ సర్పంచ్ నివాసంలో భారీ స్థాయిలో టెంట్లు వేసి, కుర్చీలు ఏర్పాటు చేసి, సభావేదికను సిద్ధం చేశారు. అమాత్యుల వారు వస్తున్నారంటూ అధికారులు హడావుడి చేశారు. మంత్రి రాక ఆలస్యం కావడంతో రైతులు ఎవరూ లేరు. దీంతో కంగుతిన్న అమాత్యులు స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించారు. అప్పటికీ రైతులు రాకపోవడంతో సభా వేదిక వద్ద వద్దులే.. సర్పంచ్ ఇంటి వద్దే చెక్కులు పంపిణీ చేద్దామని మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60కి పైగా చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి 12 చెక్కులు పంపిణీ చేసి, ప్రభుత్వం గురించి పొగడ్తల వర్షం కురిపించి, మిగిలినవారు రాకపోవడంతో అక్కడ నుంచి నిష్ర్కమించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భూసమీకరణకే రైతులు మొగ్గుచూపుతున్నారని, అందుకే సేకరణ వాయిదా వేశామన్నారు. రుణమాఫీలకు కట్టుబడి ఉన్నామని చెబుతుండగా, ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడు తనకు రుణమాఫీ జరగలేదంటూ మంత్రిని నిలదీశాడు. స్థానిక నాయకులు ఎంతగా వారించినా వినకపోగా, తనకు ఎందుకు రుణమాఫీ జరగదంటూ ప్రశ్నించాడు. దీంతో కంగుతిన్న నాయకులు మంత్రితో బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేయించి మాట్లాడించి అతడిని శాంతింపజేశారు. -
అంతన్నారు..ఇంతన్నారు..
► అమరావతి రాజధాని ప్రాంతంలోని 23 వేల మంది రైతులకు ఒకేసారి లక్షన్నర రూపాయల రుణమాఫీ.. అది కూడా 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మార్చి తిరిగి హైదరాబాద్ వెళతా.. ఇది రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గురువారం చేసిన బహిరంగ ప్రకటన. ఇది ఆచరణ సాధ్యం కాలేదు. ► మంగళవారానికల్లా దాదాపు 7500 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ మొత్తం జమ చేస్తాం.. రాష్ర్ట మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ మాటలు. ఇది పాతపాటేనంటున్న రాజధాని రైతులు. తాడికొండ : మంత్రులు, అధికారుల ప్రకటనలు రాజధాని రైతులను రుణమాఫీ విషయంలో అయోమయానికి గురిచేస్తున్నాయి. చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు పొంతన లేకపోవడంతో ఎవరి మాటలు నమ్మాలో అర్ధంకాని స్థితి నెలకొంది. 7500 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేసినట్లు నెల రోజుల క్రితమే ప్రకటించిన మంత్రి మళ్లీ అదే ప్రకటనను చేయడం విడ్డూరం. అంతేకాక నెలాఖరుకు రైతుల ఖాతాల్లో నూరుశాతం రుణమాఫీ నగదు జమ చేస్తామని ప్రకటించిన మంత్రుల మాటలపై రైతులకు అనుమానం కలుగుతోంది. రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 30 బ్యాంకుల పరిధిలో తిరిగి రుణమాఫీపై పరిశీలించారు. అయినా నేటికీ ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. దీంతో రైతులు మళ్లీ కౌలు డీడీలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. రైతులను భూ సమీకరణ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ విఫలమవుతోంది. కొద్దిరోజుల క్రితం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తుళ్లూరులో రాజధాని రైతులకు సింగిల్ టైం రూ.1.5 లక్షల రుణమాఫీ జరుగుతున్నట్లు ప్రకటించారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్యాంకర్లతో చర్చించామని నేడో రేపో బ్యాంకుల్లో ఆయా రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని చెప్పారు. కానీ మంత్రుల మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. రైతులు మాత్రం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికి కేవలం 7,500 మందికి రుణమాఫీ జమచేస్తే మిగతా 15,500 మంది రైతులకు ఎప్పటికి చేస్తారన్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. పూటకో ప్రకటనతో రైతుల్ని గందరగోళపర్చకుండా వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. -
గ్రామాల్లోని ప్రతి చెరువునూ బాగు చేస్తాం
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వలపర్ల(మార్టూరు): ప్రతి గ్రామంలో ఉన్న చెరువులను బాగు చేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో గురువారం జరిగిన ‘నీరు- చెట్టు’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. గతంలో రైతులు తన పొలాల్లో గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షం కురిసినప్పుడు, కాల్వలకు నీరు విడుదలైనపప్పుడు నిల్వ చేసుకొని అన్ని అవసరాలకూ ఉపయోగించుకునే వారన్నారు. అనంతరం శిధ్ధారాఘవరావు మాట్లాడుతూ చెట్లు పెంచటం, నీటిని నిల్వ చేసుకోవటం ద్వారా భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులుండవన్నారు. పర్యావరణాన్ని కాపాడవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్‌శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మొక్కలను పెంచటం అనేది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు: ప్రత్తిపాటికి రైతుల మొర రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన రైతులు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి మొరపెట్టుకున్నారు. బ్యాంకర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం డ్వాక్రా మహిళలకు రూ.56 లక్షల రుణాలను, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్‌ను అందించారు. మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇన్చార్జి కలెక్టర్ ఎం.హరిజవహరలాల్, అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాశ్‌కుమార్, డ్వామా పథక సంచాలకుడు ఎన్.పోలప్ప, జలవనరుల శాఖ సూపరెంటెండెంట్ శారద, డివిజినల్ ఫారెస్ట్ అధికారి చంద్రశేఖర్, డీఆర్డీఏ పీడీ మురళీ కృష్ణ, ఏపీఎంఐపీ పథక సంచాలకుడు బాపిరెడ్డి, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు సి.రాజేంద్రకృష్ణ, ఆర్డీవో కె, శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి బూరగ వీరయ్య, ఎంపీపీ తాళ్లూరి మరియమ్మ, తహశీల్దార్ సుధాకర్ మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.