కోట్ల విలువైన భూములిచ్చాం.. అన్యాయం చేయొద్దు! | Objections to errors in the allocation of plots | Sakshi
Sakshi News home page

కోట్ల విలువైన భూములిచ్చాం.. అన్యాయం చేయొద్దు!

Published Fri, Apr 8 2016 1:44 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

కోట్ల విలువైన భూములిచ్చాం.. అన్యాయం చేయొద్దు! - Sakshi

కోట్ల విలువైన భూములిచ్చాం.. అన్యాయం చేయొద్దు!

సర్కారుకు రైతుల మొర
మంత్రి ముంగిట మంగళగిరి,  తాడేపల్లి మండలాల రైతుల ఆవేదన
ప్లాట్ల కేటాయింపులో లోపాలపై అభ్యంతరాలు

 
సాక్షి, విజయవాడ బ్యూరో : కోట్ల విలువైన భూములిచ్చిన తమకు అన్యాయం చేయొద్దంటూ రాజధాని ప్రాంత రైతులు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. గురువారం విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతుల సమావేశంలో సర్కారు తీరుపై పలు సందేహాలు వ్యక్తం చేశారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ సమక్షంలో వారు పలు అంశాలు ప్రస్తావించారు. ప్రధానంగా ప్లాట్ల కేటాయింపులో జరుగుతున్న లోపాలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అవి వారి మాటల్లోనే..
 
 ప్రభుత్వానికో రూలు.. మాకో రూలా
 రాజధాని కోసం భూములు త్యాగాలు చేసిన రైతులకు ఒక రూలు, ప్రభుత్వానికి అనుకూలంగా మరో రూలు అమలు చేయడం సరికాదు. కమర్షియల్ ప్లాట్లలో ప్రభుత్వం 18 అంతస్తులు నిర్మించుకునే అవకాశం పెట్టుకుని, అదే రైతులకైతే 11 అంతస్తుల వరకే అనుమతించడం దారుణం. రాజధాని అంతటా ప్రభుత్వానికి, రైతులకు ఒకే తరహా పాలసీ ఉండాలి. భూములు ఇచ్చిన రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇచ్చి వాటి ద్వారా బ్యాంకుల్లో ఎకరాకు రూ.3 లక్షల నుంచి 4 లక్షల వరకు రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి. కేటాయించే ప్లాట్లలో నిర్మించే ఇంటి ప్లాన్ ఫీజును మినహాయించాలి.     - శివరామకృష్ణయ్య, మందడం రైతు
 
 వాస్తు ప్రకారమే ఇవ్వాలి...
 రాజధాని ప్రాంతంలో రైతులకు ఇచ్చే ప్లాట్లు నార్త్ ఈస్ట్ వాస్తు ప్రకారం కేటాయించాలి. రాజధాని నిర్మాణమే వాస్తు ప్రకారం చేపట్టినప్పుడు భూములు ఇచ్చిన రైతులకు వాస్తు ప్రకారం ప్లాట్లు ఇవ్వకపోతే అన్యాయం చేసినట్టే. అవసరమైతే రైతులు వారిలో వారు తమ ప్లాట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించాలి. ఏ రెవెన్యూ గ్రామంలోని రైతులకు ఆ గ్రామంలోనే ప్లాట్లు కేటాయించాలనే నిబంధన కచ్చితంగా పాటించాలి.    - రవీంద్రబాబు, రైతు
 
 ఆరోగ్య సేవల్లో దీర్ఘకాలిక రోగాలకు మందులివ్వాలి
 భూములిచ్చిన రైతులకు పూర్తిగా ఉచిత వైద్య సేవలు అందించాలి. శస్త్రచికిత్సలే కాకుండా దీర్ఘకాలిక రోగాలకు మందులను అందించేలా వైద్య సేవల్లో నిబంధనలు సడలించాలి. ప్లాట్లలో నిర్మాణాల విషయంలో ప్రభుత్వానికి ఒకలా, రైతులకు మరోలా నిబంధనలు ఉండటం సరికాదు.  - రమేష్, కృష్ణాయపాలెం
 
 
 సకాలంలో ప్లాట్లు కేటాయిస్తారా
 రాజధాని ప్రాంతంలో అందరికీ ప్లాట్లు సకాలంలో కేటాయిస్తారా అనే అనుమానం కలుగుతోంది. భూములివ్వని రైతులు కోర్టుకు వెళ్లారు. వాటి విషయం తేలేవరకు ప్రభుత్వం వేచిచూస్తే భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపులో జాప్యం కలుగుతుంది. అలా కాకుండా భూములిచ్చిన రైతులకు వీలైనంత త్వరగా ప్లాట్లు కేటాయించాలి. మా ప్రాంతంలో 200 మీటర్ల రోడ్డు వేయకుండా ఆపేశారు. దాన్ని పూర్తి చేయాలి.    - శ్రీధర్, పెనుమాక రైతు
 
 ఫారెస్ట్, అసైన్డ్ భూములపై స్పష్టత లేదు
ఫారెస్ట్, అసైన్డ్ భూముల విషయంలో స్పష్టత లేదు. తుళ్లూరు మండలంలో ఫారెస్టు భూములకు క్లియరెన్స్ ఇచ్చి రిజిస్ట్రేషన్‌కు సహకరిస్తున్నారు. మా గ్రామంలో భూములకు రిజిస్ట్రేషన్ చేయాలంటే సవాలక్ష కొర్రీలు వేస్తున్నారు. తుళ్లూరుపై ఉన్న శ్రద్ధ, మా ప్రాంతంపై ఎందుకు లేదు? - సురేంద్రబాబు, నీరుకొండ రైతు
 
ఎస్సీల భూములకు చెక్కులు ఇవ్వలేదు
రాజధాని ప్రాంతంలో ఎస్సీల భూములకు కౌలు చెక్కులు ఇంతవరకు ఇవ్వలేదు. తక్షణం కౌలు చెక్కులు ఇవ్వాలి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను స్థానిక ప్రజాప్రతినిధులకు సీఆర్‌డీఏ అధికారులు చెప్పడం లేదు. మాకు కూడా వివరాలు అందించాలి. దీనివల్ల ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించి పరిష్కారం చూపే అవకాశం ఉంటుంది. అభివృద్ధి, ప్రజల సంక్షేమం విషయంలో సీఆర్‌డీఏ అధికారులు ప్రజాప్రతినిధులను కలుపుకొని వెళ్లాలి.  - పి.రత్నకుమారి, మంగళగిరి ఎంపీపీ
 
 
 రైతుల సూచనలు సీఎం దృష్టికి తీసుకెళ్తాం
 సీఆర్‌డీఏ నిర్వహించిన సమావేశంలో రైతులు ప్రస్తావించిన ప్రతి సమస్యనూ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ శ్రీధర్ హామీ ఇచ్చారు. మంగళగిరి, తాడేపల్లి మండలాల రైతులకు రాజధానిలో రోడ్డు, ప్లాట్లు, జోనింగ్ నిబంధనలు తదితర అంశాలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాజధాని ప్రాంతంలో ఉచిత విద్య, వైద్యం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ల్యాండ్ పూలింగ్ అమలైన నాటి నుంచి దీన్ని వర్తింపజేసి రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలన్న ప్రతిపాదన సీఎం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. నేలపాడును నమూనాగా తీసుకుని ప్లాట్ల విభజన చేపట్టామని, ఇలాగే అన్ని గ్రామాల్లోనూ పూర్తి చేస్తామని శ్రీధర్ చెప్పారు. ప్రతి గ్రామానికీ డ్రాఫ్ట్ లేఅవుట్ ఇచ్చి దానిపై 30 రోజుల్లో రైతుల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు.

ఆ ప్రక్రియ పూర్తయ్యాక లేఅవుట్ ప్లాన్‌ను ఫైనల్ చేస్తామని చెప్పారు. ప్లాట్ల విషయంలో 9.18 పత్రాలను రైతులు ఇవ్వాల్సి ఉంటుందని, ప్లాట్లు ఎలా కావాలనే దానిపై ఆ అంగీకార పత్రంలో తెలపాల్సి ఉంటుందని వివరించారు. ఇద్దరు, ముగ్గురు, ఎంతమందైనా కలిసి ఒకేచోట ప్లాట్లు తీసుకోవచ్చని, వాటిని అమ్ముకోవచ్చని అన్నారు. లేఅవుట్‌లో రైతులకు కేటాయించిన నిర్దిష్ట కొలతలతో కూడిన ప్లాట్లు కాకుండా మిగిలిన ప్లాట్లను వేలం వేసి ఆ మొత్తాన్ని రైతులకు పంచనున్నట్లు చెప్పారు. లేఅవుట్లలో మొదటి ఏడాది 50 నుంచి 80 అడుగుల వెడల్పుతో గ్రావెల్ రోడ్డు, రానున్న మూడేళ్లలో తారు రోడ్లు వేసి అభివృద్ధి చేస్తామన్నారు.

లేఅవుట్లను నార్త్ ఈస్ట్ ప్రకారం పక్కా వాస్తుతో వేస్తావని, కొన్ని సౌత్‌కు కూడా ఉంటాయని చెప్పారు. ఎకనామిక్స్ యాక్టివిటీ కోసమే కమర్షియల్ ప్లాట్లలో ప్రభుత్వం 18 అంతస్తుల వరకు నిర్మించుకోవచ్చని, రైతులు 11 అంతస్తుల వరకే నిర్మించుకోవాలనే నిబంధన పెట్టడం జరిగిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement