నాగార్జున యూనివర్శిటీని మోడ్రన్ యూనివర్శిటీ మారుస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
గుంటూరు : నాగార్జున యూనివర్శిటీని మోడ్రన్ యూనివర్శిటీ మారుస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శనివారం ఆచార్య నాగార్జున నగర్లోని నాగార్జున యూనివర్శిటీలో ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... గతంతో పోల్చితే యూనివర్శిటీ అన్ని విధాల మెరుగుపడిందన్నారు. యూనివర్శిటీ ప్రాంగణంలో పోలీస్ మొబైల్ వ్యాన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. యూనివర్శిటీలో ఏం జరిగిన వారు వెంటనే స్పందిస్తారని చెప్పారు.
అభయ్ ఐక్లిక్ ని కూడా త్వరలో ఇక్కడ ప్రవేశపెడతామన్నారు. ర్యాగింగ్ వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి కేసులో ఎవరిని వదిలేది లేదన్నారు. తప్పు చేసినవారు శిక్ష అనుభవించాల్సిందేనని... చట్టానికి ఎవరు చుట్టాలు కారని మంత్రి మరో సారి స్పష్టం చేశారు. ర్యాగింగ్ నివారణకు బాలసుబ్రమణ్యం కమిటీ సూచనలు అమలు చేస్తామని మంత్రి గంటా ఈ సందర్భంగా చెప్పారు.