♦ లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి గాథను దారి మళ్లించిన సర్కార్
♦ బాధితుల పక్షాన సభలో వాణి వినిపించిన వైఎస్ జగన్
♦ అన్యాయాన్ని ఆధారాలతో సహా నిలదీసిన ప్రతిపక్షనేత
♦ మంత్రి ప్రత్తిపాటి కారుచౌకగా ‘అగ్రి’ భూముల కొనుగోళ్లపై కలకలం
♦ ఇరుకున పడ్డ అధికారపక్షం.. చర్చను దారి మళ్లించేందుకు అడ్డదారులు
సాక్షి, అమరావతి: న్యాయం చేయండి మహాప్రభో అని లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు మొరపెట్టుకుంటున్నా.. నెలల తరబడి ఆందోళనలు చేస్తున్నా.. కనికరించకపోవడమే కాదు కనీసం కన్నెత్తి చూడని చంద్రబాబు ప్రభుత్వం శాసనసభ వేదికగా ఆ అంశానికి మరోమారు పాతరేసే ప్రయత్నం చేసింది. 32 లక్షల కుటుంబాల్లోని 1.28 కోట్ల మందిని రోడ్డు పాలు చేసిన అగ్రిగోల్డ్ కుంభకోణంపై శాసనసభలో చర్చను అధికారపక్షం పక్కదారి పట్టించింది. బాధితుల పక్షాన ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారాలతో సహా నిలదీస్తోంటే.. తమ బండారం బట్టబయలవుతుం దని అధికారపక్షం భయపడింది.
స్వయంగా సీఎం చంద్రబాబు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ కాలవ శ్రీనివాసులు అడుగడుగునా అడ్డు తగిలి ప్రతిపక్షం గొంతునొక్కారు. ఈ వ్యవహారంలో బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు కూడా పాలు పంచుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ నుంచి తక్కువ ధరకే భూములు కొనుగోలు చేయడాన్ని కప్పిపుచ్చు కునేందుకు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చర్చకు సంబంధం లేని రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెస్తే..
ఆర్థిక మంత్రి యనమల 40 రోజుల క్రితం స్పీకర్ కోడెల శివప్రసాదరావు విలేకరుల సమావేశంలో వెల్లడించిన అంశాన్ని ‘సాక్షి’ బహిర్గతం చేయడాన్ని ప్రస్తావనకు తెచ్చి చర్చను పక్కదోవ పట్టించారు. చర్చను దారిమళ్లించే క్రమంలో అధికారపక్షం అడుగ డుగునా కవ్వించినా వైఎస్ జగన్ సంయమనం పాటిస్తూ అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన తన వాణిని విన్పించడానికి, వాస్తవాలను వివరించడానికే ప్రాధా న్యం ఇచ్చారు. అగ్రిగోల్డ్ కుంభకోణంపై చర్చ సందర్భంగా గురువారం శానసభలో చోటుచేసుకున్న వరుస నాటకీయ పరిణామాలను పరిశీలిస్తే..
అసెంబ్లీలో ‘అగ్రి’ భారతం...దారి మళ్లిన 18 పర్వాలివీ...
సీన్–1: జీరో అవర్ తర్వాత అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీఎం చంద్రబాబునాయుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే అంశంపై ప్రతి కేబినెట్ సమావేశంలోనూ చర్చిస్తున్నామని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇస్తామన్నారు. సీఐడీ ఇప్పటివరకూ ఏడుగురు డైరెక్టర్లను అరెస్టు చేసిందన్నారు. మరో 11 మంది డైరెక్టర్లను పట్టిస్తే ఒకొక్కరికి రూ.పది లక్షల చొప్పున బహుమానంగా ఇస్తామని చెప్పారు. కేసు హైకోర్టు విచారణలో ఉందని.. ఆ సంస్థకు చెందిన ఆస్తులను వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని వివరించారు.
సీన్–2: సీఎం స్టేట్‌మెంట్ తర్వాత ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.7300 కోట్లని సీఐడీ అంచనా వేయడాన్ని గుర్తు చేస్తూ.. కేవలం రూ.1,182 కోట్లు సర్కార్ ఇవ్వగలిగితే 13.83 లక్షల మంది డిపాజిటర్లకు పూర్తిగా న్యాయం చేయవచ్చునని వైఎస్ జగన్ వివరించా రు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని బాబుకు సూచించారు. అగ్రిగోల్డ్ కుంభకోణంలో సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఆధారాలతో ఎండగట్టారు. ఆ సంస్థ చైర్మన్ అవ్వా సోదరుల్లో ఆరుగురిని ఇప్పటికీ అరెస్టు చేయకపోవడాన్ని తప్పుబట్టారు. దాంతో పాటు అవ్వా సోదరుల్లో ఒకరైన సీతారాం అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మేస్తూ సొమ్ము చేసుకుంటున్న తీరును వివరించారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తక్కువ ధరలకే కొనుగోలు చేసిన అంశాన్ని ఎత్తి చూపారు.
సీన్–3: ఇంతలోనే స్పీకర్.. జగన్ మైక్ కట్ చేసి ప్రత్తిపాటికి అవకాశం ఇచ్చారు. గత శాసనసభలో ప్రతిపక్ష నేత ఇదే అంశాన్ని ప్రస్తావించారని చెబు తూనే చర్చతో సంబంధం లేని, సభలో సభ్యుడే కాని కరణం ధర్మశ్రీ రుణమాఫీ అంశాన్ని తెరపైకి తెచ్చారు. అవాస్తవమైన విమర్శలు చేస్తూ తన ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తాను అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని.. నిరూపించక పోతే ప్రతిపక్ష నేత రాజీనామా చేస్తారా అని సవాల్ విసిరారు. ఇదే క్రమంలో ఈ వ్యవహారంపై సభా సంఘం వేయాలని కోరారు.
సీన్–4: స్పీకర్ అవకాశం ఇవ్వడంతో జగన్ మాట్లాడు తూ ఉదయ్ దినకర్ అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్ ల్యాండ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారని వివరించారు. ‘2014లో అగ్రిగోల్డ్‌పై కేసు నమోదైంది. భూము లు కొనకల్లు ఉదయ్ దినకర్ అమ్మారు.. ప్రత్తిపాటి కొనుగోలు చేశారు.. గత శాసనసభలోనే పూర్తి ఆధారాలు ఇచ్చాను. చర్యలు తీసుకోవడం తీసుకో కపోవడం సీఎం ఇష్టం... ఇదే అంశంపై మాట్లాడితే సభ పక్కదోవ పడుతోంది. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేసినట్లు అవుతుంది’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించే యత్నం చేశారు.
సీన్–5: ఇంతలోనే విపక్ష నేతకు మైక్ కట్ చేసిన స్పీకర్.. మంత్రి అచ్చెన్నాయుడుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ మంత్రి పుల్లారావు విసిరిన సవాల్ స్వీకరిస్తున్నారో లేదో చెప్పాలని కోరుతూనే విపక్ష నేతపై వ్యక్తిగత దూషణలకు దిగారు.
సీన్–6: జగన్‌కు అవకాశం ఇస్తున్నట్లుగానే ఇచ్చి.. మళ్లీ మైక్ కట్‌చేసి పత్తిపాటికి స్పీకర్ అవకాశం ఇచ్చారు. ఉదయ్ దినకర్ నుంచి భూములు కొనుగోలు చేసిన అంశాన్ని అంగీకరించిన పత్తిపాటి.. వాటికి అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. అదే క్రమంలో జగన్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారు.
సీన్–7: జగన్‌కు మైక్ ఇస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. మంత్రి యనమలకు అవకాశం ఇచ్చారు. యన మల మాట్లాడుతూ.. ప్రత్తిపాటి విసిరిన సవాల్‌కు ప్రతిపక్ష నేత కట్టుబడుతున్నారో లేదో చెప్పిన తర్వాతే ఆయనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. ప్రత్తిపాటి అగ్రిగోల్డ్ భూములు కొనుగోలు వ్యవహారంపై సభా సంఘం వేయాల ని కోరారు. ప్రత్తిపాటి తప్పు చేసినట్లయితే ఆయనను సభ నుంచి బహిష్కరించాలని.. అవాస్తవమని తేలితే ప్రతిపక్ష నేతను సభ నుంచి వెలివేయాలని డిమాండ్ చేశారు.
సీన్–8: స్పీకర్ మైక్ ఇవ్వడంతో జగన్ మాట్లాడుతూ ‘ఉదయ్ దినకర్ అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్ ల్యాండ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. సీఈవోగానూ వ్యవహరిస్తున్నారు. చర్యలు తీసుకోవడం తీసుకోక పోవడం సీఎం ఇష్టం.. మంత్రి ప్రత్తిపాటి ఇష్టం. అగ్రిగోల్డ్ భూములను వేలం వేసి డిపాజిటర్లకు న్యాయం చేయాలి. హాయ్‌ల్యాండ్ భూములు.. విశాఖలో యారాడ భూములు ఎందుకు వేలం వేయడం లేదు’ అంటూ ప్రశ్నించారు.
సీన్–9: ఇంతలోనే జగన్ మైక్ కట్ చేసిన స్పీకర్.. బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజుకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడు తూ ప్రత్తిపాటి సవాల్‌ను విపక్ష నేత కచ్చితంగా స్వీకరించాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇదే క్రమంలో చర్చతో సంబంధం లేని కరణం ధర్మశ్రీ రుణ మాఫీ వ్యవహారాన్ని ప్రస్తావించారు.
సీన్–10: జగన్‌కు మైక్ ఇస్తున్నట్లు ప్రకటించిన స్పీకర్.. మరోసారి యనమలకు అవ కాశం ఇచ్చారు. ప్రత్తిపాటి సవాల్‌ను స్వీక రిస్తున్నారో లేదో తేల్చిన తర్వాతే విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని యనమల డిమాండ్ చేశారు.
సీన్–11: జగన్ మాట్లాడుతూ ‘సభా సంఘం వేస్తే ఏమవుతుంది.. ప్రివిలేజ్ కమిటీలో ఏం జరిగిందో అదే జరుగుతుంది.. ఏడుగురు సభ్యుల్లో ఆరుగురు అధికారపార్టీ వారే ఉంటారు. అప్పుడు వారు చెప్పిందే సభా సంఘం చేస్తుంది.. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి ఆదేశించండి’ అని కోరారు.
సీన్–12: మళ్లీ జగన్ మైక్ కట్ చేసిన స్పీకర్.. అచ్చెన్నాయుడుకు మరో సారి మైక్ ఇచ్చారు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘సభా సంఘం వేయాలో.. జుడీషియల్ ఎంక్వైరీ వేయాలో సభ నిర్ణయిస్తుంది.. ప్రత్తిపాటి సవాల్‌ను స్వీకరిస్తున్నా రో లేదో విపక్ష నేత చెప్పాలి.. లేదంటే జగన్‌ను బహిష్కరించండి’ అని స్పీకర్‌ను డిమాండ్ చేశారు.
సీన్–13: జగన్‌కు మైక్ ఇస్తున్నట్లుగా ప్రకటించిన స్పీకర్.. వెంటనే చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులకు అవకాశం ఇచ్చారు. అంతకు ముందే సీఎంతో మంతనాలు సాగించిన కాలవ.. జగన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఆ క్రమంలోనే జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ముందు విలేకరు ల సమావేశంలో స్పీకర్ వెల్లడించిన అంశాలను ‘సాక్షి’ టీవీ, పత్రిక వక్రీకరించాయని వాటిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే అనిత కూడా ఇదే అంశాన్ని ప్రస్తా వించారు. స్పీకర్ విలేకరుల వద్ద వెల్లడించిన వివరాలను శాసనసభలో ప్రదర్శించాలని కోరారు.
సీన్–14: మరోసారి జగన్‌కు మైక్ ఇస్తున్నట్లుగా ప్రకటించిన స్పీకర్ కోడెల.. సీఎం చంద్రబాబుకు అవకాశం ఇచ్చారు. దాంతో విపక్ష సభ్యులు పోడి యం వద్ద నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశా రు. అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ ఎంక్వైరీకి ఆదేశించాలని నినాదాలు హోరెత్తించారు. నినాదాల మధ్యే బాబు మాట్లాడుతూ.. ప్రత్తిపాటి విసిరిన సవాల్‌ను ప్రతిపక్ష నేత స్వీకరిస్తారో లేదో చెప్పాలని డిమాం డ్ చేశారు. తప్పని తేలితే ప్రత్తిపాటిని సభ నుంచి వెలేస్తామని.. అవాస్తమని తేలితే వైఎస్ జగన్ రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా రా చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తేల్చి చెబితే విపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వంపై ‘సాక్షి’ పత్రిక, టీవీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని.. జాతీయ మహిళా పార్లమెంట్‌కు ముందు స్పీకర్ కోడెల విలేకరుల వద్ద చెప్పిన అంశాలను వక్రీకరించింద ని.. ఆ సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు.
సీన్–15: స్పీకర్ జోక్యం చేసుకుంటూ మంత్రి సవాల్‌కు స్వీకరిస్తున్నారో లేదో తేల్చిచెప్పిన తర్వాతే మాట్లాడాలని జగన్‌కు సూచించారు. జగన్‌కు అవకాశం ఇస్తున్నట్లుగా ఇచ్చి ఆ తర్వాత మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అవకాశం ఇచ్చారు. కామినేని మాట్లాడుతూ జాతీయ మహిళా పార్ల మెంట్ సదస్సుకు ముందు స్పీకర్ విలేకరుల వద్ద వెల్లడించిన అంశాలను ‘సాక్షి’ టీవీ, పత్రికలు వక్రీకరించాయని.. వాటిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత స్పీకర్ మాట్లాడుతూ సభ వాయిదా వేద్దామని.. సభ ప్రారంభమయ్యాక తాను విలేకరుల వద్ద వెల్లడించిన అంశాల వీడియోను ప్రదర్శిస్తామని చెప్పారు.
సీన్–16: 10 నిమిషాల తర్వాత సభ ప్రారంభమైంది. స్పీకర్ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. అగ్రిగోల్డ్ బాధితుల అంశంపై చర్చించకపోవడాన్ని నిరసిస్తూ విపక్ష సభ్యులు ఈ సభకో నమస్కారం అంటూ వెలుపలికి వచ్చేశారు. వీడియో ప్రదర్శన ముగిసిన తర్వాత స్పీకర్ మాట్లాడుతూ.. ‘జరిగింది ఇది.. చర్యలు తీసుకునే నిర్ణయం సభదే’ అన్నారు.
సీన్–17: ఆ తర్వాత మంత్రి యనమల, టీడీపీ ఎమ్మెల్యేలు బుచ్చయ్య చౌదరి, గౌతు శ్యామసుంద ర శివాజీ, బీజేపీ శాసనసభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ‘సాక్షి’ పత్రిక, టీవీలపై చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.
సీన్–18: ఆ తర్వాత సీఎం మాట్లాడుతూ శుక్రవారం సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ఉన్నప్పుడు మరోసారి ఇదే వీడియోను ప్రదర్శించాలని స్పీకర్‌కు సూచించారు. ఆ తర్వాత అగ్రిగోల్డ్ కుంభకోణంపై మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు పరిహారాన్ని రూ.3 లక్షల నుంచి రూ.ఐదు లక్షలకు పెంచుతున్నామని చెప్పారు. అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు.
అగ్రిగోల్డ్ బాధితుల గోడు ఇదీ..
పైసాపైసా కూడబెట్టుకున్న పేదలు అధికవడ్డీ ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేస్తే జనం సొమ్ముతో వేల ఎకరాలు కొనుగోలు చేసిన ఆ సంస్థ యాజమాన్యం చివరకు డిపాజిటర్లకు డబ్బు చెల్లించకుండా చేతులెత్తేసింది. సాధారణంగానైతే ఆ సంస్థ ఆస్తులన్నీ అమ్మి డిపాజిటర్లకు చెల్లించాలి. కానీ సంస్థ యాజమాన్యంతో కుమ్మక్కయిన ప్రభుత్వ పెద్దలు డిపాజిటర్ల నెత్తిన శఠగోపం పెడుతూ విలువైన ఆస్తులన్నిటినీ కైంకర్యం చేసేశారు. ఓ కేంద్ర మంత్రి, పలువురు రాష్ట్రమంత్రులు, అనేకమంది టీడీపీ నాయ కులు ఈ వ్యవహారంలో ఉన్నారన్న ఆరోప ణలున్నాయి. దీంతో తమకు న్యాయం జరిపించాలని బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఏడాదిన్నర నుంచి మొరపె ట్టుకుంటున్నా, ఆందోళనలు చేస్తున్నా, చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రాష్ట్రప్రభుత్వం స్పందించడంలేదు.
‘అగ్రి’ చర్చ బుగ్గి
Published Fri, Mar 24 2017 2:20 AM | Last Updated on Sat, Aug 18 2018 5:15 PM
Advertisement