వైఎస్ జగన్ సవాల్ తో ఇరుకునపడ్డ ప్రభుత్వం
అమరావతి: అగ్రిగోల్డ్ అంశంపై సవాళ్లు ప్రతిసవాళ్లతో గురువారం ఏపీ అసెంబ్లీ వేడెక్కింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భూములపై హౌస్ కమిటీ విచారణకు ప్రభుత్వం సిద్ధమని తెలిపింది. అయితే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటే హౌస్ కమిటీతో కాదని... సిట్టింగ్ జడ్డితో జ్యుడీషియల్ విచారణ జరగాలని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సభలో డిమాండ్ చేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తులను మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి కొనుగోలు చేసినట్లు, గతంలో పుల్లారావే అంగీకరించిన విషయాన్ని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హౌస్ కమిటీ వేస్తే, ప్రివిలేజ్ కమిటీ మాదిరిగానే ఉంటుందని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీలో అధికార, ప్రతిపక్షమే ఉందని... ప్రివిలేజ్ కమిటీలోసభ్యుల్లో, ఐదుగురు అధికారపక్షం వారేనని, ఒకరు మాత్రమే ప్రతిపక్ష సభ్యుడు ఉంటారని, దాంతో తమకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్నారు.
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ అంశంపై జుడీషియల్ విచారణకు ముందుకు రావాలని జగన్ సవాల్ విసిరారు. దీంతో ఇరుకునపడ్డ ప్రభుత్వం ప్రతిపక్షంపై ఎమ్మెల్యేలు, మంత్రులతో ఎదురుదాడికి దిగింది. ఈ సందర్భంగా సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొనడంతో స్పీకర్ సభను పదినిమిషాలు పాటు వాయిదా వేశారు.
మరోవైపు అగ్రిగోల్డ్ విచారణకు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వైఎస్ జగన్ డిమాండ్‌ను తాను స్వీకరిస్తున్నాని...ప్రత్తిపాటి సవాల్‌ను ప్రతిపక్ష నేత జగన్ స్వీకరిస్తారా అని ప్రశ్నించారు. ఎవరిది తప్పో తేలితే వారిని సభ నుంచి బహిష్కరిద్దామని అన్నారు.