చేనేతల పెద్ద కొడుకు! | Checks Distribution in Anantapur For Handloom Workers Families | Sakshi
Sakshi News home page

చేనేతల పెద్ద కొడుకు!

Published Wed, Dec 25 2019 10:36 AM | Last Updated on Wed, Dec 25 2019 10:36 AM

Checks Distribution in Anantapur For Handloom Workers Families - Sakshi

విశ్వసనీయత.. విలువలతో కూడిన రాజకీయం.. ఇచ్చిన మాటకు కట్టుబడటం.. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నైజం ఇది. ప్రతిపక్షంలో ఉన్నా.. అధికార పీఠంపై కూర్చున్నా.. ఆయన ప్రజల మనిషే. జనం సమస్యలపై స్పందించే తీరు కూడా అలాగే ఉంటుంది. ఎవరైనా కష్టాలు చెబితే చలించిపోతారు. బాధితులకు ఆప్తుడై ఆపన్న హస్తం అందిస్తారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నింపిన ఆయన.. తాజాగా ఇంటిపెద్దను కోల్పోయిన చేనేత కుటుంబాలకు అండగా నిలిచారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న ఒక్కో చేనేత కుటుంబానికి రూ.5 లక్షల సాయం మంజూరు చేశారు.

అనంతపురం, ధర్మవరం టౌన్‌: గత టీడీపీ పాలకులు పట్టించుకోక.. కుటుంబాన్ని పోషించే దారి తెలీక.. దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అండగా నిలిచారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం విడుదల చేశారు. ధర్మవరం పట్టణంలో మొత్తం 52 మంది చేనేత కుటుంబాలకు మంజూరైన చెక్కులను బుధవారం స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పంపిణీ చేయనున్నారు.  

చేనేతలను విస్మరించిన చంద్రబాబు
ధర్మవరం.. పట్టుచీరకు ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఇక్కడి నేతల పనితనం అంతర్జాతీయంగా వినుతికెక్కింది. వారిని మరింతగా ప్రోత్సహించాల్సిన గత టీడీపీ పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు దక్కించుకున్న నేతన్నలు పస్తులుండాల్సిన పరిస్థితి తలెత్తింది. రోజంతా మగ్గంపై పనిచేసినా పొట్టనిండని పరిస్థితుల్లో చేనేతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా గిట్టుబాటు ధరలు లేక, ప్రభుత్వ తోడ్పాటు లేక దాదాపు 60 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ప్రభుత్వం వాటిని ఆత్మహత్యలుగా గుర్తించకుండా తాత్సారం చేసింది. ఒకరిద్దరికి పరిహారం మంజూరు చేసి చేతులు దులుపుకుంది. ఈ నేపథ్యంలో అప్పటి ప్రతిపక్షనేతగా ఉన్న వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి 2018 జనవరి 6, 7, 8వ తేదీల్లో ధర్మవరం పట్టణంలో పర్యటించి బాధిత కుటంబాలను పరామర్శించారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అందరినీ ఆదుకుంటామని ఆనాడు చేనేతలకు మాట ఇచ్చారు. 

చేనేతల కోసం జోలె పట్టిన కేతిరెడ్డి
చేనేతల కష్టాలను చూసి చలించిన కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాల కోసం రాజీలేని పోరాటం చేశారు. చేనేతలకు సాయం అందించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని కోరారు. అయినా చంద్రబాబు సర్కార్‌ పట్టించుకోకపోవడంతో చేనేతలకు అండగా నిలిచారు. కుటుంబ పెద్దదిక్కును కోల్పోయిన చేనేత కుటుంబాలను ఆదుకునేందుకు 2018 నవంబర్‌ 19, 20వ తేదీల్లో పట్టణంలో జోలెపట్టి చేనేతల కోసం యాచించారు. కేతిరెడ్డి పిలుపుకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. చిన్న, పెద్దా, వ్యాపారులు, రైతులు, ప్రజలు తమవంతు సాయంగా అందించారు. భిక్షాటన ద్వారా వచ్చిన మొత్తాన్ని 37 మంది చేనేత కార్మికులకు ఒక్కొక్కరికి రూ.65 వేలు చొప్పున అందజేశారు. మరోవైపు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధర్మవరం పట్టణంలో చేనేత ఓదార్పు యాత్ర నిర్వహించి బాధిత కుటుంబాలకు సాయం అందించి భరోసానిచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత ఆత్మహత్యల బాధిత కుటుంబాలకు సాయం అందిస్తానని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. 

‘నేతన్న నేస్తం’ సభలో హామీ..ఆ వెంటనే మంజూరు
ఈ నెల 21న ‘నేతన్న నేస్తం’ పథకం ప్రారంభించేందుకు ధర్మవరం వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలకు పరిహారం అందజేస్తామని సభాముఖంగా ప్రకటించారు. ఎవరూ అధైర్య పడవద్దని.. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇంటి తలుపుతట్టి పరిహారం అందజేస్తామని భరోసానిచ్చారు. సభ ముగియగానే నిధులు మంజూరు చేశారు.

నేడు చెక్కులను అందజేయనున్న ఎమ్మెల్యే
ఆత్మహత్య చేసుకున్న 52 మంది చేనేత కుటుంబాలకు మంజూరైన మొత్తాన్ని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అందజేయనున్నారు. నేరుగా బాధిత చేనేతల కుటుంబాల వద్దకే వెళ్లి చెక్కులు వారికి ఇవ్వనున్నారు. చేనేతలకు అండగా నిలుస్తూ వారి కుటుంబాలను ఆదుకునేందుకు  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివిధ చేనేత సంఘాలు, కార్మికులు స్వాగతిస్తున్నాయి. ఇచ్చిన హామీని అనతికాలంలోనే నిలబెట్టుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తీరును అందరూ కొనియాడుతున్నారు.

తలుపుతట్టి సాయం చేస్తా
చేనేతలు ఆత్మహత్యలు చేసుకుంటే గత టీడీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. బాధిత కుటుంబాలకు నయాపైసా ఇవ్వకుండా మోసం చేసింది. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు మీ సోదరుడున్నాడని మరవకండి. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున మీ ఇంటికి వచ్చి తలుపుతట్టి నేరుగా చెక్కును అందజేయబోతున్నాం.- ఈ నెల 21న ధర్మవరం ‘నేతన్న నేస్తం’ సభలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement