కేసీ కాలువ
కర్నూలు సిటీ: ఎక్కడైనా పాత పనులు పూర్తయిన తరువాత కొత్తవి మంజూరు చేయడం మనం చూస్తుంటాం. అలా కాకుండా కొత్త పనులు మంజూరు చేసుకుంటూ పోతే పాతవి పూర్తికాకపోగా..వాటిపై పర్యవేక్షణ కొరవడుతుంది. ఫలితంగా పనులు నాసిరకంగా కొనసాగే అవకాశం ఉంది. నీరు– చెట్టు పనుల్లో ప్రస్తుతం ఇదే తంతు కొనసాగుతోంది. అధికార పార్టీ నేతల ఆదాయం పెంపు కోసమే అన్నట్లు ఈ పనులకు అనుమతులు ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది.
నీరు–చెట్టు కార్యక్రమంలో భాగంగా... చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలలోని పూడికతీత, జంగిల్ క్లియరెన్స్‌కు తొలుత ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి ఒకే చెరువు కానీ, కుంట కానీ, వాగు పరిధిలోని పనులకు మొత్తంగా అంచనాలు వేసి టెండర్ల ద్వారా చేస్తేనే మెరుగైన ఫలితాలు ఉంటాయని ఇంజినీర్లు.. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అయితే అధికార పార్టీ నేతలు ఈ విషయంపై సీఎం దగ్గర పంచాయితీ చేశారు. రూ.10 లక్షలలోపు నామినేషన్ కింద పనులను టీడీపీ అనుచరులకు కేటాయించేలా చేశారు. విమర్శలు వచ్చినా పట్టించుకోకుండా.. ఒకే పనిని విభజించి పంచి పెట్టారు. ఆ తరువాత.. సాగునీటి కాలువల్లోని పూడికతీత, మరమ్మతులు సైతం నీరు–చెట్టు కింద చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు జిల్లాలో కేసీ కాలువ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ, తుంగభద్ర దిగువ కాల్వల పరిధిలోని మరమ్మతులు, పూడికతీతకు అంచనాలు వేసి, అనుమతులు తీసుకున్నారు. అయితే ఈ పనులే నేటికీ పూర్తి కాలేదు. తాజాగా కేసీ పరిధిలో మరో 174 పనులకు అనుమతులు తీసుకున్నారు. అయితే పనులు ఎక్కడ చేయాలో కూడా ఇంజినీర్లకు అర్థంకాని పరిస్థితులు ఉన్నాయి.
ఒత్తిడి తెచ్చి..
కర్నూలు–కడప కాలువ.. 305.60 కి.మీ దూరం ప్రయాణిస్తూ.. 2.65 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందిస్తోంది. కాలువ పూర్తి స్థాయి సామర్థ్యం 4500 క్యూసెక్కులు. పూడిక పేరుకుపోవడంతో సామర్థ్యం 2500 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ఆయకట్టు అభివృద్ధి కోసమని నీరు–చెట్టు కింద 2016–17లో 240 పనులను రూ.19 కోట్లతో చేపట్టారు. వాటిలో 198 పూర్తి కాగా, 26 పురోగతిలో ఉన్నాయి. 2017–18 సంవత్సరంలో 734 పనులను రూ. 91.13 కోట్లతో చేపట్టగా.. 270 పూర్తి కాగా, 197 పనులు పురోగతిలో ఉన్నట్లు అధికారుల గణంకాలు చెబుతున్నాయి. పనులు అధిక శాతం ఆళ్లగడ్డ, నంద్యాల, మైదుకూరు సబ్ డివిజన్ పరిధిలోనే చేపట్టారు. మంజూరైన పనులే పూర్తి చేసేందుకు ఇంజినీర్లు ఆపసోపాలు పడుతున్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి చేసి రూ.17 కోట్లతో 174 పనులకు అనుమతులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా అనుమతులు ఇచ్చిన పనులు ఎక్కడెక్కడ చేయాలో తెలియక ఇంజినీర్లు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు మాత్రం అధికార పార్టీ నేతలు కోరిన పనులు చేసి పెట్టాలని తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు చేస్తున్నట్లు జల వనరుల శాఖలో చర్చ జరుగుతుంది.
నా దృష్టికి రాలేదు
కడప–కర్నూలు కాలువ పరిధిలో నీరు–చెట్టు కింద తాజాగా చేసిన ప్రతిపాదనలు నా దృష్టికి రాలేదు. అయితే కేసీ, కుందూ నదికి సంబంధించిన వాటిలో పూడికతీత పనుల ప్రతిపాదనల గురించి చూడాలని కేసీ ఇంజనీర్లకు సూచించాను. ప్రతిపాదించే పనులు అవసరమో లేదో విచారించేందుకు ఆర్‌డీఓలకు అప్పగించారు. అక్కడి నుంచి వచ్చాక చూస్తాం. – శ్రీరామ చంద్రమూర్తి, జలవనరుల శాఖ ఎస్‌ఈ
Comments
Please login to add a commentAdd a comment