పవన్ సూచనలను పాటిస్తాం
మున్సిపల్ మంత్రి నారాయణ
సాక్షి, గుంటూరు : పవన్ కళ్యాణ్ సూచనల ప్రకారం ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల నుంచి భూములు సమీకరిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు. బుధవారం రాత్రి జీజీహెచ్‌లో విలేకరులతో మాట్లాడుతూ రైతుల్లో గ్రామ కంఠాలపై ఉన్న అభ్యంతరాలను తీరుస్తూ ముందుకు సాగుతామన్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, శనివారం సాయంత్రానికి 99 శాతం గ్రామ కంఠాలపై అనుమానాలను పూర్తిగా తీరుస్తామని, చిన్నచిన్నవి ఏమైనా ఉంటే సోమవారం పూర్తి చేస్తామన్నారు.
మరో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ రైతులు 9.5 గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని, గతంలో 9.5ను నెట్‌లో పెట్టారని, ప్రస్తుతం నెట్‌లో నుంచి తొలగించామని చెప్పారు. గ్రామ కంఠాలు ప్రకటించిన తీరు అస్తవ్యస్తంగా ఉన్నందున రైతుల్లో గందరగోళం నెలకొందని అన్నారు.జీజీహెచ్‌లో జరిగిన ఘటన కలిచి వేసిందని, ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత మృత శిశువు కుటుంబానికి ఎక్స్‌గ్రేషియో ప్రకటిస్తామన్నారు.