కంగుతిన్న వ్యవసాయ మంత్రి
తాడేపల్లి రూరల్ : మండలంలోని పెనుమాక గ్రామంలో గురువారం సీఆర్‌డీఏ అధికారులు నిర్వహించిన చెక్కుల పంపిణీ కార్యక్రమం వెలవెలబోయింది. కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా వ్యవసాయ శాఖామంత్రి ప్రత్తిపాటి పుల్లారావును ఆహ్వానించారు. గ్రామ సర్పంచ్ నివాసంలో భారీ స్థాయిలో టెంట్లు వేసి, కుర్చీలు ఏర్పాటు చేసి, సభావేదికను సిద్ధం చేశారు. అమాత్యుల వారు వస్తున్నారంటూ అధికారులు హడావుడి చేశారు.
మంత్రి రాక ఆలస్యం కావడంతో రైతులు ఎవరూ లేరు. దీంతో కంగుతిన్న అమాత్యులు స్థానిక నాయకులతో కాసేపు ముచ్చటించారు. అప్పటికీ రైతులు రాకపోవడంతో సభా వేదిక వద్ద వద్దులే.. సర్పంచ్ ఇంటి వద్దే చెక్కులు పంపిణీ చేద్దామని మంత్రి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 60కి పైగా చెక్కులు పంపిణీ చేస్తామని చెప్పిన మంత్రి 12 చెక్కులు పంపిణీ చేసి, ప్రభుత్వం గురించి పొగడ్తల వర్షం కురిపించి, మిగిలినవారు రాకపోవడంతో అక్కడ నుంచి నిష్ర్కమించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ భూసమీకరణకే రైతులు మొగ్గుచూపుతున్నారని, అందుకే సేకరణ వాయిదా వేశామన్నారు. రుణమాఫీలకు కట్టుబడి ఉన్నామని చెబుతుండగా, ఉండవల్లి గ్రామానికి చెందిన ఓ తెలుగు తమ్ముడు తనకు రుణమాఫీ జరగలేదంటూ మంత్రిని నిలదీశాడు. స్థానిక నాయకులు ఎంతగా వారించినా వినకపోగా, తనకు ఎందుకు రుణమాఫీ జరగదంటూ ప్రశ్నించాడు. దీంతో కంగుతిన్న నాయకులు మంత్రితో బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేయించి మాట్లాడించి అతడిని శాంతింపజేశారు.
వెలవెలబోయిన చెక్కుల పంపిణీ కార్యక్రమం
Published Fri, May 22 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 2:27 AM
Advertisement
Advertisement