గ్రామాల్లోని ప్రతి చెరువునూ బాగు చేస్తాం
మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
వలపర్ల(మార్టూరు): ప్రతి గ్రామంలో ఉన్న చెరువులను బాగు చేసి అభివృద్ధి చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మండలంలోని వలపర్ల గ్రామంలో గురువారం జరిగిన ‘నీరు- చెట్టు’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభ లో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలన్నారు. గతంలో రైతులు తన పొలాల్లో గుంతలు ఏర్పాటు చేసుకుని వర్షం కురిసినప్పుడు, కాల్వలకు నీరు విడుదలైనపప్పుడు నిల్వ చేసుకొని అన్ని అవసరాలకూ ఉపయోగించుకునే వారన్నారు.
అనంతరం శిధ్ధారాఘవరావు మాట్లాడుతూ చెట్లు పెంచటం, నీటిని నిల్వ చేసుకోవటం ద్వారా భవిష్యత్తు అవసరాలకు ఇబ్బందులుండవన్నారు. పర్యావరణాన్ని కాపాడవల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం రాష్ట్ర ఎక్సైజ్‌శాఖా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మొక్కలను పెంచటం అనేది అందరి బాధ్యతగా గుర్తించాలన్నారు. జిల్లా పరిషత్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అందరూ ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాలన్నారు.
రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారు: ప్రత్తిపాటికి రైతుల మొర రుణమాఫీ విషయంలో బ్యాంకర్లు ఇబ్బంది పెడుతున్నారని బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెం గ్రామానికి చెందిన రైతులు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకి మొరపెట్టుకున్నారు. బ్యాంకర్లతో మాట్లాడి సమస్యలు పరిష్కరించటానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. అనంతరం డ్వాక్రా మహిళలకు రూ.56 లక్షల రుణాలను, ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు 10వ తరగతి స్టడీ మెటీరియల్‌ను అందించారు.
మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, ఇన్‌చార్జి కలెక్టర్ ఎం.హరిజవహరలాల్, అదనపు జాయింట్ కలెక్టర్ ఐ.ప్రకాశ్‌కుమార్, డ్వామా పథక సంచాలకుడు ఎన్.పోలప్ప, జలవనరుల శాఖ సూపరెంటెండెంట్ శారద, డివిజినల్ ఫారెస్ట్ అధికారి చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ మురళీ కృష్ణ, ఏపీఎంఐపీ పథక సంచాలకుడు బాపిరెడ్డి, ఉద్యానవనశాఖ సహాయ సంచాలకుడు సి.రాజేంద్రకృష్ణ, ఆర్‌డీవో కె, శ్రీనివాసరావు, గ్రామ సర్పంచి బూరగ వీరయ్య, ఎంపీపీ తాళ్లూరి మరియమ్మ, తహశీల్దార్ సుధాకర్ మండలంలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.