► అమరావతి రాజధాని ప్రాంతంలోని 23 వేల మంది రైతులకు ఒకేసారి లక్షన్నర రూపాయల రుణమాఫీ.. అది కూడా 72 గంటల్లోనే రైతుల ఖాతాల్లోకి మార్చి తిరిగి హైదరాబాద్ వెళతా.. ఇది రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు గురువారం చేసిన బహిరంగ ప్రకటన. ఇది ఆచరణ సాధ్యం కాలేదు.
► మంగళవారానికల్లా దాదాపు 7500 మంది రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ మొత్తం జమ చేస్తాం.. రాష్ర్ట మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పి.నారాయణ మాటలు. ఇది పాతపాటేనంటున్న రాజధాని రైతులు.
తాడికొండ : మంత్రులు, అధికారుల ప్రకటనలు రాజధాని రైతులను రుణమాఫీ విషయంలో అయోమయానికి గురిచేస్తున్నాయి. చెప్పే మాటలకు క్షేత్రస్థాయిలో అమలు తీరుకు పొంతన లేకపోవడంతో ఎవరి మాటలు నమ్మాలో అర్ధంకాని స్థితి నెలకొంది. 7500 మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ మొత్తం జమ చేసినట్లు నెల రోజుల క్రితమే ప్రకటించిన మంత్రి మళ్లీ అదే ప్రకటనను చేయడం విడ్డూరం. అంతేకాక నెలాఖరుకు రైతుల ఖాతాల్లో నూరుశాతం రుణమాఫీ నగదు జమ చేస్తామని ప్రకటించిన మంత్రుల మాటలపై రైతులకు అనుమానం కలుగుతోంది.
రాష్ర్ట ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో 30 బ్యాంకుల పరిధిలో తిరిగి రుణమాఫీపై పరిశీలించారు. అయినా నేటికీ ఈ ప్రక్రియ ఒక కొలిక్కి రాలేదు. దీంతో రైతులు మళ్లీ కౌలు డీడీలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. రైతులను భూ సమీకరణ దిశగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడ విఫలమవుతోంది. కొద్దిరోజుల క్రితం వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ తుళ్లూరులో రాజధాని రైతులకు సింగిల్ టైం రూ.1.5 లక్షల రుణమాఫీ జరుగుతున్నట్లు ప్రకటించారు.
ఎలాంటి ఆటంకాలు లేకుండా బ్యాంకర్లతో చర్చించామని నేడో రేపో బ్యాంకుల్లో ఆయా రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్ము జమ అవుతుందని చెప్పారు. కానీ మంత్రుల మాటలు నీటిమీద రాతలే అయ్యాయి. రైతులు మాత్రం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇప్పటికి కేవలం 7,500 మందికి రుణమాఫీ జమచేస్తే మిగతా 15,500 మంది రైతులకు ఎప్పటికి చేస్తారన్న ప్రశ్న రైతుల్లో వ్యక్తమవుతోంది. పూటకో ప్రకటనతో రైతుల్ని గందరగోళపర్చకుండా వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
అంతన్నారు..ఇంతన్నారు..
Published Wed, Apr 22 2015 3:43 AM | Last Updated on Sun, Sep 3 2017 12:38 AM
Advertisement
Advertisement